తిరుమల లడ్డూ వివాదంతో ఒడిశా ప్రభుత్వం అలర్ట్..
x
Photo credit..playground.com

తిరుమల లడ్డూ వివాదంతో ఒడిశా ప్రభుత్వం అలర్ట్..

‘‘నెయ్యిని మాత్రమే కాకుండా మహాప్రసాదం తయారీలో ఉపయోగించే అన్ని పదార్థాల నాణ్యతను కూడా పరిశీలిస్తాం” - ఒడిశా న్యాయశాఖ మంత్రి పృథివీరాజ్ హరిచందన్


హిందువుల ఆరాధ్యదైవం తిరుమల వెంకన్న. శ్రీవారి మహాప్రసాదం లడ్డూ. హైందవుల పవిత్ర క్షేత్రం ఇప్పుడు వివాదాలకు కేంద్రమైంది. వైసీపీ హయాంలో లడ్డూ తయారీకి కల్తీ నెయ్యి వాడారని, జంతువుల కొవ్వు అందులో కలిసి ఉందని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ఆరోపించారు. లడ్డూలో పంది కొవ్వు, చేపనూనెతో కల్తీ అయిన నెయ్యిని వాడినట్టు గుజరాత్‌‌లోని నేషనల్ డెయిరీ డెవలప్మెంట్ బోర్డు (ఎన్డీడీబీ) కోఆపరేటివ్ లిమిటెడ్ సంస్థ రిపోర్టు ఇచ్చింది. కాగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కల్తీ జరగలేదని వాదిస్తున్నారు.

ఈ నేపథ్యంలో లడ్డూ ప్రసాదం తయారీకి వాడే నెయ్యిలో కల్తీ జరిగినట్లు నమోదైన ఎఫ్‌ఐఆర్‌పై దర్యాప్తు కోసం సుప్రీంకోర్టు స్వతంత్ర ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్‌) ఏర్పాటు చేసింది. ఇందులో సీబీఐ నుంచి ఇద్దరు, రాష్ట్ర పోలీసుల నుంచి ఇద్దరు, భారత ఆహార భద్రత, ప్రమాణాల ప్రాధికార సంస్థ (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ) నుంచి ఒక సీనియర్‌ అధికారిని నియమించాలని ఆదేశించింది. సీబీఐ అధికారుల పేర్లను ఆ సంస్థ డైరెక్టర్, రాష్ట్ర ప్రభుత్వ అధికారుల పేర్లను ఏపీ ప్రభుత్వం, ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ అధికారి పేరును ఆ సంస్థ ఛైర్‌పర్సన్‌ ప్రతిపాదించాలని నిర్దేశించింది. దర్యాప్తు సీబీఐ డైరెక్టర్‌ పర్యవేక్షణలో జరుగుతుంది.

అప్రమత్తమైన ఒడిశా ప్రభుత్వం..

తిరుమల లడ్డూ వ్యవహారంతో ఒడిశాలో బీజేపీ పాలిత ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. ప్రసాదం స్వచ్ఛతతో పాటు భవిష్యత్తులో ఎలాంటి వివాదాలు తలెత్తకుండా ఉండేందుకు శ్రీకారం చుట్టింది. పూరీ జగన్నాథ ఆలయంలో మహాప్రసాదం, నెయ్యి నాణ్యతను తనిఖీ చేస్తామని ప్రకటించింది. మహాప్రసాదం తయారీకి ఉపయోగించే పదార్థాల నాణ్యతను పరిశీలించేందుకు ప్రత్యేకంగా ఫుడ్ ఇన్‌స్పెక్టర్‌ను నియమించనుంది. పదార్థాలు ఆలయ వంటశాలకు వెళ్ళే ముందు, దేవతలకు మహాప్రసాదం సమర్పించిన తర్వాత నాణ్యతను తనిఖీ చేయనున్నారు. ‘‘ప్రసాదం తయారీకి వాడే ప్రతి పదార్థం నాణ్యతగా ఉండేలా చర్యలు తీసుకుంటాం. ఆలయ వంటగదిలోకి ప్రవేశించే ముందు పదార్థాల నాణ్యత తనిఖీ చేస్తాం. నెయ్యిని మాత్రమే కాకుండా మహాప్రసాదం తయారీలో ఉపయోగించే అన్ని పదార్థాల నాణ్యతను కూడా పరిశీలిస్తాం” అని ఒడిశా న్యాయశాఖ మంత్రి పృథివీరాజ్ హరిచందన్ పేర్కొన్నారు.

Read More
Next Story