న్యూ ఢిల్లీలో ఈసారి కేజ్రీవాల్ గట్టేక్కేనా?
గట్టి ప్రత్యర్థులను ప్రకటించిన బీజేపీ, కాంగ్రెస్
రాబోయే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ అధినేత, మాజీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్ పై బీజేపీ కఠిన ప్రత్యర్థిని నిలిపింది. ఇక్కడ మాజీ ఎంపీ పర్వేష్ వర్మ పేరును బీజేపీ తాజాగా విడుదల చేసిన జాబితాలో పేర్కొంది. ఢిల్లీ అసెంబ్లీలో 70 సీట్లు ఉన్నాయి.
అందులో మొదటి విడతగా 29 అభ్యర్థులతో తన మొదటి జాబితాను శనివారం కాషాయ పార్టీ విడుదల చేసింది. అలాగే ప్రస్తుత ముఖ్యమంత్రి అతీషీ మార్లేనా ప్రాతినిధ్యం వహిస్తున్న కల్కాజీ నుంచి మరో మాజీ ఎంపీ రమేష్ బిధూరి పేరు ను ప్రకటించింది. ఇక్కడ నుంచి కాంగ్రెస్ పార్టీ తన అభ్యర్థినిగా ఆల్కలాంబాను నిలబెడుతున్నట్లు వెల్లడించింది.
కేజ్రీవాల్ అరెస్ట్ తరువాత మంత్రి పదవికి రాజీనామా చేసి, బీజేపీలో చేరిన కైలాష్ గహ్లోత్ కు బీజేపీ టికెట్ కేటాయించింది. ఆయన కోరుకున్న బిజ్వాసన్ నుంచే అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసింది. కరోల్ బాగ్ నుంచి దుష్యంత్ గౌతమ్, రాజౌరీ గార్డెన్ నుంచి మంజీందర్ సింగ్ సిర్సా, గాంధీనగర్ నుంచి అరవిందర్ సింగ్ లవ్లీలను బరిలో నిలిపింది.
అలాగే ఢిల్లీ మాజీ బీజేపీ అధ్యక్షుడు సతీష్ ఉపాధ్యాయ్ మాలవీయ నగర్ నుంచి, ఆశిశ్ సూద్ జనక్ పురి నుంచి పోటీ చేయబోతున్నారు. ఆదర్శ్ నగర్ రాజ్ కుమార్ భాటియా, బద్లీ లో దీపక్ చౌదరీ, రితాలాలో కుల్వంత్ రాణా, నాంగ్లోయ్ జాట్ లో మనోజ్ షోకీన్, మంగోల్ పురిలో రాజ్ కుమార్ చౌహన్ , రోహిణిలో విజేంద్ర గుప్తాను పోటీ చేస్తున్నట్లు జాబితాలో పేర్కొంది.
అలాగే షాలిమార్ బాగ్ లో రేఖా గుప్తా, పటేల్ నగర్ లో రాజ్ కుమార్ ఆనంద్, జంగ్ పురాలో తర్వింద్ సింగ్ మార్వా, ఆర్కే పురంలో అనిల్ శర్మ, మెహ్రౌలీలో గజేంద్ర యాదవ్, ఛతర్ పూర్ లో కర్తార్ సింగ్ తన్వర్ పేర్లను ప్రకటించింది.
ఢిల్లీలోని అన్ని నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తామని తమకు 30కి పైగా దరఖాస్తులు వచ్చాయని బీజేపీ ఢిల్లీ వర్గాలు తెలిపాయి. కిరారీ, బురారీ అసెంబ్లీ నుంచి అయితే ఈ సంఖ్య 35, 38 గా ఉందని పేర్కొన్నాయి. ఇలా మొత్తం మీద 2100 దరఖాస్తులు వచ్చాయని వెల్లడించాయి.
కాంగ్రెస్ ఇంతకుముందే తమ జాబితాను ప్రకటించింది. కొన్ని చోట్ల బలమైన అభ్యర్థులను ప్రకటించినందున తిరిగి తాము వ్యూహరచన చేయాల్సి వచ్చిందని బీజేపీ వర్గాల మాట. కొన్ని స్థానాలను తీసుకుంటే న్యూ ఢిల్లీ నుంచి సందీప్ దీక్షిత్, కల్కాజీ నుంచి ఆల్కా లాంబ, బల్లిమారన్ నుంచి హారూన్ యూసుఫ్, సుల్తాన్ పూర్ నుంచి జై కిషన్, చాందిని చౌక్ నుంచి ముదిత్ అగర్వాల్ పోటీకి దింపింది.
కేజ్రీవాల్ పై త్రిముఖ పోటీ..
ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్ పోటీ చేసే న్యూ ఢిల్లీ నియోజకవర్గంలో ఈసారి త్రిముఖ పోటీ ఉండేలా కనిపిస్తోంది. ఇక్కడ బీజేపీ మాజీ ఎంపీ పర్వేష్ వర్మను బరిలోకి దింపడం, అంతకుముందు కాంగ్రెస్ మాజీ సీఎం షీలా దీక్షిత్ తనయుడు సందీప్ దీక్షిత్ ను బరిలోకి దింపడంతో పోటీ రసవత్తరంగా మారింది.
ఆమ్ ఆద్మీ పార్టీ ప్రారంభమైన తరువాత తొలిసారిగా కేజ్రీవాల్ ఇక్కడ గట్టి పోటీని ఎదుర్కొంటున్నారు. అంతేకాకుండా ఆ పార్టీ అగ్రనేతలు మొత్తం అవినీతి కేసులో చిక్కుకుని నెలల తరబడి తీహార్ జైలులో గడిపి రావడంతో కేజ్రీవాల్, ఆప్ ప్రతిష్ట మసకబారింది.
పులి మీద పుట్రలా ఇప్పుడు ప్రత్యర్థులు బలమైన అభ్యర్థులను బరిలోకి దింపాయి. కాంగ్రెస్ రాకతో ఇక్కడ కీలకమైన ముస్లిం ఓట్లు చీలిపోయి బీజేపీ విజయం సాధిస్తుందనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే ఢిల్లీ రాజకీయాల్లో ఆప్, కాంగ్రెస్ కి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు ఉన్న నేపథ్యంలో ఇక్కడ నుంచి గ్రాండ్ ఓల్డ్ పార్టీ అభ్యర్థి తప్పుకునే పరిస్థితి కనిపించడం లేదు.
Next Story