రాముడి చుట్టూ రాజకీయాలు!  శంకరాచార్యులు హైందవ ధర్మానికేమీ చేయలేదా రాణే?
x
sankaraachaya

రాముడి చుట్టూ రాజకీయాలు! శంకరాచార్యులు హైందవ ధర్మానికేమీ చేయలేదా రాణే?

రామ, రామ.. అది నోరేనా నారాయణ రాణే.. హైందవ ధర్మ ప్రచారానికి జగద్గురు శంకరాచార్య పీఠాలు ఏమీ చేయలేదా.. అంతమాటెల అంటావ్ అని విపక్షాలు, తప్పేముందని అధికార పక్షం వాదన


తరతరాలుగా మన సమాజంలో స్థలానికి, ఆలయానికి పెద్ద ప్రాధాన్యత ఉంది. మతం నుంచి రాజ్యాన్ని విడగొట్టాలన్న ఆలోచన వచ్చినందుకే రక్తం ఏరులై పారింది. పెత్తనం ఎవరికుండాలనే స్పష్టత వచ్చేంతవరకు అది కొనసాగినట్టు చరిత్ర చెబుతోంది. చట్టబద్ధత కోసం రాజులు ఆలయాలు నిర్మిస్తే పూజారులు రాజ్యాల ధాతృత్వాన్ని కోరారు. కాలంతో పాటు భక్తి ఉద్యమాలు, జాతీయ ఉద్యమాలు వచ్చాయి. విముక్తి పోరాటాల్లో జాతీయవాదం, మతం చెట్టపట్టాలేసుకునే పాల్గొన్నాయి. ఆ తర్వాతే ఈ సత్ సంబంధాలు దెబ్బతిన్నాయి. ఇప్పుడు ఆ సంబంధాలు మరింత క్లిష్టతరంగా మారాయి.

ఎందుకీ వివాదాలు..


రాముడి చుట్టూ రాజకీయాలు ముసురుకుంటున్నాయి. అయోధ్య రామాలయం ప్రాణప్రతిష్ట ముహూర్తం దగ్గర పడే కొద్ది.. విమర్శలు ప్రతివిమర్శల మంటలు మండుతున్నాయి. అగ్ని హోమాల నుంచి రేగాల్సిన జ్వాలలు రాజకీయుల నోళ్ల నుంచి రేగుతున్నాయి. పొరపాటున ఎవరైనా రామాలయంపై పల్లెత్తుమాటన్నా ‘మోదీ’యులు ఆగ్రహోదగ్రులవుతున్నారు. చీల్చిచెండాడుతున్నారు. అయోధ్య రామాలయ ప్రాణప్రతిష్టకు దూరంగా ఉండాలని నిర్ణయించినందుకు కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకత్వంపై హిందూత్వమంతా తమదే అనుకుంటున్న బీజేపీ, వారి సోషల్ మీడియా బృందం రాద్దాంతం సృష్టించింది. ఆ కార్యక్రమానికి దూరంగా ఉండే స్వేచ్ఛ కాంగ్రెస్ వాళ్లకి ఉందన్న ఇంగితాన్ని మరిచి.. జాతి వ్యతిరేకులనే ముద్ర వేయడానికి అహోరాత్రులు కష్టపడుతున్నాయి బీజేపీ సేనలు.

హిందూ ధర్మం వ్యాప్తికి ఏమీ చేయలేదా..

హైందవ ధర్మాన్ని ప్రచారం చేయడంలో శంకరచార్యులకు, వారి మఠాలకున్న ప్రాశస్త్యం అంతా ఇంత కాదు. అటువంటి పీఠాధిపతులలో అగ్రగణ్యులైన శంకరాచార్యుల వారు ‘రామాలయం పూర్తి కాకుండా ప్రారంభించడాన్ని శాస్త్రం అంగీకరించదు ’ అంటారు. ఇక అంతే బీజేపీ నేతలు విరుచుకుపడ్డారు. ‘హిందూ ధర్మం వ్యాప్తికి మీరేం చేశారు, వచ్చి ఆశీర్వదించమని అడిగితే రామాలయాన్ని ఎలా ప్రారంభిస్తారనడానికి మీకున్న అర్హతేంటని’ కేంద్రమంత్రి నారాయణ రాణే వ్యాఖ్యానించడం వివాదాస్పదమైంది. శంకరాచార్యుల గురించి తెలిసే కేంద్ర మంత్రి మాట్లాడారా అని కాంగ్రెస్ పార్టీ విరుచుకుపడది.

