
‘ఢిల్లీ ప్రజలు మార్పు కోరుకున్నారు’
‘ప్రస్తుత ఆప్ పాలనతో విసిగెత్తిన ఢిల్లీ ప్రజలు మార్పు కోరుకున్నారు. గెలిచిన వారందరికీ అభినందనలు’ - ప్రియాంక గాంధీ
ఢిల్లీ(Delhi) పీఠం ఎట్టకేలకు కాషాయ పార్టీ(BJP) వశమైంది. 26 ఏళ్ల తర్వాత హస్తినలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది. వరుసగా మూడు సార్లు ఆమ్ ఆద్మీ పార్టీకి అధికారాన్ని కట్టబెట్టిన ఓటర్లు ఈ సారి మాత్రం బీజేపీకి అవకాశం ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ ఎక్కడా గెలిచిన దాఖలాలు లేవు. దీనిపై కాంగ్రెస్ (Congress) ప్రధాన కార్యదర్శి, వయనాడ్ ఎంపీ ప్రియాంక (Priyanka) గాంధీ స్పందించారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితులతో జనం విసిగి పోయారని "మార్పు కోసం ఓటు వేశారని" ఆమె వ్యాఖ్యానిస్తూ.. గెలిచిన వారందరికీ అభినందనలు తెలిపారు. ప్రస్తుతం ప్రియాంక మూడు రోజుల పర్యటనలో భాగంగా కేరళలో ఉన్నారు.
భారత ఎన్నికల సంఘం (ECI) తాజా సమాచారం ప్రకారం.. ఢిల్లీలోని 70 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ 45 చోట్ల ముందంజలో ఉంది. అప్ (AAP) 21 స్థానాల్లో ముందుంది.
ఇప్పటికే బీజేపీ, ఆప్ రెండేసి స్థానాల్లో విజయం సాధించాయని ఎన్నికల సంఘం వెబ్‌సైట్ వెల్లడించింది. ఇక కాంగ్రెస్ మాత్రం వరుసగా మూడోసారి అసెంబ్లీ ఎన్నికల్లో ఖాతా తెరవలేని పరిస్థితి.