కేజ్రీవాల్ "శీష్ మహల్" vs ప్రధాని మోదీ "రాజ్ మహల్"
ఢిల్లీలో సీఎం నివాసం "శీష్ మహల్ (Sheeshmahal)", పీఎం నివాసం "రాజ్ మహల్(Raj mahal)"పై ఆప్ (AAP) , బీజేపీ (BJP) నేతలు పరస్పరం విమర్శలు చేసుకుంటున్నారు.
అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఢిల్లీ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఆమ్ ఆద్మీ పార్టీ(AAP), బీజేపీ(BJP) నేతలు పరస్పరం విమర్శల దాడిని పెంచేశారు. ఈ నేపథ్యంలో ‘సీఎం బంగ్లా’ వివాదం మరోసారి తెరమీదకు వచ్చింది. ఇటీవల ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరయిన ప్రధాని మోదీ "శీష్ మహల్"(Sheeshmahal) గురించి ప్రస్తావించారు. కోవిడ్ సమయంలో సరైన వైద్య సదుపాయాలు లేక రోగులు ఇబ్బందులు పడుతుంటే కేజ్రీవాల్ మాత్రం 'షీష్ మహల్' నిర్మించుకోవడంలో బిజీగా ఉన్నారని ఆరోపించారు. అద్దాల మేడ నిర్మాణానికి ఆయన చాలా డబ్బు వెచ్చించారని చెప్పడం రాజకీయ దుమారానికి దారితీసింది.
మీడియాతో ఢిల్లీ సీఎం ఇంటికి..
‘నిజం ఏమిటో మీరే చూడడం’ అంటూ మీడియాను తీసుకొని రాజ్యసభ ఆప్ ఎంపీ సంజయ్ సింగ్(Sanjay Singh), మంత్రి సౌరభ్ భరద్వాజ్ (Saurabh Bharadwaj) సీఎం అధికారిక నివాసం వద్దకు బయల్దేరారు. ముందు జాగ్రత్త చర్యగా పోలీసులు సీఎం నివాసానికి వెళ్లే దార్లో బారికేడ్లు ఏర్పాటుచేశారు. బారికేడ్లు దాటి ముందుకు వెళ్తున్న ఆప్ నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. ముఖ్యమంత్రి అధికారిక నివాసంలోకి వెళ్లేందుకు అనుమతి లేదని తేల్చిచెప్పారు. దీంతో సీఎం నివాసం ముందు కొంత గందరగోళ వాతావరణం నెలకొంది.
పోలీసుల చర్యను ఆప్ నేతలు తప్పుబడుతూ కొద్దిసేపు ధర్నాకు కూర్చున్నారు. అనంతరం ప్రధాని అధికారిక నివాసం ఉన్న లోక్‌కల్యాణ్ మార్గ్ వైపు వెళ్లేందుకు ప్రయత్నించారు. అయితే వారిని పోలీసులు అడ్డుకున్నారు. మరోవైపు ఆప్‌కు కౌంటర్‌గా బీజేపీ నేతలు ఢిల్లీ సీఎం అధికారిక నివాసం వద్దకు వెళ్లినట్లు సమాచారం.
రాజ్‌మహాల్ ఖర్చు రూ.2,700 కోట్లు..
"కేజ్రీవాల్ సీఎం నివాసాన్ని రూ. 33 కోట్లతో నిర్మించారని బీజేపీ అంటోంది. అయితే ప్రధాని నివాసానికి రూ. 2,700 కోట్లు ఖర్చు చేశారు. ప్రజలకు రెండు భవంతులు చూపిద్దాం,” అని భరద్వాజ్ అన్నారు.
"ఈ రెండు నివాసాలు ప్రభుత్వ ఆస్తులే. ప్రజల డబ్బుతో నిర్మించారు. కోవిడ్ సమయంలో వీటి నిర్మాణం జరిగింది. నిధుల దుర్వినియోగంపై ఆరోపణలు ఉన్నట్లయితే, రెండింటినీ దర్యాప్తు చేయాలి," అని ఆయన డిమాండ్ చేశారు.
అసలు కేజ్రీవాల్ ఇంటికి ఎంత ఖర్చుచేశారు?
కేజ్రీవాల్ తొమ్మిదేళ్ల బంగ్లాలో విలాసవంతమైన గృహోపకరణాలు, గాడ్జెట్ల కోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేశారని బీజేపీ ఆరోపిస్తోంది. ప్రజా ధనాన్ని కేజ్రీవాల్ దుర్వినియోగం చేశారని ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్‌దేవా ఆరోపించారు. ఈ సందర్భంగా పీడబ్ల్యుడీ జాబితాను ఆయన బయటపెట్టారు.
పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ (పీడబ్ల్యుడీ) తయారు చేసిన ఇన్వెంటరీలో జాబితా ప్రకారం.
• TOTO స్మార్ట్ టాయిలెట్ సీటు: ఆటోమేటిక్ సెన్సార్లు, హీటెడ్ సీట్లు, వైర్లెస్ నియంత్రణ ఉన్న ఈ టాయిలెట్ సీట్లు ఒక్కోదానికి రూ. 10-12 లక్షలు ఖర్చవుతుంది.
• హై-టెక్ కిచెన్ ఉపకరణాలు: AI- ఎనేబుల్డ్ స్క్రీన్ (రూ. 9 లక్షలు), స్టీమ్ ఓవెన్ (రూ. 9 లక్షలు), BOSCH కాఫీ మెషీన్ (రూ. 2.5 లక్షలు), స్మార్ట్ రిఫ్రిజిరేటర్.
• వినోదం & ఫర్నిషింగ్‌లు: రూ. 64 లక్షల విలువైన 16 సోనీ అల్ట్రా స్లిమ్ 4K టీవీలు, రూ. 10 లక్షల ఖరీదు చేసే లగ్జరీ రిక్లైనర్ సోఫాలు.
కేజ్రీవాల్ ఇంటికి ఖాళీ చేసిన తర్వాత TOTO స్మార్ట్ టాయిలెట్ సీట్లు, కొన్ని అత్యాధునిక వస్తువులు కనిపించడం లేదని, రూ. 15 కోట్ల నుంచి రూ. 20 కోట్ల పునరుద్దరణ ఖర్చును సీఎం ఏకంగా రూ. 53 కోట్లను పెంచారని బీజేపీ నేతలు ఆరోపించారు.