
మా భవిష్యత్తుతో బీజేపీ ఎందుకు ఆడుకుంటుంది?
బీజేపీ ప్రభుత్వ విధానాలు మణిపూర్‌ను గందరగోళంలోకి నెట్టాయి. తన ఇమేజ్‌ను కాపాడుకోడానికి.. రాష్ట్రపతి పాలన కేంద్రానికి మరో అవకాశం ఇచ్చింది, ’’- రాజకీయ విశ్లేషకులు.
‘ఇమాగి మెయిరా’ మహిళా ఉద్యమ సంస్థ అధ్యక్షురాలు థోక్చోమ్ సుజాత. బీజేపీ, ప్రధాని మోదీ తనను, మణిపురీలను వంచించారని కన్నీళ్లు పెట్టుకున్నారు. "మేం ఏ తప్పు చేశాం? బీజేపీ ఎందుకు మా భవిష్యత్తుతో రాజకీయాలు చేస్తోంది?" అని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇంఫాల్‌లోని టేరా అముడోన్ కార్యాలయంలో ‘ఇమాగి మెయిరా’ సభ్యులు సమావేశమయ్యారు. సుజాత అభిప్రాయానికి సభ్యులంతా మద్దతు తెలుపుతున్నట్లు కనిపిస్తోంది. ‘‘రాష్ట్రంలో బలంగా ఉన్న ఈ మహిళా ఉద్యమ సంస్థ.. కేవలం బీజేపీకి మాత్రమే కాకుండా, మొత్తం దేశానికి భవిష్యత్తులో ప్రమాదసూచకం,’’ అని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.
ఇంపాల్‌లో ఓ వీధి
మైతేయి వర్గాన్ని నిరాశపరిచిన బీజేపీ..
2017 ఎన్నికల వేళ మైతేయి వర్గానికి చెందిన మహిళా సంఘాలు బీజేపీకి బలమైన మద్దతునిచ్చాయి. రాష్ట్ర భౌగోళిక సమగ్రతను కాపాడుతామన్న హామీ బీజేపీ విజయానికి కారణమైంది. కానీ ప్రస్తుతం ఈ వర్గం బీజేపీపై పూర్తి నిరాశతో ఉందని సుజాత తెలిపారు.
కసర్ ఏమన్నారు?
ప్రధాని మోదీ ఉత్తర తూర్పు రాష్ట్రాలను ‘అష్టలక్ష్మి’గా పేర్కొనడం వెనక హిందుత్వ అజెండా ఉందని సామాజిక-రాజకీయ విశ్లేషకుడు అషాంగ్ కసర్ ఆరోపించారు. "మైతేయి(Meiteis)లు ఎక్కువగా హిందువులు కావడం వల్ల బీజేపీ(BJP) వారిని మిత్రులుగా పరిగణిస్తోంది," అని పేర్కొన్నారు.
సంస్కృతిలో మార్పులు..
ఇండియనైజేషన్ పేరుతో మణిపూరి(Manipur) సంస్కృతిలో ఇటీవల గమనించదగ్గ స్వల్ప మార్పులు చోటు చేసుకుంటున్నాయి. రాజకీయ, పాలనా కమ్యూనికేషన్‌లో హిందీ భాష వాడకం పెరుగుతోంది. మైతేయి మహిళలు సంప్రదాయంగా ధరిస్తున్న ఫనెక్ (Meitei sarong) బదులుగా చీరలు, సల్వార్ కమీజ్‌ల వాడకం ఎక్కువైంది. బాహ్య ప్రపంచంతో సంబంధాలు పెరగడం కూడా మహిళ్లలో ఈ మార్పులకు కారణమని, అయితే తమ సంస్థ దీనికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తోందని, " సుజాత చెప్పారు.
RSS హిందూ మిలిటెన్సీని ప్రోత్సహిస్తోందా?
ఉత్తర తూర్పు భారతదేశంలోని పురాతన తిరుగుబాటు సంస్థలలో ఒకటైన యునైటెడ్ నేషనల్ లిబరేషన్ ఫ్రంట్ (UNLF) మాజీ అధ్యక్షుడు రాజ్‌కుమార్ మేఘెన్ మాట్లాడుతూ.. "మైతేయి తిరుగుబాటును అదుపు చేయడానికి ఆర్ఎస్ఎస్ హిందూ మిలిటెన్సీని ప్రోత్సహిస్తోంది," అని ఆరోపించారు.
రాజ్‌కుమార్ మేఘెన్
బీజేపీ వ్యూహం విఫలం..
2023 మేలో మైతేయి-కుకి ఘర్షణలు ప్రారంభమైన తర్వాత బీజేపీ వ్యూహం పూర్తిగా విచ్ఛిన్నమైంది. 21 నెలలుగా రాష్ట్రంలో అల్లర్లు కొనసాగుతున్నా.. ప్రధాని మోదీ ఒక్కసారైనా మణిపూర్‌ను సందర్శించకపోవడం మైతేయి వర్గానికి తీవ్ర నిరాశ కలిగించింది.
"మేము హిందువులమే, మోదీ మాకు రక్షణగా నిలుస్తారని మేం నమ్మాం. కానీ కేంద్రం మాకు రక్షణ ఇవ్వలేకపోయింది" అని మణిపూర్‌లోని రాజకీయ వర్గాలు అభిప్రాయ పడ్డాయి. దీని ఫలితంగా కుకి-జో వర్గానికి కేంద్రం మద్దతు ఇస్తోందన్న భావన మైతేయి వర్గంలో పెరగసాగింది.
రాష్ట్రపతి పాలన విధించడం ద్వారా కేంద్ర ప్రభుత్వం తాను మణిపూర్‌ను పట్టించుకుంటోందన్న సంకేతాన్ని పంపేందుకు ప్రయత్నిస్తోందని అషాంగ్ కసర్ అభిప్రాయపడ్డారు.
లేదంటే పరిస్థితి మరోలా ఉంటుంది..
2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ప్రజా ఆగ్రహాన్ని ఎదుర్కొంది. రాష్ట్రంలోని రెండు పార్లమెంటరీ సీట్లను కాంగ్రెస్ గెలుచుకుంది. ఇది బీజేపీకి భారీ హెచ్చరిక అని విశ్లేషకులు పేర్కొన్నారు. "పరిస్థితిని చక్కదిద్దుకోవడానికి బీజేపీకి ఇంకా రెండేళ్ల సమయం ఉంది. వారు సృష్టించిన గందరగోళాన్ని పరిష్కరించుకోవాలి," అని సుజాత వ్యాఖ్యానించారు. త్వరలో శాంతి పునరుద్ధరణకు చర్యలు తీసుకోకపోతే, 2027 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓటమిని చవిచూడాల్సి వస్తుంది," అని హెచ్చరించారు.
బిరెన్ సింగ్ (Biren Singh) రాజీనామా..
కుకి-జో (Kuki-Zo) సామాజిక వర్గానికి చెందిన 10 మంది ఎమ్మెల్యేలు (వీరిలో ఏడుగురు బీజేపీకి చెందిన వారు) మణిపూర్‌లో వర్గపోరుకు మాజీ సీఎం ఎన్. బిరెన్ సింగ్‌ను బాధ్యుడిని చేశారు. ఆయన పక్షపాతపూరిత ప్రవర్తన వల్లే 250 మంది ప్రాణాలు కోల్పోయారని ఆరోపించారు. విస్తృత నిరసనల కారణంగా సింగ్ ఫిబ్రవరి 9న తన పదవికి రాజీనామా చేశారు.