RJD‌పై విరుచుకుపడ్డ ప్రధాని
x

RJD‌పై విరుచుకుపడ్డ ప్రధాని

బీహార్ రాష్ట్రం మోతిహరి జిల్లాలో నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్న మోదీ


Click the Play button to hear this message in audio format

ప్రధాని మోదీ (PM Modi) శుక్రవారం బీహార్‌(Bihar)లో పర్యటించారు. మోతిహరి జిల్లాలో నిర్వహించిన ర్యాలీలో ఆయన మహాఘటబంధన్‌‌ను తూర్పారబట్టారు. కాంగ్రెస్(Congress), ఆర్జేడీ (రాష్ట్రీయ జనతాదళ్) పేదల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించాయని, బడుగు, బలహీన వర్గాలకు కేటాయించిన నిధులను లూటీ చేశాయని ఆరోపించారు. కాంగ్రెస్-ఆర్జేడీ పాలన కంటే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం బీహార్‌కు చాలా ఎక్కువ నిధులిచ్చిందని గుర్తుచేశారు. ఆర్జేడీ-కాంగ్రెస్ పాలనలో అభివృద్ధి పూర్తిగా ఆగిపోయిందన్నారు. భవిష్యత్తులో పశ్చిమ భారత్‌ను ముంబై లాగా, దేశంలోని తూర్పు భాగాన్ని మోతిహరిలాగా తీర్చిదిద్దుతామన్నారు.


అభివృద్ధి పనులకు శంకుస్థాపన..

రైల్వేస్, మత్స్యకార, గృహ నిర్మాణ రంగాలకు సంబంధించి తూర్పు చంపారన్ జిల్లాలో రూ. 7,200 కోట్ల విలువ చేసే అభివృద్ధి పనులకు ప్రధాని శంకుస్థాపన చేశారు. అలాగే నాలుగు కొత్త అమృత్ భారత్ రైళ్లకు జెండా ఊపి ప్రారంభించారు. ఇవి అమృత్ భారత్ రైలు రాజేంద్ర నగర్ టెర్మినల్ (పాట్నా) - న్యూఢిల్లీ, బాపుధామ్ మోతిహారి - ఢిల్లీ (ఆనంద్ విహార్ టెర్మినల్), దర్భంగా - లక్నో (గోమతి నగర్), మాల్దా టౌన్ - లక్నో (గోమతి నగర్) మధ్య నడవనున్నాయి. గృహ ప్రవేశ్ కార్యక్రమంలో భాగంగా 12వేల మంది లబ్ధిదారులకు ఇంటి తాళాలు అందజేశారు. ఆవాస్ యోజన-గ్రామీణ్ పథకం కింద 40వేల మంది లబ్ధిదారులకు రూ.160 కోట్లు విడుదల చేశారు. దీనదయాళ్ అంత్యోదయ యోజన, జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్ (DAY-NRLM) కింద బీహార్‌లోని దాదాపు 61,500 స్వయం సహాయక బృందాలకు రూ.400 కోట్లు రిలీజ్ చేశారు.

ప్రధాని వెంట బీహార్ గవర్నర్ ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్, ముఖ్యమంత్రి నితీష్ కుమార్, డిప్యూటీ సీఎం సామ్రాట్ చౌదరి సహా ఇతర నాయకులు ఉన్నారు. మోతీహరి పర్యటన ముగించుకున్న తర్వాత ప్రధాని జూలై 18న పశ్చిమ బెంగాల్‌కు వెళ్లనున్నారు.

ఈ ఏడాది చివర్లో బీహార్‌లో అసెంబ్లీ ఎన్నికల జరగనున్న నేపథ్యంలో ఎన్నికల ప్రచారాన్ని ప్రధాని ముమ్మరం చేశారు. ఇప్పటికే పలుమార్లు ఆయన రాష్ట్రంలో పర్యటించారు.

Read More
Next Story