అకాలీదళ్, బీజేపీ కూటమికి అధికారం దక్కుతుందా?
x

అకాలీదళ్, బీజేపీ కూటమికి అధికారం దక్కుతుందా?

పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల నిఫుణుల విశ్లేషణ


Click the Play button to hear this message in audio format

2027 పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు శిరోమణి అకాలీదళ్ (SAD), భారతీయ జనతా పార్టీ (BJP) మళ్లీ ఒక్కటయ్యాయి. గతంలో కలిసి పనిచేసిన ఈ రెండు పార్టీలు ఆరేళ్ల విరామం తర్వాత తిరిగి పొత్తు పెట్టుకోవడం పంజాబ్ రాజకీయాల్లో ఆసక్తికర చర్చకు దారితీసింది. అయితే ఈ కూటమి ఎన్నికల్లో విజయాన్ని అందిస్తుందా? గతంలో ఎదురైన రాజకీయ వ్యతిరేకతను అధిగమించి ప్రజల మద్దతు పొందగలుగుతుందా? ఈ విషయంపై ‘క్యాపిటల్ బీట్’ కార్యక్రమంలో ప్యానెల్ చర్చించింది.

రాజకీయ ఒత్తిడి..

ఈ రెండు పార్టీల మధ్య పొత్తు కేవలం రాజకీయ అవసరాల వల్లే కుదిరిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. గతంలో విడిపోవడానికి కారణమైన రైతు చట్టాల వివాదం ఇంకా పూర్తిగా పరిష్కారం కాలేదని వారు గుర్తుచేస్తున్నారు.
రాజకీయ విశ్లేషకుడు జగదీప్ ఎస్. సింధు అభిప్రాయం ప్రకారం.. అకాలీదళ్, బీజేపీ రెండూ ఒంటరిగా పోటీ చేసి ఎన్నికల్లో గెలిచే పరిస్థితుల్లో లేవు. అందుకే పరస్పర రాజకీయ అవసరాల దృష్ట్యా మళ్లీ కలిశాయి.
పంథిక్ ఓటు బ్యాంకు వివిధ వర్గాలుగా విడిపోవడంతో గతంలో సాధించిన ఎన్నికల విజయాలను తిరిగి అందుకోవడం అకాలీదళ్‌కు కష్టంగా మారింది. మరోవైపు పంజాబ్‌లోని మొత్తం 117 స్థానాల్లోనూ ఒంటరిగా పోటీ చేయాలన్న బీజేపీ ఆలోచనకు క్షేత్రస్థాయిలో పరిస్థితులు అనుకూలంగా లేవని ఆ పార్టీ గుర్తించిందని సింధు విశ్లేషించారు.
ఈ పొత్తుతో ఇప్పటివరకు బహుముఖ పోటీగా కనిపించిన పంజాబ్ ఎన్నికల బరిలో ప్రధానంగా మూడు కూటములు నిలిచే అవకాశం ఉందని ఆయన అంచనా వేశారు. అకాలీదళ్-బీజేపీ కూటమి, అధికార ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ మధ్య ప్రధాన పోటీ ఉండొచ్చని చెప్పారు. మరో చిన్న రాజకీయ కూటమి కూడా పోటీలో ఉండే అవకాశం ఉందన్నారు.

ఎన్నికల భారం ఉందా?

పొత్తు కుదిరినంత మాత్రాన ఎన్నికల్లో విజయం ఖాయమని భావించలేమని మరో రాజకీయ విశ్లేషకుడు ఆకాష్ దీప్ స్పష్టం చేశారు.
2012లో అకాలీదళ్-బీజేపీ కూటమి 68 స్థానాలు గెలుచుకుంది. 2017 ఎన్నికల్లో ఆ సంఖ్య 18కి పడిపోయింది. 2022 ఎన్నికల్లో రెండు పార్టీలు విడివిడిగా పోటీ చేయగా.. కలిపి కేవలం ఐదు స్థానాలకే పరిమితమయ్యాయి. ఈ గణాంకాలు ఆ పార్టీల క్షీణించిన రాజకీయ బలాన్ని సూచిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు.
అకాలీదళ్‌కు ఇప్పటికీ పలు సమస్యలు సవాలుగా ఉన్నాయని ఆకాష్ దీప్ అన్నారు. రైతు చట్టాల విషయంలో ఆ పార్టీ వ్యవహరించిన తీరు, 2015లో జరిగిన మతగ్రంథాల అపవిత్రత ఘటనలు, ఆ తర్వాత చోటుచేసుకున్న పోలీసు కాల్పుల ఘటనలు ఇంకా ఆ పార్టీని వెంటాడుతున్నాయని చెప్పారు.
మరోవైపు రైతుల ఆందోళన సమయంలో జరిగిన పరిణామాలు, ఆ నిరసనల్లో ప్రాణాలు కోల్పోయిన రైతుల విషయంలో బీజేపీ తన వైఖరిని ప్రజలకు వివరించాల్సి ఉందని అన్నారు.
ఇదే సమయంలో పంజాబ్‌లో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వ పనితీరుపైనా చర్చ జరిగింది. 2022 ఎన్నికల సమయంలో 25 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని ఆప్ హామీ ఇచ్చిందని, కానీ అధికారిక గణాంకాల ప్రకారం ఇప్పటివరకు సుమారు 65 వేల నుంచి 75 వేల ఉద్యోగాలు మాత్రమే కల్పించినట్లు ఆకాష్ దీప్ పేర్కొన్నారు.
డ్రగ్స్ రహిత పంజాబ్, చట్టబద్ధమైన కనీస మద్దతు ధర, విద్య, వైద్య రంగాల్లో ఖాళీల భర్తీ వంటి హామీలు కూడా పూర్తిస్థాయిలో అమలుకాలేదని విమర్శించారు.

