NEET‌పై లోక్‌సభలో చర్చకు రాహుల్ డిమాండ్
x

NEET‌పై లోక్‌సభలో చర్చకు రాహుల్ డిమాండ్

‘NEET పేపర్‌ లీక్ వ్యవహారంపై చర్చ జరపాలని అటు లోక్‌సభ ఇటు రాజ్యసభలోనూ విపక్షాలు డిమాండ్‌ చేశాయి. దాంతో ఉభయ సభల్లోనూ కాసేపు గందరగోళం నెలకొంది.


లోక్‌సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ NEET అంశంపై చర్చించాలని డిమాండ్ చేశారు. అయితే రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని కేంద్రం ప్రవేశపెట్టింది. దీనిపై స్పీకర్‌ చర్చను ప్రారంభించగా.. ప్రతిపక్షాలు నీట్‌ అంశాన్నిలేవనెత్తాయి. దీంతో సభాపతి ఓం బిర్లా సభను మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు.

“NEET ప్రశ్నప్రతం లీకేజీని మేం తీవ్రంగా పరిగణిస్తున్నాం.విద్యార్థుల సమస్యలపై ప్రభుత్వం, ప్రతిపక్షం కలిపి పనిచేస్తోందనే సందేశాన్ని పార్లమెంట్‌ ఇవ్వాలి” అని రాహుల్ స్పీకర్‌కు చెప్పారు.

అటు రాజ్యసభలోనూ ఇదే పరిస్థితి కన్పించింది. నీట్‌ అంశంపై చర్చకు విపక్ష సభ్యులు పట్టుబట్టారు. నినాదాలు, ఆందోళనల నడుమ కొంత సేపు ఛైర్మన్‌ సభను నడిపించి స్పీకర్ జగ్‌దీప్‌ ధన్‌ఖడ్‌ సభను మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు.

సభ తిరిగి ప్రారంభమయినా అదే గందరగోళ పరిస్థితి కొనసాగడంతో స్పీకర్ సోమవారానికి వాయిదా వేశారు.

అంతకుముందు రోజు (గురువారం) ఉభయ సభల్లో ఈ అంశంపై చర్చించాలని ప్రతిపక్ష ఎంపీలు నోటీసులు ఇచ్చారు. కాంగ్రెస్ ఎంపీలు సయ్యద్ నసీర్ హుస్సేన్, రంజీత్ రంజన్ రాజ్యసభలో రూల్ 267 కింద నోటీసు ఇవ్వగా, లోక్‌సభలో మాణికం ఠాగూర్ నీట్ అంశంపై నోటీసు ఇచ్చారు.

నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్‌ను మే 5న NTA నిర్వహించిన విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా దాదాపు 24 లక్షల మంది అభ్యర్థులు ఈ పరీక్ష రాశారు. జూన్ 4న ఫలితాలు వెలువడ్డాయి. అయితే ప్రశ్నపత్రం పరీక్షకు ముందే బీహార్ రాష్ట్రంలో లీక్ అయినట్లు వార్తలొచ్చాయి. దీనిపై విచారణ జరపాలని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. ప్రస్తుతం కేసు విచారణలో ఉంది. ఇప్పటికే ఈ కేసులో పలువురికి అరెస్టు చేశారు పోలీసులు.

Read More
Next Story