దీదీ ‘అపరాజిత’ కు ప్రతిపక్షాల ఆమోదం
ప్రతిపక్షాల నుంచి వస్తున్న విమర్శల నేపథ్యంలో సీఎం మమతా బెనర్జీ ‘‘అత్యాచార నిరోధక బిల్లు’’ను మంగళవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టారు.
కోల్‌కతాలో ట్రైనీ డాక్టర్ అత్యాచారం, హత్య ఘటన దేశవ్యాప్త ఆందోళనకు దారితీసింది. 31 ఏళ్ల ట్రైనీ పీజీ వైద్యురాలు ఆర్‌జీ కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ సెమినార్ హాల్‌లో విశ్రాంతి తీసుకుంటుండగా.. ఆమెను అత్యాచారం చేసి అనంతరం హత్య చేశారు. ఈ అమానవీయ ఘటనతో యావత్ సమాజం నివ్వెర పోయింది. వెస్ట్ బెంగాల్‌తో పాటు దేశవ్యాప్తంగా ఆందోళనలు మిన్నంటాయి. జూనియర్ డాక్టర్లు విధులను బహిష్కరించి నిరసన తెలిపారు. ఘటనను ప్రభుత్వం, పోలీసుల వైఫల్యంగా భావించిన కలకత్తా హైకోర్టు కేసుని సీబీఐకి అప్పగించిన విషయం తెలిసిందే.
ప్రతిపక్షాల నుంచి వస్తున్న విమర్శల నేపథ్యంలో సీఎం మమతా బెనర్జీ ‘‘అత్యాచార నిరోధక బిల్లు’’ను మంగళవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. న్యాయ మంత్రి మోలోయ్ ఘటక్ బిల్లును ప్రవేశపెట్టారు. అపరాజిత స్త్రీ, పిల్లల బిల్లు (పశ్చిమ బెంగాల్ క్రిమినల్ చట్టాలు, సవరణ) బిల్లు - 2024కు ప్రతిపక్షాలు పూర్తి మద్దతు ఇవ్వడంతో బిల్లును ఏకగ్రీవంగా ఆమోదించింది బెంగాల్ అసెంబ్లీ. త్వరితగతిన కేసుల విచారణ, సత్వర న్యాయం అందించడం, కఠిన శిక్షలు విధించడం ఈ బిల్లు ప్రధాన ఉద్దేశమని మమతా బెనర్జీ చెప్పారు.
‘వాళ్లు రాజీనామా చేయాలి’
మహిళల రక్షణకు సమర్థవంతమైన చట్టాలను అమలు చేయడంలో విఫలమయ్యారని, అందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, అత్యాచార ఘటనలు చోటుచేసుకున్న రాష్ట్రాల ముఖ్యమంత్రులు రాజీనామా చేయాలని బెనర్జీ డిమాండ్ చేశారు.
అత్యాచారం మానవత్వానికి శాపమని, అలాంటి నేరాలను అరికట్టడానికి సామాజిక సంస్కరణలు అవసరమని పేర్కొన్న బెంగాల్ సిఎం.. గవర్నర్ సివి ఆనంద బోస్‌తో బిల్లుపై సంతకం చేయించాలని ప్రతిపక్షాలను కోరారు. ఆ తర్వాత దానిని అమలు చేయడం తమ బాధ్యత అని మమతా బెనర్జీ అన్నారు.
ఇక కఠిన శిక్షలే..
అత్యాచార బాధితురాలు మరణించినా, మానసిక స్థితి కోల్పోయి నిస్సహాయ స్థితికి చేరుకున్నా.. దారుణానికి ఒడిగట్టిన వ్యక్తికి మరణశిక్ష విధించాలి. అత్యాచారం, సామూహిక అత్యాచారానికి పాల్పడిన వారికి పెరోల్ కు అవకాశం ఇవ్వకుండా జీవిత ఖైదు విధించేలా బిల్లు తయారు చేశారు.
గత నెలలో పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో మహిళా వైద్యురాలిపై అత్యాచారం-హత్య ఘటన నేపథ్యంలో సోమవారం రెండు రోజుల అసెంబ్లీ ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసి బిల్లును ఆమోదించారు.