పశ్చిమ బెంగాల్‌లో కొనసాగుతున్న నిరసనకారుల ఆందోళన..
x

పశ్చిమ బెంగాల్‌లో కొనసాగుతున్న నిరసనకారుల ఆందోళన..

ఉద్యోగ భద్రత కల్పించేవరకు ధర్నా విరమించబోమన్న ఉద్యోగాలు కోల్పోయిన ఉపాధ్యాయులు..


Click the Play button to hear this message in audio format

పశ్చిమ బెంగాల్‌(West Bengal)లో ఉపాధ్యాయ ఉద్యోగాలు కోల్పోయిన అభ్యర్థులు నిరసన గళాన్ని వినిపిస్తూనే ఉన్నారు. తమ జీవితాలకు భద్రత కల్పించాలని కోరుతూ పశ్చిమ బెంగాల్ స్కూల్ సర్వీస్ కమిషన్ (WBSSC) ప్రధాన కార్యాలయాన్ని ముందు ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. ఆందోళనకారులు ఏప్రిల్ 21న మధ్యాహ్నం 2 గంటలకు నిరసన మొదలుపెట్టారు. కాగా సర్వీస్ కమిషన్ చైర్మన్‌ సిద్ధార్థ మజుందార్‌ను 40 గంటల పాటు కార్యాలయంలోనే దిగ్భందించిన ఆందోళనకారులు..కోర్టు కేసు విచారణకు హాజరుకావాల్సి ఉండడంతో చైర్మన్‌ను బయటకు అనుమతించారు.

"మా ధర్నా యథావిధిగా కొనసాగుతుంది. కోర్టు కార్యకలాపాల తర్వాత మజుందార్ తిరిగి కార్యాలయానికి చేరుకోగానే ఘెరావ్ వేస్తాం" అని అని నిరసనకారుడు తెలిపారు.

మెరిట్ ఆధారంగా నియామకాలు పొందిన అభ్యర్థుల జాబితా, లంచాలు చెల్లించి నియామకాలు పొందిన అభ్యర్థుల జాబితాను ప్రచురించాలని ఆందోళనకారులు డిమాండ్ చేశారు.

అసలు ఏం జరిగింది ?

పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం 2016లో పశ్చిమ బెంగాల్ స్కూల్ సర్వీస్ కమిషన్ (WBSSC) ద్వారా టీచింగ్, నాన్ టీచింగ్ స్టాప్ నియామకాలను చేపట్టింది. నియామకాల్లో అవినీతి చోటుచేసుకుందని అప్పట్లో వార్తలు కూడా వచ్చాయి. ‘స్కూల్ జాబ్స్ ఫర్ క్యాష్ స్కాం’ కుంభకోణంపై విచారణ చేపట్టిన కలకత్తా హైకోర్టు 2024 ఏప్రిల్‌లో తీర్పు వెల్లడించింది. నియామక ప్రక్రియ ముగిసిన తర్వాత ఉద్యోగం పొందిన వారు.. అలానే బ్లాంక్ ఓఎమ్మార్ షీట్స్ సబ్మిట్ చేసి.. ఉద్యోగాలు పొందిన వారి నియామకం చెల్లదని స్పష్టం చేసింది. మోసపూరితంగా ఉద్యోగాలు పొందిన అభ్యర్థులు ఇన్నాళ్ల పాటు పొందిన వేతనాన్ని 12 శాతం వడ్డీరేటుతో కలిపి తిరిగి చెల్లించాలని ఆదేశించింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ.. మమతా సర్కార్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ పీవీ సంజయ్ కుమార్‌ల ధర్మాసనం విచారణ చేపట్టింది. నియామక ప్రక్రియ, ఉద్యోగాల కేటాయింపులో మోసపూరిత విధానాలు అవలంబించారని అసహనం వ్యక్తం చేసింది. హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ.. 25 వేల మంది నియామకాలు చెల్లవని స్పష్టం చేసింది.

మమత హామీ..

"ఎవరు అర్హులో, ఎవరు అనర్హులో అన్న దాని గురించి మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మీకు ఉద్యోగం ఉందా? జీతాలు సకాలంలో అందుతున్నాయా? అనే దాని గురించి మాత్రమే మీరు ఆలోచించాలి. దయచేసి మీ స్కూళ్లకు తిరిగి వెళ్లండి. ఉద్యోగాలు కోల్పోయిన గ్రూప్ సి, గ్రూప్ డి సిబ్బంది కోసం సుప్రీంకోర్టు(Supreme Court)లో రివ్యూ పిటిషన్ వేస్తాం. అప్పటివరకు మాపై నమ్మకం ఉంచండి, " అని మమత ( CM Mamata Banerjee) ఇదివరకే ఆందోళనకారులకు కోరారు.

Read More
Next Story