
చాట్ జీపీటీ సలహాతో యువకుడి ఆత్మహత్య..
ఓపెన్‌ఏఐ, దాని సీఈవో శామ్ ఆల్ట్‌మన్‌పై శాన్ ఫ్రాన్సిస్కో కోర్టులో కేసు దాఖలు చేసిన యువకుడి తల్లిదండ్రులు
అభివృద్ధి చెందుతోన్న టెక్నాలజీ ఆత్మహత్యకు సలహాలు కూడా ఇస్తోందంటే నమ్మశక్యంగా లేదు. కాని ఇది వాస్తవం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI)తో డెవలప్ చేసిన చాట్ జీపీటీ(ChatGPT) సలహా తీసుకుని తనువు చాలించాడు అమెరికా(America)కు చెందిన పదహారేళ్ల యువకుడు ఆడమ్ రైన్. ఏప్రిల్ 11న చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తీవ్ర మానసిక క్షోభకు గురైన అబ్బాయి తల్లిదండ్రులు మాథ్యూ, మరియా రైన్.. ఓపెన్‌ఏఐ (Open AI), దాని సీఈవో శామ్ ఆల్ట్‌మన్ (Sam Altman)పై శాన్ ఫ్రాన్సిస్కో కోర్టులో కేసు వేశారు. చాలా నెలలు పాటు చాట్‌జీపీటీతో చేసిన చాట్‌ను వారు బయటపెట్టారు. అది ఇచ్చిన సలహా మేరకు తమ కొడుకు ఆత్మహత్య(Suicide) చేసుకున్నాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆత్మహత్య ఎలా చేసుకోవాలని తమ కొడుకు అడిగిన ప్రశ్నకు..చాట్‌జీపీటీ ఇచ్చిన సమాధానాలను బాధితులు తమ ఫిర్యాదులో పొందుపర్చారు. ఇకనైనా ఆత్మహత్యలకు ప్రేరేపించే పద్ధతులు, సలహాలను ఇవ్వకుండా చాట్‌జీపీటీలో మార్పులు తీసుకురావాలని వారు డిమాండ్ చేశారు.
ఈ ఘటనపై ఓపెన్ ఏఐ ప్రతినిధి ఒకరు స్పందించారు. రైన్ మరణం బాధ కలిగించిందన్నారు. అలాంటి సలహాలు అడిగినప్పుడు చాట్‌జీపీటీ వినియోగదారులకు పలు హెల్ప్‌లైన్ నెంబర్లను సైతం సూచిస్తుందని తెలిపారు. ఓపెన్ ఏఐ రక్షణ చర్యలు మరింత మెరుగుపరచడానికి చర్యలు తీసుకుంటామన్నారు.