శంకరాచార్యుల వారి అభిప్రాయం ఇదీ..

సరిగ్గా ఈ దశలోనే ఉత్తరాఖండ్ శంకరాచార్య మాట్లాడుతూ ‘తాను జనవరి 22న రామమందిరం కార్యక్రమానికి హాజరైతే, ప్రజలు తన ముందున్న గ్రంథాలను ఉల్లంఘించానని వ్యాఖ్యానిస్తారని’ అన్నారు. ఉత్తరాఖండ్ జ్యోతిష్ పీఠ్ శంకరాచార్య అవిముక్తేశ్వరానంద్ “అయోధ్య రామ మందిరం అసంపూర్తిగా ఉంది, అందుకే మత గ్రంధాలకు విరుద్ధంగా జరుగుతున్న ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొనలేనని చెప్పాను” అని వివరించారు. “దేవాలయం భగవంతుని శరీరం. ఆలయ శిఖరం దేవుని నేత్రాలు. 'కలశం' శిరస్సును సూచిస్తుంది. గుడిపై ఉన్న జెండా దేవుని కేశం” అని శంకరాచార్యులు చెప్పారు. "శరీరంలో తల, కళ్లు లేకుండా ప్రాణం (ప్రాణ-ప్రతిష్ఠ) నింపడం సరికాదు. ఇది మన గ్రంథాలకు విరుద్ధం. అందుకే నేను అక్కడికి వెళ్లను, ఎందుకంటే నేను అక్కడికి వెళితే ఎదుటి వ్యక్తులు గ్రంథాలను ఉల్లంఘించారని చెబుతారు నా గురించి. అందుకే, మేము బాధ్యతగల వ్యక్తులతో, ప్రత్యేకించి అయోధ్య ట్రస్ట్ సభ్యులతో సమస్యను లేవనెత్తాం. ఆలయాన్ని పూర్తిగా నిర్మించిన తర్వాత వేడుకలు జరపాలన్నాం" అని ఉత్తరాఖండ్ శంకరాచార్య చెప్పారు. జనవరి 22న జరిగిన వేడుకకు నలుగురు శంకరాచార్యులు హాజరుకాకపోవడంపై పెద్ద వివాదం నడుస్తోంది. ఉత్తరాఖండ్, ఒడిషా, కర్ణాటక, గుజరాత్ లోని శంకరాచార్యులు నలుగురూ.. రామ మందిర శంకుస్థాపన కార్యక్రమానికి తాము దూరంగా ఉన్నామనడం, శంకరాచార్యుల వారి వాదనలతో ఏకీభవించిన కాంగ్రెస్ వారు దాన్ని సాకుగా చూపి అయోధ్యకు వెళ్లకుండా బహిష్కరించారన్న వివాదమూ చెలరేగింది. పూరీ గోవర్ధన్‌పీఠ్‌కు చెందిన శంకరాచార్య స్వామి నిశ్చలానంద సరస్వతి ఆహ్వానాన్ని తిరస్కరించారు.

వీహెచ్పీ ఏమందంటే...

ప్రధాని మోదీ ఈ వేడుకను నిర్వహించనున్నందున ఈ కార్యక్రమానికి ఇప్పటికే రాజకీయ రంగు పులుముకుంది. నలుగురిలో ఇద్దరు శంకరాచార్యులు ముడుపుల మహోత్సవాన్ని బహిరంగంగా స్వాగతించారని, అయితే వారు ఈ మహత్తర కార్యక్రమానికి హాజరు కాలేరు, వారు తమ సౌలభ్యం మేరకు తర్వాత సందర్శిస్తారని విశ్వహిందూ పరిషత్ (వీహెచ్పీ) పరోక్షంగా శంకరాచార్యుల వారిపై వ్యాఖ్యానించింది.

నారాయణ రాణే ఏమన్నారంటే...


