కేజ్రీవాల్, ఈడీ ముందుకు వస్తారా? ప్రజల ముందు వెళ్తారా?
x
ఢిల్లీ ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్

కేజ్రీవాల్, ఈడీ ముందుకు వస్తారా? ప్రజల ముందు వెళ్తారా?

ఈడీ, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ మధ్య దాగుడు మూతల ఆట నడుస్తోంది. ఇప్పటికే మూడు సార్లు ఈడీ నోటీసులకు హజరుకాకుండా కేవలం ఉత్తరాలతోనే ఢిల్లీ సీఎం సమాధానమిస్తున్నారు.


వచ్చే లోక్ సభ ఎన్నికల్లో ప్రజల ముందే ఈ విషయాన్ని తేల్చుకోవాలని ఆయన చూస్తున్నారు. అంతకుముందే ఈడీ అరెస్ట్ చేస్తే జైలు నుంచే ప్రభుత్వాన్ని నడిపే ఆలోచనలో ఆప్ నాయకత్వం ఉంది.

రాష్ట్రం, కేంద్ర పాలితప్రాంతాల ప్రభుత్వాలకు నాయకత్వం వహిస్తున్న పాలకులను కేంద్ర దర్యాప్తు సంస్థలు విచారించి అరెస్ట్ చేయవచ్చా? సామాన్య ప్రజలను కానీ, న్యాయకోవీదులను కానీ ఈ ప్రశ్న అడిగి చూడండి. సమాధానం రావడం కొంచెం కష్టమే. ఎందుకంటే దేశంలో చాలా తక్కువ మంది నాయకులు మాత్రమే జైలుకు వెళ్లారు. ఇప్పుడు ఇదే బాటలో ఢిల్లీ ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్ వెళ్లే అవకాశం ఉంది.

ఢిల్లీ మద్యం కుంభకోణంలో విచారణ కోసం కేంద్ర దర్యాప్తు సంస్థ కేజ్రీవాల్ కు ఇప్పటికే మూడుసార్లు సమన్లు పంపింది. అయితే అందులో తనను సాక్షిగా పిలుస్తున్నారా లేక నిందితుడిగా పిలుస్తున్నారా సరిగా చెప్పటం లేదని ఆయన ఆరోపిస్తూ విచారణకు హజరుకాకుండా కేవలం సమాధానాలు మాత్రమే పంపిస్తున్నారు. తనను విచారణకు పిలవడం ఆయన చట్టవిరుద్దమైన అంశంగా చెబుతున్నారు. ఇప్పటికే ఇదే అంశంపై న్యాయనిఫుణుల అభిప్రాయం సైతం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ విధంగా ఇరు పక్షాల ప్రతిష్టంభన కొనసాగుతోంది.

మరోసారీ సమన్లు వస్తాయా?

మద్యం కుంభకోణం విచారణకు రెండేళ్లు నిండాయి. అయితే తనను అనవసరంగా అక్రమ కేసుల్లో ఇరికించాలని చూస్తున్నారని, లోక్ సభ ఎన్నికల్లో పార్టీ తరఫున ప్రచారం చేయకుండా కేంద్ర ప్రభుత్వం కుట్రపన్నుతోందని కేజ్రీవాల్ ఆరోపిస్తున్నారు. గత సంవత్సరమే తనను సీబీఐ విచారించిందని, అయినప్పటికీ తనపై ఉన్న ఆరోపణలకు ఎవరూ సమాధానం చెప్పట్లేదని విమర్శిస్తున్నారు. తనపై ఉద్దేశపూర్వకంగా ఈడీని ఉసిగొల్పుతున్నారని కేజ్రీవాల్ ఫిర్యాదు. కాగా, మద్యం స్కామ్ లో ఇప్పటికే ఇద్దరు ఆప్ నాయకులను ఈడీ మనీష్ సిసోడియా, సంజయ్ సింగ్ లను కటకటాల వెనక్కి పంపింది. అయితే ఈ కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థ ఇప్పటి వరకూ డబ్బును పట్టుకోలేదు.

న్యాయబద్ధంగా పొందిన పదవిని విడిచిపెట్టం

సీఎం కేజ్రీవాల్ అరెస్ట్ అయితే ఏం చేయాలో అన్నదానిపై సహచర ఎమ్మెల్యేలతో పార్టీ అధినేత చర్చించినట్లు సమాచారం. దీనిపై ప్రజల మూడ్ ను పసిగట్టే సర్వేను చేసినట్లు తెలుస్తోంది. ఒకవేళ అరెస్ట్ అయితే సీఎం పదవికి రాజీనామా చేయాలా? లేక ప్రభుత్వాన్ని జైలు నుంచి నడపాలా దానిపై తీవ్రంగా చర్చించినట్లు తెలిసింది. చివరకు కష్టపడి సంపాదించుకున్న ప్రభుత్వం, ప్రజలు న్యాయబద్ధంగా ఇచ్చిన తీర్పును గౌరవించాలని ఆప్ అధినాయకత్వం చివరకు ఓ నిర్ణయానికి వచ్చింది.

ప్రజా కోర్టులో పోరాడతాం

వచ్చే లోక్ సభ ఎన్నికల్లో ఢిల్లీతో పాటు పంజాబ్, హర్యానా, గుజరాత్ రాష్ట్రాలలో ఆప్ పోటీ చేయాలని నిర్ణయించుకుంది. మద్యం పాలసీతో పాటు ప్రతి అంశాన్నీ ప్రజా కోర్టులోనే తీర్పు కోరాలని పార్టీ ఆలోచనగా ఉంది. సీఎం అరెస్ట్ అయితే జైలు నుంచే పాలన కొనసాగించాలని, దానికి చట్టపరమైన అడ్డంకులు ఏం ఉండవని పార్టీ నాయకులు గట్టిగా చెబుతున్నమాట.

కేజ్రీవాల్ భవితవ్యం అనిశ్చితం

రాజ్యాంగం ప్రకారం ప్రభుత్వ అధికారులు అరెస్ట్ అయిన 24 గంటల్లోగా సస్పెన్షన్ కు గురి అవుతారు. అలాగే ఎన్నికైన ప్రజాప్రతినిధులు దోషులుగా నిర్దారణ అయి రెండు లేదా అంతకంటే ఎక్కువ కాలం జైలు శిక్ష పడితే వారిపై సైతం అనర్హత పడుతుంది.

ఇంతకు ముందు 1997లో లాలూ ప్రసాద్ యాదవ్ బిహార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో దాణా కుంభకోణం జరిగిందని అరెస్ట్ వారెంట్ జారీకాగానే ఆయన రాజీనామా చేసి భార్య రబ్రీదేవికి సీఎం పగ్గాలు అప్పగించాడు. అలాగే 2014లో దివంగత జయలలిత సైతం సీఎం పదవిని వదిలివేయాల్సి వచ్చింది. అలాగే మాజీ సీఎంలు జగన్నాథ్ మిశ్రా, మధుకోడా, బీఎస్ యడ్యూరప్ప, ఓం ప్రకాష్ చౌతాలా కూడా అరెస్ట్ అయ్యారు. అయితే వీరందరికి భిన్నంగా కేజ్రీవాల్ పయనించనున్నట్లు తెలుస్తోంది. ఏదీ ఏమైనా భారత రాజకీయాలే వేరు..

Read More
Next Story