పంజాబ్‌లో కేంద్ర బృందాల పర్యటన
వరదల్లో 43 మంది మృతి, ప్రభావితమైన 1,900 గ్రామాలు..
పంజాబ్(Punjab)లో వరదలు బీభత్సాన్ని సృష్టించిన విషయం తెలిసిందే. వందల గ్రామాల్లోకి చేరిన వరద తీవ్రనష్టాన్ని కలిగించింది. 43 మంది ప్రాణాలు కోల్పోయారు. 1,900లకు పైగా గ్రామాలు వరద ప్రభావానికి లోనయ్యాయి. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాల నుండి పంజాబ్ ప్రజలు ఇప్పుడిప్పుడే ఉపశమనం పొందుతున్నారు. రాష్ట్రంలోని ఎగువ కొండ ప్రాంతాలలో వర్షపాతం తగ్గుముఖం పట్టిందని పంజాబ్ మంత్రి(Minister) హర్దీప్ సింగ్ ముండియన్ (Hardeep Singh Mundian) తెలిపారు. జిల్లాల నుంచి వచ్చిన నష్ట నివేదికలను చదివి విలేఖరులకు వివరించారు. ఇప్పటివరకు 21,929 మందిని వరద ముంపు ప్రాంతాల నుంచి తరలించామని, రాష్ట్రవ్యాప్తంగా 196 సహాయ శిబిరాలను ఏర్పాటు చేశామని, వాటిలో 7,108 మంది బాధితులు ఆశ్రయం పొందారని చెప్పారు. వీరిలో 2,548 మందిని ఫజిల్కాలోని శిబిరాలకు తరలించగా, ఆ తర్వాత హోషియార్‌పూర్ (1,041), ఫిరోజ్‌పూర్ (776) మరియు పఠాన్‌కోట్ (693) శిబిరాలకు తరలించారు.
18 జిల్లాల్లో 1.72 లక్షల హెక్టార్ల వ్యవసాయ భూములు దెబ్బతిన్నాయని, 22 జిల్లాల్లోని 1,948 గ్రామాలు వరదల బారిన పడ్డాయని, 3,84,322 జనాభాపై ప్రభావం చూపిందని ముండియన్ వివరించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయ, రక్షణ చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు.
మాట్లాడుతున్న మంత్రి హర్దీప్ సింగ్ ముండియన్
రాష్ట్రంలో కేంద్ర బృందాల(Central teams) పర్యటన..
నష్టాన్ని అంచనా వేయడానికి కేంద్ర బృందాలు రాష్ట్రంలో పర్యటించాయి. కపుర్తల జిల్లా సుల్తాన్‌పూర్ లోధి ప్రాంతాన్ని ఒక బృందం సందర్శించింది. బృందం సభ్యులు పడవలో వెళ్లి బౌపూర్, సంగ్రాలోని బాధిత కుటుంబాలతో
మాట్లాడారు. బౌపూర్‌లోని ప్రభుత్వ పాఠశాలను కూడా పరిశీలించారు. కేంద్ర బృందాలు కేంద్ర ప్రభుత్వానికి నివేదికను సమర్పిస్తాయి. కపుర్తలా డిప్యూటీ కమిషనర్ అమిత్ కుమార్ పంచల్ జిల్లాలో జరిగిన వరద నష్టం గురించి కేంద్ర బృందానికి వివరించారు.
అనంతరం కేంద్ర బృందం కపుర్తలాలోని విశ్రాంతి గృహంలో అధికారులతో సమావేశమైంది. రెవెన్యూ, విద్యుత్ బోర్డు, పశుసంవర్ధక, విద్య, వ్యవసాయ, తదితర శాఖల నుంచి ప్రతినిధులు హాజరై నష్టం గురించి కేంద్ర బృందాలకు వివరించారు.
మరో కేంద్ర బృందం ఫిరోజ్‌పూర్ జిల్లాలోని వివిధ వరద ప్రభావిత ప్రాంతాలలో పర్యటించింది. క్షేత్రస్థాయిలో పరిస్థితిని తెలుసుకునేందుకు ఈ బృందం జిల్లా యంత్రాంగం, స్థానికులతో సంభాషించింది. పంట నష్టం, మౌలిక సదుపాయాలకు నష్టం, చేపడుతున్న సహాయక చర్యలను అంచనా వేయడానికి వివిధ గ్రామాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.
వృద్ధులపై ప్రత్యేక శ్రద్ధ..
వరదల సమయంలో వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడ్డారని.. వారి భద్రత, సంక్షేమానికి ప్రత్యేక చర్యలు చేపట్టిందని ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. వరద ప్రభావిత ప్రాంతాల్లో 479 మంది వృద్ధులు ఉన్నట్లు గుర్తించారు.
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వృద్ధాశ్రమాలు దాదాపు 700 మంది వృద్ధులకు సరిపోతాయని సామాజిక భద్రత, మహిళా మరియు శిశు అభివృద్ధి మంత్రి బల్జిత్ కౌర్ తెలిపారు. అవసరమైన వారు వాటిల్లో ఆశ్రయం పొందవచ్చని చెప్పారు.