శంకరాచార్యులపై చేసిన వ్యాఖ్యలకు మహారాష్ట్రలోని ప్రతిపక్షాలు కేంద్ర మంత్రి నారాయణ్ రాణేపై దాడి చేసినంత పని చేశాయి. ప్రధాని నరేంద్ర మోదీ ముందు రాణేను తొలగించాలని, శంకరాచార్యుల వారికి బిజెపి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశాయి. “ఇప్పటి వరకు ఎవరూ చేయలేకపోయారు. మిస్టర్ మోదీ, బీజేపీ దీనిని చేపట్టాయి. ఆలయాన్ని నిర్మిస్తున్నారు. వారు ఆలయాన్ని ఆశీర్వదించాలా లేదా విమర్శించాలా? శంకరాచార్యులు అలా అంటున్నారంటే మోదీని, బీజేపీని రాజకీయ కోణంలో చూస్తున్నారని అర్థం. ఈ ఆలయాన్ని రాజకీయాల ప్రాతిపదికన నిర్మించలేదు, మతం ఆధారంగా నిర్మించారు. రాముడు మా దేవుడు” అని రాణే అన్నారు. శంకరాచార్యులు హిందూ ధర్మానికి ఇచ్చిన సహకారం ఏమిటో చెప్పాలని కేంద్ర మంత్రి నారాయణ రాణే నిలదీయడం కూడా వివాదం అయింది. శివసేన (UBT) రాజ్యసభ సభ్యుడు సంజయ్ రౌత్ మాట్లాడుతూ మంత్రి రాణే "హిందూ మతాన్ని అవమానించినందుకు" క్షమాపణ చెప్పాలన్నారు. రామ మందిర విగ్రహ ప్రతిష్టాపన రోజైన జనవరి 22 లోపు BJP క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. శరద్ పవార్ నేతృత్వంలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీకి చెందిన బారామతి ఎంపీ సుప్రియా సూలే మాట్లాడుతూ “రాణే వ్యాఖ్యలపై బీజేపీ స్పందించాలని” అన్నారు. కేంద్ర మంత్రికి వ్యతిరేకంగా కాంగ్రెస్ కార్యకర్తలు ముంబైలో నిరసన తెలిపారు.

బీజేపీ వర్గాల మండిపాటు సరికాదు...

కొంతమంది శంకరాచార్యులు ఈ కార్యక్రమానికి హాజరు కాకూడదని నిర్ణయించుకున్నారనే వార్తలపై ప్రతిపక్షాలు బిజెపిని విమర్శించడం హిందూత్వానికి వ్యతిరేకంగా అభివర్ణించాయి. ఆలయ నిర్మాణం పూర్తయ్యే వరకు ప్రారంభ వేడుక జరుపకూడదన్న జ్యోతిర్పీఠ్ శంకరాచార్య స్వామి అవిముక్తేశ్వరానంద సరస్వతిని ఘాటుగా విమర్శించాయి. శంకరాచార్యుల వారిపై బీజేపీ శ్రేణులు, బీజేపీ సోషల్ మీడియా చేసిన విమర్శలు, వ్యాఖ్యలు సరికాదని ఇప్పుడు అన్ని వర్గాలు అంటున్నాయి. “ హిందూ ధర్మాన్ని పరిరక్షించేందుకు శంకరాచార్యుల వారు ఏమి చేశారో ప్రపంచానికి తెలుసు. నారాయణ రాణేకి తెలియదనుకోను. ఎన్నికల్లో లబ్ధి కోసమో, ఇంకైదైనా ఆశించో జగద్గురు శంకారాచార్యల వారు వ్యాఖ్యలు చేయరని అందరికీ తెలుసు. ఆలయం పూర్తయ్యే దాకా ప్రారంభోత్సవం చేయడం తగదని వారు చెప్పారు. దాన్ని పాటించాలా లేదా అనేది బీజేపీ ఇష్టం. బీజేపికి అయితే ఎన్నికలు ఉన్నాయో, శంకరాచార్యుల వారికి అటువంటి ఆతృత ఏమీ ఉండదు. ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ల నోళ్లు మూయించాలనేది బీజేపీ అభిమతంగా ఉంది” అని ప్రముఖ విశ్లేషకుడు ప్రొఫెసర్ నాగేశ్వర్ చెప్పారు.

Read More
Next Story