రతన్ టాటాకు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు..
ప్రజలు నివాళి అర్పించేందుకు రతన్ టాటా భౌతికకాయాన్ని దక్షిణ ముంబైలోని నేషనల్ సెంటర్ ఫర్ పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ (NCPA)లో ఉంచనున్నారు.
మహారాష్ట్రలోని ఏక్‌నాథ్ షిండే ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా అంత్యక్రియలు నిర్వహించనుంది. రతన్ టాటా (86) బుధవారం రాత్రి కన్నుమూశారు. ఇటీవల వృద్ధాప్య సంబంధిత వ్యాధులతో ఆయన ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చేరారు. సంతాప సూచకంగా ఈ రోజు (అక్టోబర్ 10న) మహారాష్ట్రలోని ప్రభుత్వ కార్యాలయాలపై జాతీయ జెండాను ఎగురవేయనున్నట్లు సీఎం షిండే తెలిపారు. గురువారం ఎలాంటి వినోద కార్యక్రమాలు ఉండవని ఆయన ప్రకటనలో పేర్కొన్నారు. నివాళులర్పించేందుకు గురువారం ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటల వరకు రతన్ టాటా భౌతికకాయాన్ని దక్షిణ ముంబైలోని నేషనల్ సెంటర్ ఫర్ పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ (NCPA)లో ఉంచుతారు. ముంబైలోని వర్లీ ప్రాంతంలో నిర్వహించే అంత్యక్రియలకు హోంమంత్రి అమిత్ షా హాజరుకానున్నారు.
విదేశాల్లో చదివి స్వదేశానికి తిరిగొచ్చిన టాటా..
న్యూయార్క్‌లోని ఇతాకాలోని కార్నెల్ విశ్వవిద్యాలయంలో చదువుకున్న టాటా 1962లో భారతదేశానికి తిరిగి వచ్చిన తర్వాత తన కుటుంబం నిర్వహించే గ్రూపులో షాప్ ఫ్లోర్‌లో పనిచేశాడు. 1971లో నేషనల్ రేడియో అండ్ ఎలక్ట్రానిక్స్ కంపెనీకి డైరెక్టర్ కావడానికి ముందు అనేక టాటా గ్రూప్ సంస్థలలో అనుభవం సంపాదించాడు. ఒక దశాబ్దం తరువాత టాటా ఇండస్ట్రీస్‌కు చైర్మన్ అయ్యారు. అర్ధ శతాబ్దానికి పైగా బాధ్యతలు నిర్వర్తించిన తన మామ JRD నుంచి 1991లో టాటా గ్రూప్ ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించారు.
సామాన్యుడి కల సాకారం..
రతన్ టాటా నాయకత్వంలో టాటా గ్రూప్ ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది. గ్వార్, ల్యాండ్ రోవర్, కోరస్ స్టీల్ వంటి పెద్ద కంపెనీలను కొనుగోలు చేసింది. బహుళజాతి కంపెనీగా తీర్చిదిద్దిన ఘనత టాటా సొంతం. సామాన్యుడు కూడా సొంత కారులో షికారు చేయాలన్న కలను సాకారం చేస్తూ.. 2009లో నానో కారును కేవలం రూ. లక్షకే మార్కెట్‌లోకి తెచ్చారు.