రైతు నేత దల్లేవాల్ ఆసుపత్రికి తరలింపు, కేసు జనవరి 2కి వాయిదా
35 రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న రైతు నేత దల్లేవాల్‌ను ఆసుపత్రికి తరలించే అంశంపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు కేసును జనవరి 2కు వాయిదా వేసింది.
పంజాబ్‌లో రైతు సమస్యల పరిష్కారం కోసం నవంబర్ 26వ తేదీ నుంచి రైతు నేత జగ్జీత్ సింగ్ దలేవాల్ ఆమరణ నిరాహారదీక్ష చేస్తున్న విషయం తెలిసిందే. దాదాపుగా 35 రోజుల నుంచి దీక్ష చేస్తుండడంతో ఆయన ఆరోగ్యం విషమంగా మారింది.
దాంతో దలేవాల్‌ను వెంటనే ఆస్పత్రిలో చేరేందుకు ఒప్పించి, ఆస్పత్రికి తరలించాలని ఈ నెల 20న పంజాబ్ చీఫ్ సెక్రెటరీ, డీజీపీలను సుప్రీంకోర్టు ఆదేశించింది. డిసెంబర్ 28న దల్లేవాల్‌ను ఆసుపత్రికి తరలించడంలో పంజాబ్ ప్రభుత్వం విఫలమవడంతో సుప్రీం కోర్టు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది. ఇటు దలేవాల్‌ను ఆసుపత్రికి తీసుకెళ్లకుండా ఇతర రైతు నాయకులు అడ్డుకుంటున్నారు. తమ డిమాండ్ల పరిష్కారంపై హామీ ఇచ్చిన తర్వాతనే దలేవాల్‌ను ఆస్పత్రికి తరలించేందుకు అంగీకరిస్తామని పట్టుబడుతున్నారు.
ఇదే విషయాన్ని పంజాబ్ ప్రభుత్వం తరఫు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. దాంతో ఆ రైతు నేతలపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. దలేవాల్ క్షేమం కోరేవారు ఆవిధంగా ప్రవర్తించరని వ్యాఖ్యానించింది. రైతు నేతలతో మాట్లాడి దలేవాల్‌ను వెంటనే ఆస్పత్రికి తరలించాలని ఆదేశించింది.
కేసు విచారణ జనవరి 2కు వాయిదా..
జస్టిస్ సూర్యకాంత్, సుధాంషు ధూలియాలతో కూడిన వెకేషన్ బెంచ్ ఈ కేసు విచారణ జనవరి 2కు వాయిదా వేసింది. ఈ రోజు పంజాబ్ ప్రభుత్వం తరపున అడ్వొకేట్ జనరల్ గుర్మిందర్ సింగ్ కోర్టుకు హాజరయ్యారు. రైతులతో చర్చలు జరుగుతున్నాయని, దల్లేవాల్‌ను ఖనౌరి సరిహద్దులోని పంజాబ్ వైపు సమీప తాత్కాలిక ఆసుపత్రికి తరలించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని కోర్టుకు చెప్పారు.