
అయోధ్యలో రాజ్‌నాథ్ సింగ్..
రామాలయ ప్రాంగణంలో యుపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌తో కలిసి ప్రార్థనల్లో పాల్గొన్న కేంద్ర రక్షణ శాఖ మంత్రి..
కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్(Rajnath) బుధవారం (డిసెంబర్ 31) అయోధ్య రామాలయాన్ని సందర్శించారు. ఆలయం కాంప్లెక్స్‌లోని ఏడు ఆలయాలలో ఒకటైన అన్నపూర్ణ దేవి గుడిలో నిర్వహించిన ప్రత్యేక పూజలో ఆయన పాల్గొన్నారు. అంతకుముందు హనుమాన్‌గరి ఆలయంలో ప్రార్థనలు చేశారు. అనంతరం ఆలయ రెండో వార్షికోత్సవం నేపథ్యంలో
జెండాను ఎగురవేశారు. ఆయన వెంట ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కూడా ఉన్నారు.
రామాలయం నిర్మాణం అధికారికంగా పూర్తయిన గుర్తుగా నవంబర్ 25న ప్రధాని మోదీ కాషాయ జెండాను ఎగురవేసిన విషయం తెలిసిందే. ప్రధాని నేతృత్వంలో జనవరి 22, 2024న ఆలయంలో రామ్‌లల్లా విగ్రహాన్ని ప్రతిష్టించారు.
సుమారు 6 లక్షల మంది భక్తులు..
రెండో వార్షికోత్సవం సందర్భంగా రామ్‌లల్లా విగ్రహాన్ని దర్శించుకునేందుకు సుమారు 5 నుంచి 6 లక్షల మంది భక్తులు అయోధ్యకు వస్తారని శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ (Ram janmabhoomi temple) అంచనా. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని VIP పాస్ జారీని గురువారం వరకు నిలిపివేశారు. ప్రవేశం ప్రధాన ద్వారం ద్వారానే రామ్‌లల్లాను దర్శించుకునేందుకు వీలు కల్పించారు. అయోధ్యలోకి వాహనాల ప్రవేశాన్ని పరిమితం చేశారు. నగర శివార్లలో 36 పార్కింగ్ జోన్‌లను ఏర్పాటు చేశారు. సుమారు 3,000 మంది పోలీసు సిబ్బందిని మోహరించనున్నారు.

