‘ఇజ్రాయెల్ దాడులపై భారత్ మౌనం బాధాకరం’
x

‘ఇజ్రాయెల్ దాడులపై భారత్ మౌనం బాధాకరం’

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలను తగ్గించడానికి భారత్ జోక్యం చేసుకోవాలని కోరిన సోనియా...


Click the Play button to hear this message in audio format

ఇజ్రాయెల్- ఇరాన్‌ మధ్య కొనసాగుతున్న యుద్ధంపై భారత్ మౌనంగా ఉండటాన్ని కాంగ్రెస్‌(Congress) అగ్రనేత సోనియా గాంధీ (Sonia Gandhi) తప్పుబట్టారు. మౌనంగా ఉండడమంటే విలువలు వదిలేయడంతో సమానమని పేర్కొ్నారు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గించడానికి ప్రతి దౌత్య మార్గాన్ని భారత్ ఉపయోగించాలని సూచించారు.

ఇరాన్‌(Iran), అమెరికాల మధ్య అణు చర్చలకు మార్గం సుగమం అవుతున్న సమయంలో టెల్‌ అవీవ్‌ ఒక్కసారిగా టెహ్రాన్‌లోని అణుస్థావరాలపై దాడులకు దిగడం సరైన చర్య కాదని సోనియా అభిప్రాయం వ్యక్తంచేశారు. ఇజ్రాయెల్‌ మారణహోమానికి గాజాలో సుమారు 55 వేల మంది పాలస్తీనియన్లు ప్రాణాలు కోల్పోయారన్నారు. గాజాలో జరిగిన విధ్వంసం మళ్లీ ఇరాన్‌లో పునరావృతం కాకుండా చూసేందుకు భారత్‌ జోక్యం చేసుకోవాలని కోరారు.

ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు(Benjamin Netanyahu)పై సోనియా విమర్శలు గుప్పించారు. జూన్ 13న ఇరాన్‌పై ఇజ్రాయెల్ చేసిన దాడి చట్టబద్ధమైనది కాదని అభిప్రాయపడ్డారు. ఈ దాడులతో ప్రపంచంలో ప్రమాదకర పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందన్నారు. ‘‘గాజాలో లక్షల మంది సామాన్యులు చనిపోతున్నారు. ఆసుపత్రులు, కాలనీలు నాశనమవుతున్నాయి. ఇజ్రాయేల్ ప్రతిచర్యా అమానుషంగా ఉంటోంది’’ అని పేర్కొన్నారు. పశ్చిమాసియాలో లక్షలాది భారతీయులు ఉన్నందున అక్కడ శాంతిస్థాపన మనకూ అవసరమని చెప్పారు. కశ్మీర్ విషయంలోనూ ఇరాన్ గతంలో భారత్‌కు మద్దతిచ్చిందని సోనియా గుర్తుచేశారు.

Read More
Next Story