“పుస్తకాల గది కాదు, ప్రజా చైతన్య వేదిక”
x

“పుస్తకాల గది కాదు, ప్రజా చైతన్య వేదిక”

134 ఏళ్ల బొల్లారం రీడింగ్ రూం కథ


134 ఏళ్ళ చ‌రిత్ర‌కు స‌జీవ సాక్షి బొల్లారం రీడింగ్ రూం. అప్ప‌ట్లో ఈ రీడింగ్ రూంను బ్రిటిష్ సైనికులు, స్థానిక విద్యావంతులు వార్త‌లు చ‌ద‌వ‌డం, స‌మాచారం తెలుసుకోవ‌డం కోసం ఏర్పాటు చేసుకున్నారు. అయితే ఆ త‌ర్వాత పుస్తకాల గదిగా కాకుండా, ఆలోచనల వేదికగా మారింది.

1896 సంవత్సరం. చదువు అందరికీ అందుబాటులో లేని కాల‌మ‌ది. అలాంటి సమయంలో ఇక్కడ వార్తా పత్రికలు, పాత గ్రంథాలు, అరుదైన సాహిత్య సంపదలను అందుబాటులో ఉంచారు. అంటే, విద్యుత్ వెలుతురు కూడా సరిగా లేని రోజుల్లో, ఈ గదిలో కూర్చుని పుస్తకం చదివే వ్యక్తి, ప్రపంచాన్ని అక్షరాల్లో చూసేవాడు. అలా ఈ రీడింగ్ రూం అనేక మందికి విజ్ఞాన ద్వారాలను తెరిచింది. కాలక్రమేణా, ఈ చిన్న రీడింగ్ రూం ఒక ప్రముఖ గ్రంథాలయంగా అభివృద్ధి చెందింది.

పుస్తక పఠనం మాత్రమే కాదు, విద్యా చర్చలు, సాహిత్య సభలు, సమావేశాలు, సామాజిక కార్యక్రమాలు ఇవి అన్నీ ఇక్కడే జరిగాయి. ఈ గదుల్లో అనేక ఆలోచనలు పుట్టాయి. అనేక చర్చలు సమాజాన్ని ప్రభావితం చేశాయి.

ఈ భవనం నిర్మాణం బ్రిటిష్ కాలం నాటి నిర్మాణ శైలిని ప్రతిబింబిస్తోంది. ఎత్తైన పైకప్పులు, గాలి సరిగా ప్రవహించేలా పెద్ద కిటికీలు, మందపాటి గోడలు. ఆ కాలపు వాతావరణానికి అనుగుణంగా సహజ కాంతి, గాలి అందేలా దీన్ని రూపకల్పన చేశారు. వేసవిలో చల్లగా, వర్షంలో సురక్షితంగా ఉండేలా ఈ నిర్మాణం ఆలోచనాత్మకంగా రూపొందించారు.

ఇది కేవలం ఒక గ్రంథాలయం కాదు. ఇది బొల్లారం చరిత్రలో ఒక వారసత్వ కట్టడం. బ్రిటిష్ పాలన నుంచి స్వాతంత్ర్యం వరకు, పాతకాలపు ముద్రణ నుంచి ఆధునిక యుగం వరకు ఈ భవనం అన్నింటిని చూసింది. పాత సంచికల వార్తా పత్రికలు, అరుదైన పత్రికలు, చారిత్రక డాక్యుమెంట్లు ఇక్కడ భద్రంగా ఉన్నాయి. తెలుగు సాహిత్యానికి సంబంధించిన మహానుభావుల రచనలు ఇక్కడ ప్రత్యేక ఆకర్షణ. గురజాడ అప్పారావు రచించిన సామాజిక స్పృహ కలిగించే రచనలు, శ్రీశ్రీ విప్లవ కవిత్వం, విశ్వనాథ సత్యనారాయణ సాహిత్య వైభవం, చలం ఆలోచనలకు దారి తీసే రచనల్ని ఈ గ్రంథాలయంలో పాఠకులకు అందించింది. సాహిత్యం, చరిత్ర, విజ్ఞానం, తత్వశాస్త్రం, రాజకీయాలు, ఆర్థిక శాస్త్రం అన్ని విభాగాల పుస్త‌కాల్ని అధ్య‌య‌నం చేయ‌డానికి విద్యార్థులు, రీస‌ర్చ్ స్కాల‌ర్స్ ఇక్క‌డికి ఎక్కువ‌గా వ‌స్తుంటారు.

