
‘జాతి నిర్మాణం ఆర్‌ఎస్‌ఎస్ ప్రాథమిక లక్ష్యం’
శత వార్షిక వేడుకల్లో ప్రధాని మోదీ
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) శతాబ్ధి ఉత్సవాలు ఢిల్లీలోని బీఆర్ అంబేడ్కర్ ఇంటర్నేషనల్ సెంటర్‌లో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ వేడుకలకు ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) హాజరై ప్రసంగించారు. పేదల జీవితాల్లో మార్పు తెచ్చేందుకు ఆర్‌ఎస్‌ఎస్ ఒక నదీ ప్రవాహంలా ముందుకు సాగుతోందన్నారు. విద్య, వైద్యం, రైతులకు అనేకవిధాలుగా సేవలందిస్తోన్న సంఘ్.. సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణకు నిరంతరం కృషి చేస్తోందని కొనియాడారు. గతంలో సంస్థ స్ఫూర్తిని అణచివేసేందుకు కేసులు బనాయించడం, నిషేధం లాంటివి జరిగినా.. అన్నింటినీ తట్టుకొని నిలబడడం గొప్పవిషయమని పేర్కొన్నారు.
స్మారక స్టాంపు విడుదల..
ఆర్‌ఎస్‌ఎస్ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా ప్రత్యేకంగా రూపొందించిన స్మారక తపాలా బిళ్ళ, నాణేన్ని ప్రధాని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.."ఈ రూ. 100 నాణెంపై ఒక వైపు జాతీయ చిహ్నం, మరొక వైపు సింహంపై కూర్చున్న భరతమాత చిత్రం ఉంటాయి. దేశ చరిత్రలో మన కరెన్సీపై భారతమాత చిత్రాన్ని చూపించడం ఇదే మొదటిసారి. ఈ రోజు విడుదల చేసిన ప్రత్యేక పోస్టల్ స్టాంపుకు కూడా దాని ప్రాముఖ్యత ఉంది.1963లో RSS స్వయంసేవకులు కూడా గణతంత్ర దినోత్సవ కవాతులో పాల్గొన్నారు, ”అని మోదీ పేర్కొన్నారు.
RSSను1925లో మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో డాక్టర్ కేశవ్ బలిరామ్ హెడ్గేవార్ స్థాపించారు. పౌరులలో క్రమశిక్షణ, సేవ, సామాజిక బాధ్యతను పెంపొందించే లక్ష్యంతో దీని స్థాపన జరిగింది.