
కేంద్రమంత్రి, ఎల్జేపీ నాయకుడు చిరాగ్ పాసవాన్
ఎక్కడైనా ఫ్రెండ్లీ పోటీ ఉంటుందా? చిరాగ్ పాశ్వాన్ విమర్శలు
ఆర్జేడీ, కాంగ్రెస్ అభ్యర్థుల జాబితాపై కేంద్రమంత్రి సెటైర్లు
మహాఘట్ బంధన్ లోని ప్రధాన పార్టీలు అయిన కాంగ్రెస్, ఆర్జేడీపై కేంద్రమంత్రి, ఎల్జేపీ(ఆర్) అధినేత చిరాగ్ పాశ్వాన్ విమర్శలు గుప్పించారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు రెండు పార్టీలు ఒకే స్థానానికి అభ్యర్థుల జాబితాను విడుదల చేయడంపై ఆయన ప్రతిపక్షాల ఐక్యతను ప్రశ్నించారు.
ఎన్డీఏకు గట్టి పోటీ అనుకున్న స్థానాలలో కూడా కాంగ్రెస్, ఆర్జేడీ అభ్యర్థులను నిలిపి తమ విజయాన్ని నల్లేరు మీద నడకలా మార్చాయని చిరాగ్ చెప్పారు.
మహాకూటమిలోని పార్టీలన్నీ కూడా అన్ని స్థానాలకు అభ్యర్థులను నిలబెట్టి కూడా మంచి ఫలితాలు వస్తాయనే భ్రాంతిలోనే ఉన్నాయని ఆయన విలేకరులతో అన్నారు. తాను చాలకాలంగా దగ్గరగా రాజకీయాలను పరిశీలిస్తున్నానని, కానీ ఒక పెద్ద కూటమి ఇలాంటి పతనావస్థకు చేరడం తొలిసారిగా చూస్తున్నా అని చెప్పారు.
‘‘నేను రాజకీయాలలో ఇలాంటి పతనావస్థకు చెందిన కూటమిని ఇంతవరకూ చూడలేదు. మహాఘట్ బంధన్ లోని పార్టీలు ఒకే స్థానానికి తమ అభ్యర్థులను ప్రకటించినప్పటికీ గెలుస్తామనే భ్రమలో ఉన్నారు. స్నేహపూర్వక పోటీ అనేది ఉండదు’’ అని పాశ్వాన్ అభిప్రాయపడ్డారు.
మా విజయాన్ని సునాయాసం చేశారు
అధికార ఎన్డీఏ కూటమి గెలవడం కష్టమనుకున్న స్థానాలలో మహాఘట్ బంధన్ తమ అభ్యర్థులను నిలబెట్టడం ద్వారా తమ విజయం సునాయాసంగా మార్చారని చెప్పుకొచ్చారు. రెండు మిత్రపక్షాలే అయినప్పటికీ ప్రత్యర్థుల్లా మారారని అన్నారు.
కాంగ్రెస్, ఆర్జేడీ లు ఒకదానికి వ్యతిరేకంగా మరొకరు అభ్యర్థులను ప్రకటించిన విధానాన్ని ఆయన హైలైట్ చేశారు. ‘‘ఈ నిర్ణయాలకు మహాఘట్ బంధన్ మూల్యం చెల్లించుకుంటుంది. ఎన్డీఏ బలంగా ముందుకు సాగుతుంది.’’ అని ఆయన జాతీయ మీడియాతో అన్నారు.
ఆర్జేడీ జాబితా విడుదల..
ఆర్జేడీ బీహార్ ఎన్నికలకు సంబంధించి అభ్యర్థుల జాబితాను విడుదల చేసిన తరువాత పాసవాన్ ఈ వ్యాఖ్యలు చేశారు. తేజస్వీ యాదవ్ పార్టీ నుంచి పోటీ చేసే 143 అభ్యర్థులను ప్రకటించారు. అందులో కాంగ్రెస్ కూడా ప్రకటించిన నాలుగు స్థానాలు ఉన్నాయి.
ఆర్జేడీ నేత, విపక్ష నాయకుడు తేజస్వీ యాదవ్ రాఘేపూర్ నుంచి పోటీ చేస్తున్నారు. ఆయన కూటమి నుంచి ఒప్పందం ఖరారు కావడానికి ముందే రాఘెపూర్ నుంచి నామినేషన్ దాఖలు చేశారు.
ఇతర ప్రముఖులలో లలిత్ యాదవ్(దర్భంగా రూరల్), దిలిప్ సింగ్(బరౌలీ), రామ్ విలాస్(పిర్పైంటీ), సావిత్రి దేవీ(చాకై) వంటి వారు ఉన్నారు. ఇవే కాకుండా బీహారిగంజ్, వార్సాలీగంజ్, హసన్ పూర్, మధుబన్, ఇమామ్ గంజ్, బరాచట్టీ, బనియాపూర్, సరైరంజన్, పటేపూర్, బ్రహ్మపూర్, బాజ్ పట్టి స్థానాలలో కూడా తమ అభ్యర్థులను ప్రకటించింది.
Next Story