ఒకే దేశం-ఒకే ఎన్నిక అమల్లోకి రానుందా?
x

'ఒకే దేశం-ఒకే ఎన్నిక' అమల్లోకి రానుందా?

కేంద్రంలోని బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ సర్కార్ 'ఒకే దేశం-ఒకే ఎన్నికల' విధానాన్ని అమలు చేసేందుకు సిద్ధంగా ఉందని ప్రభుత్వ వర్గాల నుంచి వస్తున్న సమాచారం.


కేంద్రంలోని బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ సర్కార్ 'ఒకే దేశం-ఒకే ఎన్నికల' విధానాన్ని అమలు చేసేందుకు సిద్ధంగా ఉందని ప్రభుత్వ వర్గాల నుంచి వస్తున్న సమాచారం. ఈ విధానాన్ని అమలు చేసేందుకు వివిధ పార్టీల నుంచి మద్దతు లభిస్తుందని బీజేత అగ్రనేతలు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుత మోదీ పాలనలోనే ‘వన్ నేషన్, వన్ ఎలక్షన్’ అమల్లోకి వస్తుందని పీటీఐకి అందిన సమాచారం.

కోవింద్ నేతృత్వంలోని ప్యానెల్ సిఫార్సులివి..

మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ అధ్యక్షతన ఏర్పాటయిన ఒక కమిటీ తన నివేదికలో లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలని , అలాగే 100 రోజుల్లో స్థానిక సంస్థలకు కూడా ఎన్నికలు నిర్వహించాలని సిఫారసు చేసింది. ఏకకాల ఎన్నికల వల్ల వనరులను ఆదాతో పాటు అభివృద్ధి, సామాజిక ఐక్యతను పెంపొందించడం, ప్రజాస్వామ్య పునాదులను మరింత బలోపేతం చేయడానికి దోహదపడతాయని ప్యానెల్ తన నివేదికలో పేర్కొంది.

తమ సిఫార్సుల అమలును పరిశీలించేందుకు అమలు నిర్వాహక గ్రూపును కూడా ఏర్పాటు చేయాలని ప్రతిపాదించింది. 18 రాజ్యాంగ సవరణలను కూడా ప్యానెల్ సిఫార్సు చేసింది. వీటిలో చాలా వరకు రాష్ట్ర అసెంబ్లీల ఆమోదం అవసరం లేదు. అయితే వీటికి కొన్ని రాజ్యాంగ సవరణ బిల్లులు అవసరం. వీటిని పార్లమెంటు ఆమోదించాల్సి ఉంటుంది. ఈ ప్రణాళికకు త్వరలో లా కమిషన్ ఆమోదం లభించవచ్చు. ఇది 2029 నుంచి లోక్‌సభ, రాష్ట్ర అసెంబ్లీ, స్థానిక సంస్థల ఎన్నికలను ఏకకాలంలో నిర్వహించాలని సిఫారసు చేయవచ్చు.

మోదీ ఇండిపెండెన్స్ డే స్పీచ్..

బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం చాలా కాలంగా ఒకే దేశం, ఒకే ఎన్నికల విధానం గురించి ఆలోచిస్తుంది. 78వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా జాతినుద్దేశించి మోదీ ప్రసంగిస్తూ.. 'ఒకే దేశం-ఒకే ఎన్నికల' విధానం అమలుపై దేశవ్యాప్తంగా విస్తృత సంప్రదింపులు జరిగాయని, అన్ని రాజకీయ పార్టీలు తమ అభిప్రాయాలను తెలిపాయని చెప్పారు. కమిటీ కూడా అద్భుతమైన నివేదికను సమర్పించిందని పేర్కొన్నారు.

"తరచుగా జరిగే ఎన్నికలు దేశ ప్రగతికి అడ్డంకులు సృష్టిస్తున్నాయి. ఏ పథకమైనా/కార్యక్రమమైనా ఎన్నికలతో ముడిపెట్టడం చాలా తేలికైంది. ప్రతి మూడు, ఆరు నెలలకు ఎక్కడో ఒకచోట ఎన్నికలు జరుగుతాయి. ప్రతి పని ఎన్నికలతో ముడిపడి ఉంటుంది" అని మోదీ వ్యాఖ్యానించారు. ఒకే దేశం, ఒకే ఎన్నిక కోసం దేశం ముందుకు రావాలని కోరారు.

ప్రతిపక్షాలు ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి?

వన్ నేషన్, వన్ ఎలక్షన్ అనేది బీజేపీ తన ఎన్నికల మేనిఫెస్టోలోని కీలక వాగ్దానాలలో ఒకటి. అయితే ఈ ఆలోచనను ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. వివిధ సమయాల్లో వివిధ రాష్ట్రాలు ఎన్నికలు జరిగి పాలన చేపట్టిన ప్రభుత్వాల కాలపరిమితిని ఒకే టైమ్‌లైన్‌కు ఎలా తీసుకువస్తారనే దానిపై స్పష్టత లేదని అంటున్నారు. లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి జరిగితే కేంద్ర సమస్యలపై దృష్టి సారించినంతగా స్థానిక సమస్యలపై దృష్టి ఉండదని ప్రాంతీయ పార్టీలు చెబుతున్నాయి.

Read More
Next Story