‘ఢిల్లీ వాయు కాలుష్యంపై పార్లమెంటులో చర్చించాలి’
x

‘ఢిల్లీ వాయు కాలుష్యంపై పార్లమెంటులో చర్చించాలి’

అత్యవసర పరిస్థితిగా అభివర్ణించిన లోక్‌సభా ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ..


Click the Play button to hear this message in audio format

ఢిల్లీ(Delhi)-ఎన్‌సీఆర్‌లో గాలి నాణ్యత బాగా పడిపోయింది. పిల్లలు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో కొంతమంది పిల్లల తల్లులు లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ(Rahul Gandhi)ని తన నివాసంలో కలిశారు. ఎయిర్ పొల్యూషన్‌(Air Pollution)తో పడుతున్న ఇబ్బందులను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఈ సమస్య పరిష్కారానికి కార్యాచరణ ప్రణాళిక ఏమైనా ఉందా? ప్రజల ఆరోగ్యం పట్ల ప్రభుత్వానికి శ్రద్ధ ఉందా? అని రాహుల్ గాంధీ ప్రధాని మోదీని ప్రశ్నించారు.

"నేను కలిసిన ప్రతి తల్లి నాకు ఒకటే చెబుతున్నారు. తన బిడ్డ కలుషిత గాలి పీలుస్తూ పెరుగుతోందని. మోదీ జీ మన దేశ పిల్లలు మన ముందు జబ్బుల బారినపడుతున్నారు. మీరు మౌనంగా ఎలా ఉండగలుగుతున్నారు? మీ దగ్గర సమస్య పరిష్కారానికి ప్రణాళిక లేదా? మీకు జవాబుదారీతనం లేదు?" అని ఎక్స్‌లో రాహుల్ పోస్టు చేశారు.

పార్లమెంటులో చర్చకు డిమాండ్

పిల్లలు, వృద్ధులు తరుచుగా అనారోగ్యం బారిన పడుతుండడంతో.. రోజురోజుకు ఢిల్లీలో పెరిగిపోతోన్న వాయు కాలుష్యంపై పార్లమెంటు శీతాకాల సమావేశాలకు ముందు చర్చ జరపాలని రాహుల్ డిమాండ్ చేశారు.


తల్లుల ఆందోళన..

రాహుల్‌తో మాట్లాడిన తల్లులు తమ పిల్లల ఆరోగ్యం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. భారతదేశంలో వాయు కాలుష్యం కారణంగా రోజూ దాదాపు 500 మంది ఐదేళ్ల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలు మరణిస్తున్నారని ఒక మహిళ రాహుల్‌తో అన్నారు. ఈ దీర్ఘకాలిక సమస్యపై ప్రభుత్వం మౌనంగా ఉండడం ఎంతవరకు సమంజసం అని మరో మహిళ ప్రశ్నించింది.

గత 15 రోజులుగా ఢిల్లీలో గాలి నాణ్యత బాగా పడిపోయిన విషయం తెలిసిందే. రాబోయే వారంలో గాలి నాణ్యత మరింతగా పడిపోయే అవకాశం ఉంది. గాలి కాలుష్యం ఊపిరితిత్తుల పనితీరుపై ప్రభావం చూపుతుందని, ఎప్పటికప్పుడు ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.

Read More
Next Story