
దీపావళి కాలుష్యాన్ని తేలిగ్గా తీసుకున్న ‘యోగీ’
అదే తగ్గిపోతుందని వ్యాఖ్య
దీపావళి తరువాత దేశంలో పెరిగిన వాయు కాలుష్యాన్ని యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్ తేలిగ్గా తీసుకున్నారు. ఈ పెరుగుదల తగ్గిపోతుందని ఆయన అన్నారు. అవినీతి ద్వారా వ్యవస్థను కలుషితం చేసిన వారి గురించి మౌనంగా ఉంటూ, విమర్శకులు బాణాసంచా సమస్యను ఎందుకు లేవనెత్తుతున్నారని కూడా ఆయన ప్రశ్నించారు.
లక్నోలో జరిగిన ఒక ప్రభుత్వ కార్యక్రమంలో యోగీ ఆదిత్యనాథ్ మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా దీపావళిని ఉత్సాహంగా జరుపుకున్నారని అన్నారు. ఈ వేడుకల వల్ల కలుగుతున్న కాలుష్యంపై ఆందోళన వ్యక్తం చేస్తున్న వాదనలను ఆయన తోసిపుచ్చారు.
ఆందోళనలను కొట్టిపారేశారు..
‘‘దీపావళి వల్ల కాలుష్యం పెరిగిందని కొందరు అంటున్నారు. పెరిగితే ఏంటీ? అది తగ్గిపొతుంది కూడా. మీరెందుకు ఆందోళన చెందుతున్నారు?’’ అని ఆయన అన్నారు.
దీపావళి వేడుకల్లో బాణాసంచా కాల్చడంలో తప్పేమీ లేదని అన్నారు. పటాకులతో పండగ జరుపుకోవడం ద్వారా ప్రజలు ఎలాంటి తప్పు చేయలేదని యోగీ స్పష్టం చేశారు. వేడుకలపై ఆంక్షలు విధించవద్దని తమ ప్రభుత్వం నిర్ణయించిందని ఆయన అన్నారు.
‘‘ప్రజలు దీపావళిని ఎంతో ఉత్సాహంగా జరుపుకుని పెద్ద ఎత్తున బాణాసంచా కాల్చారు. మేము ఎలాంటి ఆంక్షలు విధించబోమని చెప్పాము. ప్రజలను బాణాసంచా కాల్చి పండగ జరుపుకోనివ్వండి’’ అన్నారు. తాను అయోధ్య లో స్వయంగా వేడుకల్లో పాల్గొన్నానని చెప్పారు. ‘‘బాణాసంచా వేడుకల సమయంలో నేను కూడా అయోధ్యలోనే ఉన్నాను’’ అని ఆయన అన్నారు.
వేడుకలను ప్రశ్నిస్తున్న వారిని పరోక్షంగా విమర్శిస్తూ అవినీతి వ్యవస్థను దెబ్బతీసినప్పుడూ ప్రజలు అభ్యంతరం చెప్పలేదని, కానీ పౌరులు పండుగలు జరుపుకున్నప్పుడూ ఆందోళన వ్యక్తం చేశారని ఆయన అన్నారు.
‘‘ఏదైన తప్పు జరిగినప్పుడూ వీళ్లు నోరు విప్పరు. కానీ పండగ జరుపుకున్నప్పుడు మాత్రం హఠాత్తుగా కాలుష్యం గుర్తుకు వస్తుంది’’ అని ఆయన అన్నారు.
2017 కి ముందు ఏం జరిగింది..
అయోధ్యలో ఘనంగా జరిగిన దీపోత్సవం వేడుకలు, గోవర్ధన పూజ, భాయ్ దూత్ ఉత్సవాలను ప్రస్తావిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా పండుగలను ఇప్పుడు ప్రశాంతంగా జరుపుకుంటున్నారని ఆదిత్యనాథ్ అన్నారు.
2017 కి ముందు అంటే బీజేపీ అధికారంలోకి రాకముందు ప్రస్తుత పరిస్థితిని ఆయన అంచనా వేశారు. హోళీ, దీపావళి, విజయదశమి, జన్మాష్టమి, శివరాత్రి, క్రిస్మస్, ఈద్ వంటి పర్వదినాల్లో తరుచుగా మత ఉద్రిక్తతలు అల్లర్లు చెలరేగేవని ఆయన పేర్కొన్నారు.
ఆ సమయంలో కర్ఫ్యూల వల్ల వ్యాపారులు ప్రభావితం అయ్యేవారని, మార్కెట్లో మూతపడటంతో దుకాణదారులు తెచ్చిన సరుకులు పాడైపోయాయని యోగీ అన్నారు. ‘‘గత తొమ్మిదేళ్లలో ఉత్తర ప్రదేశ్ లో కర్ఫ్యూ లేదు. అల్లర్లు లేవు. ఉత్తర ప్రదేశ్ వర్దిల్లుతోంది’’ అని ఆయన అన్నారు.
ఆ రోజు ఉచిత ప్రయాణం..
భాయ్ దూజ్ నాడు తన సోదరులను కలుసుకోవడానికి ప్రయాణించే 60 ఏళ్ల పైబడిన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తున్నామని కూడా ఆయన చెప్పారు.
రెవెన్యూ శాఖలో కొత్తగా నియమితులైన 1,146 మంది జూనియర్ అసిస్టెంట్లకు నియామక పత్రాలు పంపిణీ చేయడానికి, ముఖ్యమంత్రి కృషి దుర్ఘటనా కళ్యాణ్ యోజన కింద 4,300 మంది లబ్దిదారులకు ఆర్థిక సహాయం అందించడానికి ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
Next Story
