రతన్ టాటా రిస్క్ టేకర్ ఎందుకయ్యారు?
‘‘టాటా నిజంగా అసాధారణ నాయకుడు. ఆయన సహకారం, సేవలు టాటా గ్రూప్స్‌కు మాత్రమే పరిమితం కాలేదు. యావత్ భారతావనికి ఆయన సేవలందించారు.’’ - టాటా గ్రూప్ ఛైర్మన్ చంద్రశేఖరన్
ప్రముఖ వ్యాపారవేత్త, టాటా గ్రూప్ ఛైర్మన్ రతన్ టాటా కన్నుమూశారు. ఆయన వయసు 86 సంవత్సరాలు. రెండు దశాబ్దాలకు పైగా టాటా గ్రూప్‌నకు చైర్మన్‌గా ఉన్న టాటా బుధవారం రాత్రి 11.30 గంటలకు దక్షిణ ముంబైలోని బ్రీచ్ క్యాండీ హాస్పిటల్‌లో తుది శ్వాస విడిచారు. ఆరోగ్యం విషమించడంతో సోమవారం(అక్టోబర్ 07న) ఆయనను హాస్పిటల్‌లోని ఇంటెన్సివ్ కేర్‌లో ఉంచారు. రతన్ టాటా మరణంతో దేశం శోకసంద్రంలో మునిగిపోయింది.
న్యూయార్క్‌లోని ఇతాకాలోని కార్నెల్ విశ్వవిద్యాలయంలో చదువుకున్న టాటా 1962లో భారతదేశానికి తిరిగి వచ్చిన తర్వాత తన కుటుంబం నిర్వహించే గ్రూపులో షాప్ ఫ్లోర్‌లో పనిచేశాడు. 1971లో నేషనల్ రేడియో అండ్ ఎలక్ట్రానిక్స్ కంపెనీకి డైరెక్టర్ కావడానికి ముందు అనేక టాటా గ్రూప్ సంస్థలలో అనుభవం సంపాదించాడు. ఒక దశాబ్దం తరువాత టాటా ఇండస్ట్రీస్‌కు చైర్మన్ అయ్యారు. అర్ధ శతాబ్దానికి పైగా బాధ్యతలు నిర్వర్తించిన తన మామ JRD నుంచి 1991లో టాటా గ్రూప్ ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించారు.
సామాన్యుడి కల సాకారం..
రతన్ టాటా నాయకత్వంలో.. టాటా గ్రూప్ ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది. గ్వార్, ల్యాండ్ రోవర్, కోరస్ స్టీల్ వంటి పెద్ద పెద్ద కంపెనీలను కొనుగోలు చేసింది. ఆయన టాటా కంపెనీని బహుళజాతి కంపెనీగా మార్చారు.
సామాన్యుడు కూడా సొంత కారులో షికారు చేయాలన్న కలను నేరవేర్చారు టాటా. 2009లో నానో కారును కేవలం రూ. లక్షకే మార్కెట్‌లో విడుదల చేశారు. నానో ఆవిష్కరణ రతన్ టాటా ప్రస్థానంలో మరో మైలురాయిగా చెప్పుకోవాలి. ఇటీవల చిప్ తయారీ రంగంలోకి కూడా టాటా గ్రూప్ ప్రవేశించింది. ఐఫోన్ అసెంబ్లీ ప్లాంట్‌ను ప్లాన్ చేస్తోంది.
అత్యున్నత పురస్కారాలు.. గౌరవ డాక్టరేట్లు..
బిజినెస్ టైకూన్‌గా పేరు తెచ్చుకున్న రతన్ టాటాను..2008లో దేశ రెండో అత్యున్నత పౌర పురస్కారం పద్మ విభూషణ్‌తో సత్కరించింది. అంతకు ముందు 2000లోనే రతన్ టాటాను పద్మ భూషణ్ వరించింది. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్, కేంబ్రిడ్జ్ యూనివర్శిటీ, ఒహైయో స్టేట్ యూనివర్శిటీ, ఐఐటీ బాంబే, ఐఐటీ మద్రాస్ ఐఐటి ఖరగ్‌పూర్‌తో సహా పలు ప్రతిష్టాత్మక సంస్థల నుంచి గౌరవ డాక్టరేట్‌లను కూడా రతన్ టాటా అందుకున్నారు.
‘విజయ.. ప్రతీకారం తీర్చుకోవడానికి ఉత్తమ మార్గం..’
రతన్ టాటా పారిశ్రామికవేత్తలకు స్ఫూర్తి ప్రదాత. వ్యాపారంలో నష్టాలు వచ్చినపుడు కుంగిపోకూడదని చెప్పడానికే ఆయనే ఒక ఉదాహరణ.
టాటా మోటార్స్ నుంచి వచ్చిన ‘టాటా ఇండికా’ కార్ల అమ్మకాలు మార్కెట్లో ఆశించనంతగా జరగలేదు. దీంతో రతన్ టాటా కంపెనీని అమ్మేయాలని నిర్ణయానికి వచ్చారు. 1999లో టాటా మోటార్స్‌ను కొనేందుకు చర్చలు జరుపుతున్న సమయంలో ఫోర్డ్ ఛైర్మన్ బిల్ ఫోర్డ్ తన బృందం ముందు రతన్ టాటాను అవమానించారట. “మీకు ఏమీ తెలియదు. మీరు ప్యాసింజర్ కార్ల తయారీని ఎందుకు ప్రారంభించారు? మీ కంపెనీని కొనుగోలు చేయడం ద్వారా మేము మీకు పెద్ద ఉపకారం చేస్తున్నాం.’’ అన్నారట బిల్ ఫోర్డ్. ఈ మాటలు రతన్ టాటాను తీవ్రంగా బాధించాయి. ఆ క్షణమే తమ కార్ల కంపెనీని ఫోర్డ్‌కు విక్రయించకూడదని నిర్ణయించుకుని, అదే రోజు రాత్రి తన బృందంతో కలిసి ముంబైకి తిరిగి వచ్చారు. తర్వాత టాటా మోటార్స్‌పై దృష్టి సారించడంతో ప్రపంచంలోనే అత్యుత్తమ కార్ల కంపెనీగా పేరుగడించారు. 2008 నాటికి మార్కెట్లో అత్యధికంగా అమ్ముడైన కార్లు టాటా మోటార్స్ నుంచి వచ్చినవే కావడం విశేషం.
అప్పటికి ఫోర్డ్ జోరు తగ్గింది. ఆ కంపెనీ కార్లు అమ్మకాలు పడిపోయాయి. రతన్ టాటాను అవమానించిన అదే బిల్ ఫోర్డ్ 2008లో తన బృందంతో ముంబైకి వచ్చారు. జాగ్వార్, ల్యాండ్ రోవర్ కార్లను కొనుగోలు చేయాలని కోరారు. “మీరు JLRని కొనుగోలు చేయడం ద్వారా మాకు పెద్ద ఉపకారం చేస్తున్నారు. ధన్యవాదాలు.” అని బిల్ ఫోర్డ్ టాటాతో అన్నారట. తనను అవమానించిన బిల్ ఫోర్డ్‌ను తిరిగి అవమానించే అవకాశం దొరికిన రతన్ టాటా అలా వ్యవహరించలేదు. రతన్ టాటా విశాల హృదయుడు, సహనశీలి అని చెప్పడానికి ఈ ఘటనే నిదర్శనం.