"ఈ రీడింగ్ రూం స్థానిక ప్రజల్లో చదువు పట్ల, విజ్ఞానం పట్ల ఆసక్తిని పెంచడంలో కీలక పాత్ర పోషించింద‌ని," బొల్లారం రీడింగ్ రూం ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి న‌ర్సింగ్‌రావు చెప్పారు. ఎన్నో తరాలు ఇక్కడ చదివి, జీవితంలో ముందుకు సాగాయి. కొందరు ఉపాధ్యాయులయ్యారు. ఇంకొందరు రచయితలయ్యారు, మ‌రి కొందరు రాజ‌కీయ నాయకులయ్యారని ఆయ‌న అన్నారు.

కంటోన్మెంట్ బోర్డు ప‌రిధిలో వున్న ఈ ప్రాంతానికి చెందిన 20 వేల మంది ప్ర‌జ‌ల‌కు ఈ రీడింగ్ రూం అందుబాటులో వుంది. డౌట‌న్ బ‌జార్‌, చింత‌ల్ బ‌జార్‌, స‌ద‌ర్ బ‌జార్ ప‌రిస‌రాల్లోని ప్ర‌జ‌లకు ఇక్క‌డే వివిధ క్రీడ‌ల్లో ప్రాక్టీస్ చేస్తున్నారు. పేద, మ‌ధ్య‌త‌ర‌గ‌తి ప్ర‌జ‌లు ఫంక్ష‌న్స్ నిర్వ‌హించుకోవ‌డానికి కూడా వాడుకుంటున్నారు.

ఒక‌ప్పుడు "రీడింగ్ రూంగా ప్రారంభం అయి ఆ త‌రువాత లైబ్ర‌రీగా, చ‌ర్చా వేదిక‌గా, ఇప్పుడు రిక్రియేష‌న్ క్ల‌బ్‌గా స్థానిక ప్ర‌జ‌ల అవ‌స‌రాలు తీర్చుతోంద‌ని" న‌ర్సింగ్‌రావు చెప్పారు.

సుర‌వ‌రం ప్ర‌తాప్‌రెడ్డి తెలుగు యూనివ‌ర్శిటీ అసెస్టెంట్ ప్రొఫెస‌ర్‌, డాక్ట‌ర్ ఎం.ఎ.శ్రీనివాస్ రెగ్యుల‌ర్‌గా ఈ రీడింగ్ రూపంలో స్ట‌డీ చేస్తూ వుంటారు. ఆయ‌న ఫెడ‌ర‌ల్ తెలంగాణాతో మాట్లాడుతూ "ప్ర‌జ‌ల్లో చైత‌న్యం పెర‌గ‌డానికి లైబ్ర‌రీలు కీల‌కంగా వ్య‌వ‌హ‌రించ‌డంతో పాటు, రాజ‌కీయ చైత‌న్యం తీసుకువ‌చ్చాయి," అని అన్నారు. జ‌మ్ము కాశ్మీర్ లో నేష‌న‌ల్ కాన్ఫ‌రెన్స్ పార్టీ రీడింగ్ రూం లోనే పుట్టింది. అందుకే ఆ పార్టీని రీడింగ్ రూపం పార్టీ అంటారు. కొంత మంది క‌లిసి పేప‌ర్లు చ‌దువుకునే క్ర‌మంలో కొన్ని అభిప్రాయాలు ఏర్ప‌డ్డాయి. అవి ఏకీకృత‌మై పార్టీగా మారిందని డాక్ట‌ర్ శ్రీనివాస్ చెప్పారు.

"నాలెడ్జ్ కోసం లైబ్ర‌రీలు గోల్డ్ మైన్స్ వంటివి. అయితే అవి రీడింగ్ రూంలుగా మారిపోతున్నాయి. ఇది పెద్ద ట్రాజెడీ" అని శ్రీనివాస్ ఆవేద‌న వ్య‌క్తం చేశారు. పోటీ ప‌రీక్ష‌ల‌కు చ‌దివే వాళ్ళ కోసం రీడింగ్ రూం కావాల‌న‌డంలో త‌ప్పు లేదు. కానీ లైబ్ర‌రీల‌న్నీ రీడింగ్ రూంలుగా మారాయి. లైబ్ర‌రీలు పూర్తి స్థాయిలో ప‌నిచేయ‌డం లేదు. మున్సిపాల్టీల్లో 5 శాతం లైబ్ర‌రీ సెస్ వ‌సూలు చేస్తున్నారు. కానీ ఖ‌ర్చు పెట్ట‌డం లేద‌ని ఆయ‌న అస‌హ‌నం వ్య‌క్తం చేశారు.

