హత్రాస్ తొక్కిసలాటలో మృతుల కుటుంబాలను పరామర్శించిన రాహుల్
యూపీలోని హత్రాస్‌లో జరిగిన తొక్కిసలాటలో మృతుల కుటుంబాలను పరామర్శించిన తర్వాత విలేఖరులతో లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఏమన్నారు?
ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్‌లో జరిగిన తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబ సభ్యులను లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ శుక్రవారం పరామర్శించారు. తెల్లవారుజామున ఢిల్లీ నుంచి ఆయన రోడ్డు మార్గంలో హత్రాస్‌కు బయలుదేరారు. అలీఘర్‌లోని పిలాఖ్నా గ్రామంలో మృతుల కుటుంబాలను ఓదార్చారు.
జూలై 2న జరిగిన తొక్కిసలాటలో 121 మంది చనిపోగా.. ఇందులో 17 మంది అలీఘర్‌కు చెందిన వారు కాగా, 19 మంది హత్రాస్‌కు చెందిన వారున్నారు.
‘ఘటనకు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలి’
ఘటనకు సీఎం యోగినే బాధ్యత వహించాలని కాంగ్రెస్ పార్టీ స్టేట్ చీఫ్ అజయ్ రాయ్ అన్నారు. మృతుల ఒక్కో కుటుంబానికి రూ. కోటి, గాయపడిన వారికి రూ. 25 లక్షలు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఘటనపై రిటైర్డ్ జడ్జితో కాకుండా హైకోర్టు సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరిపించాలని కోరారు.
కాగా ఘటనపై సీఎం యోగి ఆదిత్యనాథ్ ఇప్పటికే న్యాయ విచారణకు ఆదేశించిన విషయం తెలిసిందే రిటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తి నేతృత్వంలో ముగ్గురు సభ్యుల కమిషన్‌ను ఏర్పాటు చేశారు. తొక్కిసలాట వెనుక కుట్ర దాగి ఉందన్నకోణంలో ఈ కమిషన్ విచారిస్తుందన్నారు.
రాహుల్ గాంధీ వెంట పార్టీ ఇన్‌ఛార్జ్ అవినాష్ పాండే, అధికార ప్రతినిధి సుప్రియా శ్రీనాటే, ఇతర కార్యాలయ బేరర్లు ఉన్నారు.
‘పాలనలో లోపాలున్నాయి’
తొక్కిసలాట ఘటనపై రాహుల్ స్పందించారు. బాధిత కుటుంబాలకు కలిశాక ఆయన విలేఖరులతో మాట్లాడుతూ.. ‘ చాలా మంది ప్రాణాలు కోల్పోవడం బాధాకారం. ఈ ఘటనను నేను రాజకీయం కోణంలో చూడదలుచుకోలేదు. పాలనలో లోపాలు ఉన్నాయి’ అని మాత్రమే చెప్పారు.
ఘటన ఎలా జరిగింది. .
జూలై 2న హత్రాస్‌లో స్వయం ప్రకటిత దైవం బాబా భోలే సత్సంగంలో జరిగిన తొక్కిసలాట జరిగింది. ఆయన పాదధూళి కోసం జనం ఎగబడడంతో ఒక్కసారిగా తొక్కిసలాట జరిగింది. ఒకరిపై ఒకరు పడిపోయి ఊపిరాడక 121 మంది చనిపోయారు. మృతుల్లో మహిళలే ఎక్కువగా ఉన్నారు.