అల్ ఫలాహ్ విశ్వవిద్యాలయంలో కమాండ్ సెంటర్‌ ఏర్పాటు
x

అల్ ఫలాహ్ విశ్వవిద్యాలయంలో కమాండ్ సెంటర్‌ ఏర్పాటు

యూనివర్సిటీలోనే మకాం వేసిన NIA, ED, ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్, యాంటీ-టెర్రర్ స్క్వాడ్ (ATS), ఫరీదాబాద్ క్రైమ్ బ్రాంచ్, జమ్మూ, కాశ్మీర్ పోలీసులు..


Click the Play button to hear this message in audio format

ఢిల్లీ(Delhi) ఎర్రకోట సమీపంలో నవంబర్ 10న జరిగిన కారు పేలుడు (Car blast) ఘటనకు సంబంధించి హర్యానా రాష్ట్రం ఫరీదాబాద్‌లోని అల్ ఫలాహ్ యూనివర్సిటీలోని సుమారు 200 మంది వైద్యులు, సిబ్బంది దర్యాప్తు సంస్థల నిఘాలో ఉన్నారు. భద్రతా సంస్థలు తరచూ విశ్వవిద్యాలయంలో తనిఖీలు చేస్తుండడం అటు విద్యార్థులను ఇటు సిబ్బందిని ఆందోళనకు గురిచేస్తుంది.


తాత్కాలిక కమాండ్ సెంటర్ ఏర్పాటు..

దర్యాప్తులో భాగంగా జాతీయ దర్యాప్తు సంస్థ (NIA)తో పాటు, ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్, ఉత్తరప్రదేశ్ యాంటీ-టెర్రర్ స్క్వాడ్ (ATS), ఫరీదాబాద్ క్రైమ్ బ్రాంచ్, జమ్మూ మరియు కాశ్మీర్ పోలీసులు ఏకంగా యూనివర్సిటీ లోపలే మకాం వేశారు. దర్యాప్తు బృందాలన్నీ కలిసి తాత్కాలిక కమాండ్ సెంటర్‌ను ఏర్పాటు చేసుకున్నాయి.


ఉగ్రవాదులతో సంబంధాలున్నాయా?

కారు పేలుడు తర్వాత విశ్వవిద్యాలయం నుంచి ఎంతమంది వెళ్లిపోయారో దర్యాప్తు సంస్థలు తెలుసుకుంటున్నాయి. వారిని గుర్తించడానికి ప్రయత్నిస్తున్నాయి. ఇలా వెళ్లిపోయిన వారితో ఉగ్రవాదులకు ఏవైనా సంబంధాలున్నాయా? అనే కోణంలో దర్యాప్తు మొదలుపెట్టారు. చాలా మంది తమ మొబైల్ డేటాను తొలగించడంపై కూడా దర్యాప్తు జరుగుతున్నట్లు సమాచారం.


ఉమర్ ఇంటి ఓనర్‌ని ప్రశ్నించిన దర్యాప్తు సంస్థలు..

యూనివర్సిటీ క్యాంపస్ లోపల విద్యార్థుల హాస్టళ్లు, గదులను పోలీసులు సోదా చేస్తున్నారు. వెయ్యి మందికి పైగా వ్యక్తులను ప్రశ్నించినట్లు సమాచారం. నుహ్‌లోని హిదాయత్ కాలనీలో ఆత్మాహుతి బాంబర్ డాక్టర్ ఉమర్ నబీకి గదిని అద్దెకు ఇచ్చిన 35 ఏళ్ల మహిళను దర్యాప్తు సంస్థలు అదుపులోకి తీసుకున్నాయి. ఆమె కుటుంబాన్ని కూడా విచారిస్తున్నారు. ఉమర్‌తో ఉన్న సంబంధాన్ని తెలుసుకోవడానికి నుహ్‌లోని మరో ఏడుగురు స్థానికులను కూడా ప్రశ్నించినట్లు తెలుస్తోంది. అద్దె గదిలో ఉన్నప్పుడు ఉమర్ చాలా మొబైల్ ఫోన్‌లను ఉపయోగించినట్లు సమాచారం.


తగ్గిన రోగుల సంఖ్య..

అల్ ఫలాహ్ మెడికల్ కాలేజీ నిఘా నీడలో ఉండడంతో ఆసుపత్రికి వచ్చే రోగుల సంఖ్య కూడా తగ్గింది. గతంలో రోజూ దాదాపు 200 మంది ఔట్ పేషెంట్ రోగులు వచ్చేవారు. ఇప్పుడు ఆ సంఖ్య 100కు పడిపోయినట్లు సమాచారం.


ఉమర్ ప్రత్యేకం..

యూనివర్సిటీలో ఉమర్‌ను ప్రత్యేకంగా చూసేవారని తెలుస్తోంది. MBBS పూర్తయిన తర్వాత ఆసుపత్రిలో అప్రెంటిస్‌లుగా ఉన్న ఇద్దరు వైద్యుల్లో ఉమర్ ఒకరు. 2023 నుంచి దాదాపు 6 నెలల పాటు విశ్వవిద్యాలయానికి గైర్హాజరయ్యారు. తిరిగి వచ్చిన తర్వాత నేరుగా విధుల్లో చేరాడు. అయితే అతనిపై యూనివర్సిటీ సిబ్బంది ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఉమర్ తరగతులకు కూడా తక్కువగా హాజరయ్యేవాడని తెలుస్తోంది. వారానికి ఒకటి లేదా రెండు లెక్చర్లు మాత్రమే ఇచ్చేవాడని, అవి కూడా 15 నుంచి 20 నిమిషాలకు మించి ఉండేవి కాదని తెలుస్తోంది. ఆ తర్వాత తన గదికి వెళ్లిపోయేవాడు. ఇది మిగతా లెక్చరర్లకు నచ్చేది కాదు. దిగ్భ్రాంతికర విషయం ఏమిటంటే.. ఉమర్‌కు నైట్ డ్యూటీలు ఎప్పుడూ ఉండేవి కాదని వైద్యులు తెలిపారు. అతడు ఎప్పుడూ ఉదయం షిఫ్టుల్లో మాత్రమే పనిచేసేవాడని వారు చెప్పారు.


అల్ ఫలాహ్ చైర్మన్‌కు నోటీసులు..

అల్ ఫలాహ్ గ్రూప్ చైర్మన్ జావాద్ అహ్మద్ సిద్ధిఖీ అనధికారికంగా నిర్మించిన భవనాల్లో నివాసం ఉంటున్న వారు తక్షణమే ఖాళీ చేసి వెళ్లిపోవాలని నోటీసులు ఇచ్చారు. వాటిని మూడు రోజుల్లో కూల్చేస్తున్నట్లు మధ్యప్రదేశ్‌లోని స్థానిక కంటోన్మెంట్ బోర్డు మోవ్‌ పేర్కొంది.

మోవ్‌లో జరిగిన ఆర్థిక మోసానికి సంబంధించి మధ్యప్రదేశ్ పోలీసులు గతంలో హైదరాబాద్‌కు చెందిన జావాద్ సిద్ధిఖీ సోదరుడు హమూద్ అహ్మద్ సిద్ధిఖీని అరెస్టు చేశారు.

Read More
Next Story