"బొల్లారం రీడింగ్ రూంలో ఇంగ్లాండ్ నుంచి తెచ్చిన ప‌లు పుస్త‌కాలు, ఆంగ్ల సాహిత్యం వుండేది. అయితే పాఠ‌కులు, రీసెర్చ్ చేసేవారు విలువైన పుస్త‌కాల్ని చాలా వ‌ర‌కు తీసుకువెళ్ళిపోయారని," సీనియ‌ర్ జ‌ర్న‌లిస్ట్‌, తెలంగాణ సాహితీ కారుడు డాక్ట‌ర్ సంగిశెట్టి శ్రీనివాస్ ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

గుర్తించిన లైబ్ర‌రీల‌కు గ‌తంలో ఎయిడ్ ఇచ్చేవారు. ప్ర‌భుత్వ‌మే పుస్త‌కాల‌ను కొని ప్రైవేట్‌ లైబ్ర‌రీల‌కు పంపేది. 1990 త‌రువాత ఆ విధానం ర‌ద్దు అయింది. 1956 యాక్ట్ ప్ర‌కారం మున్సిపాల్టీలు 5 శాతం లైబ్ర‌రీ సెస్ అయితే వ‌సూలు చేస్తూనే వున్నారు. కానీ, ఆ డ‌బ్బు లైబ్ర‌రీల‌పైన ఖ‌ర్చు పెట్ట‌డం లేదు. కొత్త సిబ్బందిని నియ‌మించుకోవ‌డం లేదు. అటెండ‌ర్లు, కిందిస్థాయి ఉద్యోగుల‌తో లైబ్ర‌రీల‌ను న‌డుపుతున్నారని సంగిశెట్టి చెప్పారు.

సెస్ రూపంలో వ‌సూలు చేసిన వేల కోట్ల రూపాయ‌ల్ని ఇత‌ర ఖ‌ర్చుల కోసం మ‌ళ్ళించుకుంటున్నారు. "తెలంగాణా ప్ర‌భుత్వం ఇటీవ‌ల ఓ జీవో జారీ చేసింది. అదేమిటంటే రూపు మారిన విగ్ర‌హాల్ని అన్ని జిల్లా కేంద్రాల్లో ప్ర‌తిష్టించ‌డానికి 5 కోట్ల రూపాయ‌లు విడుద‌ల చేస్తూ జారీ చేసిన జీవో అది. విగ్ర‌హాల‌పై వున్న ఆస‌క్తి ప్ర‌భుత్వాల‌కు పుస్త‌కాల‌పై లేదు," అని డాక్ట‌ర్ సంగిశెట్టి శ్రీనివాస్ ఫెడ‌ర‌ల్ తెలంగాణా తెలిపారు.

"ఏఐతో పాటు సిల్క్ డెవ‌ల‌ప్ సెంట‌ర్ ప్రారంభించి యువ‌త‌కు మార్గ‌ద‌ర్శిగా బొల్లారం రీడింగ్ రూంను మార్చాల‌నుకుంటున్నాం," అని రీడింగ్ రూం అధ్య‌క్షులు ప్రొఫెస‌ర్ జి.సురేంద‌ర్‌రెడ్డి తెలిపారు. రీస‌ర్చ్ స్కాల‌ర్స్‌కు, స్థానికుల‌కు ఉప‌యోగ‌ప‌డే విధంగా రీడింగ్ రూంలో హైస్పీడ్ ఇంట‌ర్నెట్‌, కంప్యూట‌ర్‌లు ఏర్పాటు చేయ‌డానికి ఎవ‌రైనా ముందుకువ‌స్తే వారి స‌హ‌కారం తీసుకుంటామ‌ని సురేంద‌ర్‌రెడ్డి చెప్పారు.

Read More
Next Story