ఆ వీడియో క్లిప్ నా గుండెను పిండేసింది: రాహుల్ గాంధీ
x

ఆ వీడియో క్లిప్ నా గుండెను పిండేసింది: రాహుల్ గాంధీ

మధ్యప్రదేశ్‌ రాష్ట్రం షియోపూర్ జిల్లాలోని ఓ పాఠశాల విద్యార్థులకు మధ్యాహ్న భోజనం వడ్డింపుపై లోక్‌సభ ప్రతిపక్ష నేత తీవ్ర ఆగ్రహం..


Click the Play button to hear this message in audio format

మధ్యప్రదేశ్‌(Madhya Pradesh) రాష్ట్రం షియోపూర్ జిల్లా విజయ్‌పూర్ బ్లాక్‌ హుల్పూర్ గ్రామంలోని ఓ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు మధ్యాహ్న భోజనాన్ని(Mid-day meal) న్యూ్స్ పేపర్లో వడ్డించారు. NDTV ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ అనురాగ్ ద్వారి నవంబర్ 6వ తేదీన 1.39 నిముషాల నిడివి గల ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. అది కాస్తా వైరలయ్యింది. ఈ ఘటనపై లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) స్పందించారు. నా గుండెను పిండేసిన ఈ వీడియోను చూసిన తర్వాత అయినా పాలకులు సిగ్గుపడాలని ఎక్స్ వేదికగా బీజేపీని విమర్శించారు. దేశ భవిష్యత్తు ఇంతటి దయనీయ స్థితిలో ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.


ప్రిన్సిపాల్ సస్పెన్షన్..

ఎడిటర్ అనురాగ్ ద్వారి పోస్టు చేసిన వీడియోపై చాలామంది కామెంట్లు చెప్పారు. ఇంత దయనీయమా? అంటూ కొంతమంది మండిపాటు వ్యక్తం చేశారు. చివరకు వీడియో ఉన్నతాధికారుల దృష్టిలో పడడంతో పాఠశాల ప్రిన్సిపాల్‌ను సస్పెండ్ చేశారు. మధ్యాహ్న భోజనం వడ్డించే స్వయం సహాయక బృందం కాంట్రాక్టును రద్దు చేశారు. ఈ ఘటనపై కలెక్టర్ అర్పిత్ వర్మ దర్యాప్తునకు ఆదేశించినట్లు సమాచారం.

‘మధ్యప్రదేశ్‌కు వస్తున్నా..’

ఈ చిన్నపాటి వీడియో ‘ప్రధాన మంత్రి(Prime minister) పోషణ్ శక్తి నిర్మాణ్’ (పిఎం పోషణ్) పథకం అమలుపై బహిరంగ చర్చకు దారితీసింది. వీడియో చూసిన తర్వాత తన గుండె పగిలిపోయినంత పనయ్యిందన్న రాహుల్.. "నేను ఈరోజు మధ్యప్రదేశ్ వెళ్తున్నా. అక్కడి పిల్లలకు మధ్యాహ్న భోజనం వడ్డించిన తీరు నా గుండెను పిండేసింది. దేశ భవిష్యత్తుకు దక్కిన గౌరవం ఇదా?" అని ఎక్స్‌లో పేర్కొన్నారు. 20 ఏళ్లకు పైగా రాష్ట్రాన్ని పాలించిన బీజేపీ ప్రభుత్వం చివరకు "పిల్లల ప్లేట్లను కూడా దొంగిలించింది. బీజేపీ(BJP)పాలనలో 'అభివృద్ధి' అనేది కేవలం భ్రమ. అధికారంలోకి రావడానికి అసలు రహస్యం ‘‘వ్యవస్థ " అని మండిపడ్డారు.

పీఎం పోషణ్ పథకం లక్ష్యాలు పిల్లలకు పోషకాహారం అందించడం, విద్యకు దూరం కాకుండా చూడడం. వెనుకబడిన వర్గాలు తమ పిల్లలను క్రమం తప్పకుండా పాఠశాలకు పంపడాన్ని ప్రోత్సహించేందుకు, అలాగే బడికి వచ్చిన పిల్లలకు పోషకాహారాన్ని అందించడం కోసం ఈ పథకాన్ని తీసుకొచ్చారు.

Read More
Next Story