
బీజేపీ, ఆర్ఎస్ఎస్ మధ్య సయోధ్య: భగవత్‌తో మోదీ భేటీ
గతేడాది లోక్‌సభ ఎన్నికలలో పూర్తిస్థాయి మెజార్టీ సాధించలేకపోయి బీజేపీ..హరియాణా, మహారాష్ట్ర, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో సత్తాచాటడానికి కారణమేంటి?
గత ఏడాది లోక్‌సభ ఎన్నికల సందర్భంగా తలెత్తిన విబేధాలను పరిష్కరించుకున్న బీజేపీ(BJP), ఆర్ఎస్ఎస్(RSS).. మళ్లీ కలిసిపోయినట్లు కనిపిస్తున్నాయి. ప్రధాని మోదీ(PM Modi), ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ (RSS chief Mohan Bhagwat ) భగవత్ ఒకే వేదికను పంచుకోనున్నారు. మార్చి 30న నాగపూర్‌లో జరిగే ఈ సమావేశం బీజేపీ-ఆర్ఎస్ఎస్ మధ్య సంబంధాల బలోపేతానికి దోహదపడుతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం అధికారం చేపట్టి 11 సంవత్సరాలు గడిచినా.. మోదీ, భగవత్ కలిసి ఒకే వేదికను పంచుకోవడం మాత్రం ఇది రెండోసారి.
గతానికి గుణపాఠమా?
2024 లోక్‌సభ ఎన్నికల ప్రచార సమయంలో బీజేపీ తన వ్యవహారాలను తానే చక్కబెట్టుకోగలదని, ఆర్ఎస్ఎస్‌పై ఆధారపడాల్సిన అవసరం లేదని ప్రకటించింది. కానీ ఫలితాలు భిన్నంగా వచ్చాయి. పూర్తిస్థాయి మెజారిటీ రాలేదు. 10 ఏళ్ల తర్వాత మళ్లీ పొత్తులతో పాలన కొనసాగించాల్సి వచ్చింది. ఫలితాలు వెల్లడైన తర్వాత భగవత్ బహిరంగంగా బీజేపీపై విమర్శలు చేశారు. అయితే ఇప్పుడు ఇరు వర్గాలు విభేదాలు పక్కనబెట్టి మళ్లీ కలిసి పనిచేసేందుకు సిద్ధమవుతున్నారు.
ఆ రోజు ఒకే వేదికపై..
మార్చి 30న మహారాష్ట్ర ప్రజలు గుడి పాడ్వా పండుగగా జరుపుకుంటారు. అదే రోజు ఆర్ఎస్ఎస్ వ్యవస్థాపకుడు కేశవ్ బలీరామ్ హెడ్గేవార్ జయంతి కూడా. ఇదే రోజున మోదీ-భగవత్ నాగపూర్‌లో ఒకే వేదికను పంచుకోనున్నారు. ఈ ఇద్దరు నేతలు 6.5 ఎకరాలలో నిర్మించనున్న ఒక ఆసుపత్రి భవనానికి శంకుస్థాపన చేయనున్నారు. ఈ ఆసుపత్రికి ఆర్ఎస్ఎస్ రెండో అధిపతి అయిన మాధవ్ సదాశివరావు గోల్‌వాల్కర్ పేరు పెట్టనున్నారు.
ఇద్దరూ ప్రసంగిస్తారా?
లోక్‌సభ ఎన్నికలకు ముందు అయోధ్యలో రామ మందిర ప్రతిష్ఠా కార్యక్రమానికి మోదీ నేతృత్వం వహించారు. ఆ వేడుకకు భగవత్ కూడా హాజరయ్యారు. కానీ ప్రసంగించలేదు. అయితే నాగపూర్ కార్యక్రమంలో మాత్రం ఇద్దరు నేతలు ప్రసంగించే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు.
మళ్లీ బంధం బలపడుతుందా?
2024 ఎన్నికల సమయంలో ఆర్ఎస్ఎస్ మద్దతు లేకుండా బీజేపీ స్వతంత్రంగా వ్యవహరించే ప్రయత్నం చేసింది. అయితే హరియాణా, మహారాష్ట్ర, ఢిల్లీలో విజయాలు సాధించిన తర్వాత..ఆర్ఎస్ఎస్‌తో కలిసి పనిచేసే అవసరాన్ని బీజేపీ గుర్తించింది. ఇటీవల 98వ అఖిల భారతీయ మరాఠీ సాహిత్య సమ్మేళనంలో మోదీ.. ఆర్ఎస్ఎస్ తన జీవితాన్ని ప్రభావితం చేసిందని బహిరంగంగా చెప్పారు. ఈ వ్యాఖ్యలు బీజేపీ-ఆర్ఎస్ఎస్ మధ్య ధృడమైన బంధాన్ని సూచిస్తున్నాయి.
కొత్త అధ్యక్షుడి ఎంపికలో ఆర్ఎస్ఎస్ పాత్ర కీలకం..
బీజేపీకి కొత్త జాతీయ అధ్యక్షుడిని నియమించాల్సిన సమయం దగ్గరపడుతోంది. అయితే ఆర్ఎస్ఎస్ అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకోకుండా జాతీయ అధ్యక్షుడిని నియమంచడం అసాధ్యమని విశ్లేషకులు చెబుతున్నారు.
ఒకరికి ఒకరు అవసరమే..
రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం.. బీజేపీ-ఆర్ఎస్ఎస్ కలిసి పనిచేయాల్సిన అవసరం ఇద్దరికి ఉంది. బీజేపీ అధికారంలో ఉండటం వల్ల ఆర్ఎస్ఎస్ జాతీయ స్థాయిలో తన ప్రస్థానాన్ని విస్తరించుకోగలదు. అదే విధంగా ఎన్నికల సమయంలో ఆర్ఎస్ఎస్ కార్యకర్తల మద్దతు బీజేపీకి అవసరం.
"ఇది పరస్పర అనుబంధ సంబంధం. మోదీ, బీజేపీ నాయకత్వం – వ్యక్తిగత ప్రతిభ, ప్రభుత్వ పనితీరు మాత్రమే మెజారిటీ సాధించేందుకు సరిపోదు,’’ అని మహారాజా సయాజీరావు యూనివర్సిటీ ప్రొఫెసర్ అమిత్ దోలకియా వ్యాఖ్యానించారు. ఆర్ఎస్ఎస్ సహకారం ఉండడం వల్లే హరియాణా, మహారాష్ట్ర, ఢిల్లీలో బీజేపీ విజయం సాధించగలిగిందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. భవిష్యత్తులో బీజేపీ పూర్తి స్థాయిలో ఆర్ఎస్ఎస్ సహకారాన్ని కోరే అవకాశం కూడా ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.