కాంగ్రెస్, ఆప్.. అధికార వ్యతిరేకత..

బీజేపీ నాయకుడు, రాజకీయ విశ్లేషకుడు అలోక్ వాత్స్ కూడా అకాలీదళ్-బీజేపీ పొత్తుపై ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. రెండు పార్టీలు విడివిడిగా పోటీ చేసే స్థితిలో లేవని, రాజకీయంగా మనుగడ సాగించాలంటే కలవడం తప్పనిసరైందని వ్యాఖ్యానించారు.
అయితే ప్రస్తుతం ఏ ఒక్క పార్టీకి కూడా పంజాబ్‌లో స్పష్టమైన ఆధిక్యం లేదని ఆయన అభిప్రాయపడ్డారు. హామీల అమలులో వైఫల్యాల కారణంగా ఆప్ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతోందని, కాంగ్రెస్ మాత్రం అంతర్గత విభేదాలతో ఇబ్బందులు ఎదుర్కొంటోందని చెప్పారు.
మరోవైపు కాంగ్రెస్ నేత, న్యాయవాది సంజీత్ కుమార్ ఈ పొత్తుపై అభ్యంతరం వ్యక్తం చేశారు. రైతుల ఆందోళన సమయంలో అకాలీదళ్ కేంద్ర మంత్రివర్గం నుంచి వైదొలిగిన విషయాన్ని గుర్తుచేస్తూ.. ఇప్పుడు అదే బీజేపీతో మళ్లీ చేతులు కలపడం సహజమైన రాజకీయ భాగస్వామ్యం కాదని విమర్శించారు.
పంజాబ్‌లో పెరుగుతున్న అప్పులు, రెవెన్యూ లోటుపైనా ఆయన ఆప్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. దీర్ఘకాలిక ఆర్థిక ప్రణాళిక లేకుండా సంక్షేమ పథకాల కోసం అప్పులు చేస్తున్నారని ఆరోపించారు.
అయితే కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలు ఉన్నాయన్న వాదనను సంజీత్ కుమార్ తోసిపుచ్చారు. రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ సచిన్ పైలట్ నేతృత్వంలో సీనియర్ నాయకులంతా కలిసి పనిచేస్తున్నారని, ఎన్నికలకు సిద్ధమవుతున్నారని తెలిపారు.

ఆప్ పాలన ఎలా ఉంది...

ఇక ఆమ్ ఆద్మీ పార్టీ ప్రతినిధి రణ్‌బీర్ సింగ్ ధింద్సా అకాలీదళ్-బీజేపీ కూటమిపై విమర్శలు గుప్పించారు. 2015 నుంచి ఈ రెండు పార్టీలకు ప్రజాదరణ తగ్గుతూ వస్తోందని, రైతుల సమస్యలు, కనీస మద్దతు ధర, మతగ్రంథాల అపవిత్రత ఘటనలు, సిక్కు ఖైదీల అంశాలపై అవి ఇంకా సమాధానం చెప్పాల్సి ఉందని అన్నారు.
తమ ప్రభుత్వం సాధించిన విజయాలను కూడా ఆయన వివరించారు. ఉచిత విద్యుత్, ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ, టోల్ ప్లాజాల మూసివేత, పెన్షన్ సంస్కరణలు, మహిళలకు ఆర్థిక సాయం, ఆస్తులపై హక్కులు, ఆరోగ్య సేవల విస్తరణ వంటి కార్యక్రమాలను ప్రస్తావించారు.
అవినీతికి తావులేకుండా నియామకాలు చేపట్టామని, పంజాబ్ నుంచి ఇతర ప్రాంతాలకు వలసలు తగ్గడానికి ఉద్యోగావకాశాలు కూడా దోహదపడ్డాయని ధింద్సా పేర్కొన్నారు. అవినీతి లేకుండా 75 వేల ఉద్యోగాలు ఇవ్వకపోతే ఆమ్ ఆద్మీ పార్టీకి ఓటు వేయకండి.. ఎవరికైనా వేయండని పిలుపునిచ్చారు.
అయితే రైతుల ఆందోళన సమయంలో నిరసనకారులపై ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ చేసిన వ్యాఖ్యల విషయంలో కూడా బీజేపీ తన వైఖరిని స్పష్టం చేయాలని ఆకాష్ దీప్ సూచించారు.
మొత్తంగా 2027 పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకి విజయం దక్కుతుందన్నది ఇప్పుడే చెప్పలేమని విశ్లేషకుడు జగదీప్ సింధు అభిప్రాయపడ్డారు. ప్రజల ఓటింగ్ వైఖరి ఇంకా స్పష్టంగా లేదని, ప్రతి పార్టీ ఇచ్చే హామీలు, గతంలో అధికారంలో ఉన్నప్పుడు చేసిన పనులను ఓటర్లు పరిశీలిస్తున్నారని చెప్పారు.
ఎన్నికల్లో కేవలం రాజకీయ పొత్తులు, ప్రచారమే కాకుండా బూత్ స్థాయి నిర్వహణ, ఓటర్లను సమీకరించే సామర్థ్యం, ఎన్నికల నిర్వహణ కూడా కీలక పాత్ర పోషిస్తాయని ఆయన విశ్లేషించారు.
అంటే అకాలీదళ్-బీజేపీ పునరేకీకరణ పంజాబ్ రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు తెరతీసినా.. రైతుల సమస్యలు, గత పాలనపై ఉన్న విమర్శలు, ఆప్ ప్రభుత్వ పనితీరు, కాంగ్రెస్ ఐక్యత వంటి అంశాలే 2027 ఎన్నికల్లో ఓటర్ల నిర్ణయాన్ని ప్రభావితం చేసే అవకాశం ఉంది.

Read More
Next Story