మంచి  పనులకు మతం అడ్డుకారాదు: ఫారూఖ్‌ షిబ్లీ
x

మంచి పనులకు మతం అడ్డుకారాదు: ఫారూఖ్‌ షిబ్లీ

సత్కార్యాలకు మతం అడ్డురాదని నిరూపించారు. మతాలు వేరైనా మనమంతా మనుషులమేనని


సత్కార్యాలకు మతం అడ్డురాదని నిరూపించారు. మతాలు వేరైనా మనమంతా మనుషులమేనని రుజువు చేశారు. ముస్లింలే అయినా అయ్యప్పస్వాములకు భిక్ష కార్యక్రమం ఏర్పాటు చేసి ఆదర్శంగా నిలిచారు.




అన్నమయ్య జిల్లా రాయచోటి మణికంఠ గిరి అయ్యప్ప స్వామి ఆలయం వద్ద 400 మంది అయ్యప్ప స్వాములకు మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి అధ్వర్యంలో భిక్ష కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పరిరక్షణ సమితి వ్యవస్థాపకులు ఫారుక్‌ షిబ్లీతో పాటు రాయచోటి నియోజకవర్గం టీడీపీ నేత మండిపల్లి రాంప్రసాద్‌ రెడ్డి హాజరయ్యారు. వీరికి ఆలయ నిర్వాహ కులు ఘన స్వాగతం పలికారు. అనంతరం స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో గురుస్వాములు బసిరెడ్డి సురేష్‌ జయశంకర స్వాములను శాలువతో సన్మానించారు. వారు కూడా అతిథులను ఘనంగా సన్మానించారు. అనంతరం భిక్ష కార్యక్రమం ప్రారంభమైంది.



ఈ సందర్భంగా ఫారుక్‌ షిబ్లీ, రాంప్రసాద్‌ రెడ్డి మాట్లాడుతూ.. కఠిన నియమాలతో కూడిన అయ్యప్ప దీక్ష తీసుకోవడం అభినందనీయమన్నారు. అందరూ కుల మతాలకతీతంగా సోదరుల్లా మెలగాలన్నారు. ఒకరి సాంప్రదాయాలను ఒకరు గౌరవించుకుంటూ పండుగలను ఘనంగా నిర్వహించుకోవాలన్నారు. దాతల సహకారంతో అయ్యప్ప స్వామి ఆలయాన్ని నిర్మించి, మాలాధారణ స్వాములకు వసతితో పాటు భిక్ష ఏర్పాటు చేస్తున్న ఆలయ నిర్వాహకులకు పరిరక్షణ సమితి తరపున అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి సభ్యులు అన్వర్‌, సగీర్‌, ఇమ్రాన్‌, మస్తాన్‌, ఆసిఫ్‌, షాహుల్‌, మహమ్మద్‌ అలీ, అమీర్‌ జాన్‌ పాల్గొన్నారు.




Read More
Next Story