శిక్షణ అకాడమీకి రిపోర్ట్ చేయని పూజా ఖేద్కర్.. కారణమేంటి?
x

శిక్షణ అకాడమీకి రిపోర్ట్ చేయని పూజా ఖేద్కర్.. కారణమేంటి?

వివాదాస్పద బ్యూరోక్రాట్ పూజా ఖేద్కర్ అకాడమీకి హాజరుకాలేదు. ఆమె ఎంపిక ప్రక్రియలో అవకతవకలు జరిగాయని ఆరోపణలు రావడంతో ఆమెను రీకాల్ చేసిన విషయం తెలిసిందే.


వివాదాస్పద బ్యూరోక్రాట్ పూజా ఖేద్కర్ అకాడమీకి హాజరుకాలేదు. ఆమె ఎంపిక ప్రక్రియలో అవకతవకలు జరిగాయని ఆరోపణలు రావడంతో ముస్సోరీలోని సివిల్ సర్వీస్ శిక్షణా సంస్థ ఆమెను రీకాల్ చేసిన విషయం తెలిసిందే. జూలై 16న ఖేద్కర్ ప్రొబేషన్ పీరియడ్‌ను తాత్కాలికంగా నిలిపివేసి 23న రిపోర్టు చేయాలని అకాడమీ సూచించింది. అయితే వ్యక్తిగత కారణాలను చూపుతూ ఆమె హాజరుకాలేదు.

ఖేద్కర్‌పై ఉన్న ఆరోపణలేంటి?

ఖేద్కర్ వివాదాలకు కేంద్ర బిందువయ్యారు. మహారాష్ట్రలోని పూణే జిల్లా కలెక్టరేట్‌లో విధులు నిర్వహించిన 32 ఏళ్ల ఖేద్కర్ అధికారాన్ని దుర్వినియోగానికి పాల్పడినట్లు ఆరోపణలున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా 'మహారాష్ట్ర గవర్నమెంట్' అని రాసి ఉన్న ఒక ప్రైవేట్ ఆడి కారుపై ఎరుపు-నీలం రంగు బల్బులు అమర్చుకోవడం, కింది స్థాయి సిబ్బందితో దురుసుగా ప్రవర్తించడంతో ఆమెను విదర్భలోని వాషిమ్ జిల్లాకు బదిలీ చేశారు. దివ్యాంగుల కోటాలో ఉద్యోగాన్ని పొందినట్లు వార్తలు రావడంతో ఆ దిశగా కూడా ఆమెపై విచారణ జరుగుతోంది.

ఉద్యోగం పొందేందుకు కూడా ఆమె వాస్తవాలకు దాచారన్న విమర్శలు ఉన్నాయి. నిబంధనల ప్రకారం.. తల్లిదండ్రుల ఆదాయం సంవత్సరానికి ₹8 లక్షల లోపు ఉన్నవారు మాత్రమే OBC నాన్ క్రీమి లేయర్ కేటగిరీలోకి వస్తారు. అయితే ఈ కోటలో ఉద్యోగం సంపాదించేందుకు ఖేద్కర్ తన తల్లిదండ్రులు విడిగా ఉన్నారని, ఆమె తన తల్లితో నివసిస్తున్నానని చెప్పి సర్టిఫికెట్ సంపాదించారు.

తండ్రి సివిల్ సర్వెంట్‌గా ఉన్నప్పుడు కుటుంబ ఆదాయాన్ని 'సున్నా'గా ఎందుకు చూపించారని అడిగినపుడు..తన తల్లిదండ్రులు విడిగా ఉన్నారని, తండ్రి సంపాదనతో తమకు సంబంధం లేదని చెప్పుకొచ్చింది.

తుపాకీతో బెదిరించినందుకు తల్లి అరెస్టు..

భూ వివాదం కేసులో ఒక వ్యక్తిని తుపాకీతో బెదిరించినందుకు ఖేద్కర్ తల్లి మనోరమను పుణె రూరల్ పోలీసులు అరెస్టు చేశారు. రిటైర్డ్ ప్రభుత్వ అధికారి అయిన ఆమె తండ్రి దిలీప్ కూడా ఈ కేసులో నిందితుడిగా ఉన్నారు. ఈ కేసులో పూణే కోర్టు నుంచి జూలై 25 వరకు మధ్యంతర బెయిల్ పొందారు.

Read More
Next Story