
'సీఎం కుర్చీకి రూ. 500 కోట్లు'
పంజాబ్‌లో నవజ్యోత్ కౌర్ సిద్ధూ వ్యాఖ్యలపై రాజకీయ దుమారం..
''సీఎం పదవికి రూ. 500 కోట్లు' అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నవజ్యోత్ కౌర్ సిద్ధూ( Navjot Kaur Sidhu)పై వేటు పడింది. కాంగ్రెస్ పార్టీ ఆమెను పార్టీ సభ్యత్వం నుంచి సస్పెండ్ చేసింది. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అమరిందర్ సింగ్ రాజా వారింగ్ ఓ ప్రకటన విడుదల చేశారు. గతంలో తన భర్త, భారత మాజీ క్రికెటర్, పంజాబ్(Punjab) కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు నవజ్యోత్ సింగ్ సిద్ధూని సీఎం అభ్యర్థిగా ప్రకటించాలని ఆమె డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. ‘‘సీఎం కుర్చీకి రూ. 500 కోట్లు సిద్ధూ కుటుంబం వద్ద లేవ’’న్న కౌర్ వ్యాఖ్యలు రాష్ట్రంలో రాజకీయ దుమారం రేపుతున్నాయి. అధికార ఆమ్ ఆద్మీ పార్టీ, బీజేపీ నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
టార్గెట్ వారింగ్..
కాంగ్రెస్(Congress) పార్టీ పంజాబ్ అధ్యక్షుడు అమరీందర్ సింగ్ రాజా వారింగ్‌పై కౌర్ విరుచుకుపడ్డారు. "ఆయనలో నిజాయతీ లేదు. అయనొక అవినీతిపరుడు. బాధ్యత లేని వ్యక్తి. నేను వారింగ్‌ను అధ్యక్షుడిగా అంగీకరించను. అనేక కేసుల్లో నిందితుడిగా ఉన్న ఆయన తనకు తాను రక్షించుకునేందుకు పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్‌ను చెంతన చేరాడు’’ అని ధ్వజమెత్తారు.
సోమవారం పార్టీ తనపై చర్య తీసుకునే ముందు.. తర్న్ తరణ్ నియోజకవర్గ ఉప ఎన్నికకు కాంగ్రెస్ తరపున పోటీ చేస్తోన్న కరణ్‌బీర్ సింగ్ బుర్జ్ పార్టీ టికెట్ కోసం ఇద్దరు పంజాబ్ కాంగ్రెస్ నాయకులకు రూ. 10 కోట్లు ఇచ్చారని కౌర్ ఆరోపించారు. అయితే ఈ ఆరోపణలను బుర్జ్ ఖండించారు. తన వద్ద ఆధారాలు ఉంటే చూపాలని కౌర్‌కు కౌంటర్ ఇచ్చారు. తాను టికెట్ కోసం ఎవరికీ డబ్బు చెల్లించలేదని, తనను ఎవరూ డబ్బులు అడగలేదని కరణ్‌బీర్ స్పష్టం చేశారు.
అలాగయితేనే..
తన భర్త నవజ్యోత్ సింగ్ సిద్ధును కాంగ్రెస్ పార్టీ పంజాబ్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటిస్తే ఆయన తిరిగి క్రియాశీల రాజకీయాల్లోకి వస్తారని కౌర్ చెప్పారు. ఏ పార్టీకి ఇవ్వడానికి మా వద్ద డబ్బు లేదని, అయితే పంజాబ్‌ను "స్వర్ణ రాష్ట్రంగా" మార్చగలమని ఆమె అన్నారు. ఎవరైనా మీ నుంచి డబ్బు డిమాండ్ చేశారా? అని ఓ విలేఖరి అడిగిన ప్రశ్నకు.. "రూ. 500 కోట్ల సూట్‌కేస్ ఇచ్చిన వ్యక్తి ముఖ్యమంత్రి అవుతాడు" అని మాత్రమే ఆమె బదులిచ్చారు. అయితే ఆమె వ్యాఖ్యలపై రాజకీయ దుమారం రేగిన తర్వాత, కౌర్ తన వ్యాఖ్యలను వక్రీకరించారని చెప్పారు.
కౌర్ వ్యాఖ్యలపై ఎవరేమన్నారు?
కౌర్ మాటలపై కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ వైద్ స్పందించారు. ఆమె వ్యాఖ్యలు ప్రజలను తప్పుదారి పట్టేంచేలా ఉన్నాయన్నారు. గత కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రి పదవి దక్కినపుడు సిద్ధూ పార్టీకి డబ్బు చెల్లించారా? అని ఎదురు ప్రశ్నించారు.
నిజం మాట్లాడి, పార్టీలోని అవినీతిని బహిర్గతం చేసినందుకే కౌర్‌ను శిక్షించారని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా పేర్కొన్నారు.
"కౌర్ అలాంటి ప్రకటన చేయడం దురదృష్టకరం. నవజ్యోత్ సిద్ధూ బీజేపీ నుంచి కాంగ్రెస్‌లో వచ్చారు. ఆయనకు మంత్రి పదవి లభించింది" అని పంజాబ్ మాజీ ఉప ముఖ్యమంత్రి, కాంగ్రెస్ ఎంపీ సుఖ్జిందర్ రాంధావా అన్నారు.
ఎవరీ నవజ్యోత్ కౌర్ సిద్ధూ..
నవజ్యోత్ కౌర్ సిద్ధూ పంజాబ్ శాసనసభ మాజీ సభ్యురాలు. వృత్తిరీత్యా వైద్యురాలయిన కౌర్ 2012లో అమృత్‌సర్ తూర్పు నియోజకవర్గం నుంచి బీజేపీ తరుపున పోటీచేసి గెలిచారు. 2016 నవంబర్‌లో సిద్ధూ దంపతులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. రాజకీయాల్లోకి రావడానికి ముందు పాటియాలాలోని ప్రభుత్వ రాజింద్ర ఆసుపత్రిలో పనిచేశారు. ఆమె మాజీ క్రికెటర్, కాంగ్రెస్ నాయకుడు నవజ్యోత్ సింగ్ సిద్ధును వివాహం చేసుకున్నారు.

