భూమి దళితులదే.. కాని 40 ఏళ్లకు పట్టాలిచ్చారు.. కారణమేంటి ?
x

భూమి దళితులదే.. కాని 40 ఏళ్లకు పట్టాలిచ్చారు.. కారణమేంటి ?

తమకు కేటాయించిన భూములను అగ్రవర్ణాల చేతిలో నుంచి తిరిగి పొందడానికి దళితులకు 40 ఏళ్లు పట్టింది. ఎమ్మెల్యే చొరవతో చివరకు వారికి పట్టాలు కూడా పంపిణీ చేశారు.


నాలుగు దశాబ్దాల పాటు అగ్రవర్ణాల చేతిలో ఉన్న భూములు తమకు దక్కడంతో దళిత కుటుంబాలు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి. ఎట్టకేలకు ప్రజాప్రతినిధి చొరవతో స్వాతంత్య్ర దినోత్సవం రోజున వారికి పట్టాలు కూడా పంపిణీ చేశారు.

దళితులకు భూముల కేటాయింపు..

1960 నుంచి 1990 మధ్య కాలంలో గుజరాత్ రాష్ట్రంలోని భూమిలేని దళితులకు మొత్తం 56,873 ఎకరాలను కేటాయించారు. అందులో భాగంగా కచ్ జిల్లా రాపర్ తాలూకాలోని బేలా, నందా గ్రామాల్లోని 30 దళిత కుటుంబాలకు 200 ఎకరాలు కేటాయించారు. అయితే ఈ భూమిని దర్బార్ (క్షత్రియ), రాబరీ (పాస్టర్ల సంఘం) వర్గానికి చెందిన అగ్రవర్ణాల వారు ఆక్రమించారు.

ఎమ్మెల్యే చొరవతో..

ఈ ఏడాది స్వాతంత్య్ర దినోత్సవం రోజున దళిత ఎమ్మెల్యే జిగ్నేష్ మేవానీ కృషితో అగ్రవర్ణాల ఆధీనంలో భూములను స్వాధీనం చేసుకుని, రాపర్ రెవెన్యూ సర్కిల్ ఇన్‌స్పెక్టర్, జిల్లా పరిపాలన అధికారులతో కలిసి దళితులకు పట్టాలు పంపిణీ చేయించారు.

దాడులకు భయపడి..

గతంలో తమ భూముని స్వాధీనం చేసుకోడానికి దళిత కుటుంబాలు గట్టిగానే పోరాడాయి. దాదాపు 30 ఏళ్ల క్రితం రాపర్ తాలూకాలోని దళితుల సహకార సంస్థ అనుసుచిత్ జాతి సముదాయిక్ ఖేతి సహకారి మండలి లిమిటెడ్ ఆధ్వర్యంలో భూములను స్వాధీనం చేసుకోడానికి యత్నించారు. అయితే అగ్రవర్ణాల నుంచి హింసాత్మక ప్రతిఘటనను ఎదుర్కొన్నారు. ఆ భూమి తమది కాదని రెవెన్యూ అధికారులు చెప్పినా.. అగ్రవర్ణ కుటుంబాలు ఆ భూమిని అప్పజెప్పేందుకు నిరాకరించాయి. హింస, సామాజిక బహిష్కరణలకు భయపడి వారు మిన్నకుండిపోయారు. ధైర్యం కూడగట్టుకుని అగ్రవర్ణాల వారిపై ఎదురు తిరగడంతో 2021లో రాష్ట్రీయ రాజ్‌పుత్ కర్ణి సేన గుజరాత్ యూనిట్ చీఫ్ రాజ్ షెకావత్‌ను పోలీసులు అరెస్టు చేశారు. తమను కత్తులతో బెదిరించాడని అగ్రవర్ణాలవారు ఆయనపై కేసు పెట్టారు. జనవరి 2022లో 63 ఏళ్ల మంగ్రాభాయ్ ఆర్ పాధియార్‌ తనకు 1965లో కేటాయించిన 5.5 ఎకరాల భూమిలో రూ. 70వేలు పంటలు సాగు చేశాడు. కానీ వాటిని నాశనం చేశారు. దీని వెనుక అగ్రవర్ణాల వారు, కిరాయి దుండగులు ఉన్నారని ఆయన అప్పట్లో ఆరోపించారు. మంగ్రాభాయ్ ఫిర్యాదుపై రాపర్‌లోని పోలీసులు కేసు నమోదు చేయలేదు. అయితే గత రెండేళ్లలో ఒక్క రాపర్‌లోనే దాదాపు 30 ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయి.

ప్రస్తుతం ఎమ్మెల్యే చొరవతో భూములు పొందడంపై దళిత కుటుంబాలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

‘ఎమ్మెల్యేకు రుణపడి ఉంటాం’

“సంవత్సరాలుగా మేం రోజువారీ కూలీలుగా జీవిస్తున్నాం. మరుగుదొడ్లు శుభ్రం చేయడం, జంతువుల కళేబరాలను పారవేయడం వంటి పనులను మా కుటుంబాల్లోని స్త్రీ పురుషులు చేయాల్సి వచ్చేది. మా పిల్లలకు బడికి వెళ్లే అవకాశం రాలేదు. మాకు చట్టబద్ధంగా భూమి ఉన్నా.. అది అగ్రవర్ణ గ్రామస్థుల ఆధీనంలో ఉండేది. వారు మా భూమిలో పంటలు పండించడాన్ని మేం చూశాం. మా భూములు నాకు దక్కుతాయన్న నమక్మం పోయింది. ఇప్పుడు మాకు పట్టాలిచ్చారు. నేను మా ఎమ్మెల్యే సర్ (మేవానీ)కి కృతజ్ఞతలు చెప్పాలనుకుంటున్నా” అని బేల గ్రామానికి చెందిన తేజాభాయ్ సోలంకి అన్నారు.

Read More
Next Story