మీ పోరాటం నాతోనే కదా.. నా తల్లిదండ్రులను విడిచిపెట్టండి: కేజ్రీవాల్
స్వాతి మాలీవాల్ పై దాడి జరిగిన విషయంలో ఢిల్లీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్ తల్లిదండ్రులను విచారించే అవకాశం ఉందనే వార్తలు వస్తున్న నేపథ్యంలో..
తన తల్లిదండ్రులు అనారోగ్యంతో ఉన్నారని వారిని ప్రధాన మంత్రి ఆధ్వర్యంలో నడిచే కేంద్ర దర్యాప్తు సంస్థలు హింసిస్తున్నాయని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. ఈ మేరకు ఆయన సామాజిక మాధ్యమం ఎక్స్ లో ఓ వీడియో పోస్ట్ చేశారు. ‘ నా తల్లిదండ్రులు నా నుంచి దూరం చేయడానికి ప్రధాని లక్ష్యంగా పెట్టుకున్నారని, మోదీ ఇలా చేయడం ద్వారా అన్ని పరిమితులు దాటారు’ అని వీడియోలో విమర్శించారు.
‘‘ గౌరవనీయులైన ప్రధాన మంత్రి గారు. మీరు నన్ను ఓ వైపు గౌరవిస్తున్నట్లు నటిస్తూనే మరోవైపు పడగొట్టడానికి ప్రయత్నిస్తున్నారు. మొదట ఎమ్మెల్యేలను అరెస్ట్ చేశారు. తరువాత మంత్రులను బంధించారు. ఆ తరువాత నన్ను కూడా జైలు కు పంపారు. తీహార్ జైలులో అనేక రకాలుగా హింసించారు. అయితే నేను మీకు లొంగలేదు. కానీ ఇప్పుడు నా తల్లిదండ్రులను హింసిస్తున్నారు’ కానీ మీరు నన్ను లొంగదీసుకోలేరు అని వీడియో లో పేర్కొన్నారు.
प्रधानमंत्री जी, आपकी लड़ाई मुझसे है। कृपया मेरे बूढ़े और बीमार माता-पिता को प्रताड़ित मत कीजिए। https://t.co/JnYHhgV1Gr
— Arvind Kejriwal (@ArvindKejriwal) May 23, 2024
అయితే ప్రధాన మంత్రి గారు మీరు ఈరోజు అన్ని హద్దులు దాటారు. నేడు అనారోగ్యంతో ఉన్న నా తల్లిదండ్రులను లక్ష్యంగా చేసుకున్నారు. మా అమ్మ తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతోంది. మీరు నన్ను అరెస్ట్ చేసిన రోజు నుంచి మా అమ్మ ఆస్పత్రిలో ఉంది. కొన్ని రోజుల చికిత్స తరువాత ఇప్పుడిప్పుడే కోలుకుంటోందని ఢిల్లీ మద్యం కుంభకోణంలో జైలుకు వెళ్లిన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అన్నారు.
నా తల్లిదండ్రులను వేధించడం ఆపండి
తన తండ్రి గురించి మాట్లాడుతూ.. ఆయనకు 85 ఏళ్లు అని, వినికిడి సమస్యతో బాధపడుతున్నారని అన్నారు. నా తల్లిదండ్రులను దోషులని మీరు అనుకుంటున్నారా? మీ పోలీసులు వారిని ఎందుకు విచారిస్తున్నారు. వృద్ధులను అందులోనూ అనారోగ్యంలో ఉన్నవారిని మీరు ఎందుకు హింస్తున్నారు. మీ పోరాటంతో నాతోనే కదా .. మీరు ముందు నా తల్లిదండ్రులను వేధించడం ఆపండి, భగవంతుడే అన్ని చూసుకుంటారని వీడియోలో అన్నారు.
అంతకుముందు రోజు కూడా కేజ్రీవాల్ ఢిల్లీ పోలీసులు తన తల్లిదండ్రులు, భార్యను విచారించడానికి సమయం అడిగారని అన్నారు. వారి కోసం మేము ఎదురు చూస్తున్నాం. కానీ వారు ఇంకా రాలేదని సామాజిక మాధ్యమం ఎక్స్ లో ట్వీట్ చేశారు. అయితే ఢిల్లీ పోలీసులు వారి తల్లిదండ్రులను విచారించట్లేదని ఓ ప్రముఖ జాతీయ మీడియా ఓ కథనాన్ని ప్రచురించింది. అయినప్పటికీ బుధవారం మరోసారి కేజ్రీవాల్ ఇదే ట్వీట్ ను మరోసారి పోస్ట్ చేశారు.
స్వాతి మాలీవాల్..
ఆప్ రాజ్యసభ ఎంపీ స్వాతి మాలీవాల్ పై ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ నివాసంలో తీవ్రంగా భౌతిక దాడి జరిగింది. స్వాతి ప్రయివేట్ భాగాలపై కేజ్రీవాల్ పీఏ భిభవ్ కుమార్ కాలితో తన్నడమే కాకుండా, చెక్కిళ్లపై బలంగా ఏడు ఎనిమిదిసార్లు చేయి చేసుకున్నాడు. తలను టేబుల్ పై పెట్టి బలంగా బాదాడు. ఈ హఠాత్ పరిణామంతో ఆమె వెంటనే ఢిల్లీ పోలీసుల ఎమర్జెన్సీకి కాల్ చేసింది. తరువాత ఈ సంఘటనపై కేసు పెట్టింది. ఈ సందర్భంగా పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఇది కేజ్రీవాల్ ఇంట్లో జరిగిన విషయం కావడంతో పోలీసులు ఆయన ఇంట్లోని కుటుంబ సభ్యులను విచారించే ప్రయత్నం చేస్తున్నారు.
దాడి జరిగిన వారం తరువాత కేజ్రీవాల్ దీనిపై స్పందించారు. ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ముఖాముఖిలో మాట్లాడుతూ..ఈ సంఘటనలో నిష్పక్షపాతంగా విచారణ జరపాలని కోరారు. ఇది ప్రస్తుతం న్యాయస్థానం పరిధిలోకి వెళ్లిందని, దీనిపై ఎలాంటి వ్యాఖ్యలు చేయనని చెప్పారు.
అయితే ఈ మాటలపై బాధితురాలు.. ఆప్ రాజ్యసభ ఎంపీ స్వాతి మాలీవాల్ వ్యంగ్యంగా స్పందించారు. తన క్యారెక్టర్ ను వెయిసార్లు చంపేశాక కేజ్రీవాల్ తాపీగా నిష్పక్షపాత విచారణను కావాలని కోరుతున్నారని అన్నారు.
Next Story