‘అల్లర్లు రాజకీయ ప్రేరేపితం’
బద్లాపూర్ ఘటనతో ఆగ్రహించిన తల్లిదండ్రులు ఏడు గంటలుగా రైల్ రోకో చేపట్టారు. దీంతో బద్లాపూర్ నుంచి అంబర్‌నాథ్ మధ్య రైళ్ల రాకపోకలను 10 గంటలకు పైగా నిలిపివేశారు.
బద్లాపూర్‌లో నిరసన ప్రదర్శన రాజకీయ ప్రేరేపితమని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే సమర్థించుకున్నారు. నిరసనకారులలో ఎక్కువ మంది బయటి వ్యక్తులేనని ఆయన పేర్కొన్నారు.
స్తంభించిన రైళ్ల రాకపోకలు..
టాయిలెట్ గదిలో స్కూల్ స్వీపర్ ఇద్దరు నాలుగేళ్ల చిన్నారులపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. మహారాష్ట్ర థానే జిల్లాలోని బద్లాపూర్‌లో జరిగిన ఈ ఘటనతో ఆగ్రహించిన తల్లిదండ్రులు, స్థానికులు ఏడు గంటలుగా రైల్ రోకో చేపట్టారు. దీంతో బద్లాపూర్ నుంచి అంబర్‌నాథ్ మధ్య రైళ్ల రాకపోకలను 10 గంటలకు పైగా నిలిపివేశారు. మంగళవారం బద్లాపూర్‌లో నిరసన ర్యాలీ చేపట్టారు. అయితే ఈ నిరసన రాజకీయ ప్రేరేపితమని, ప్రతిపక్షాల కుట్ర అని షిండే అంటున్నారు.
72 మంది అరెస్టు..
నిరసన సందర్భంగా బద్లాపూర్ రైల్వే స్టేషన్, పట్టణంలో రాళ్లదాడి ఘటనల్లో రైల్వే పోలీసులతో సహా కనీసం 25 మంది పోలీసులు గాయపడ్డారు. హింసాకాండకు సంబంధించి పోలీసులు నాలుగు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసి 72 మందిని అరెస్టు చేశారు.
డిమాండ్లను అంగీకరించిన మంత్రి..
రాష్ట్ర మంత్రి గిరీష్ మహాజన్ నిరసనకారుల అన్ని డిమాండ్లకు అంగీకరించారు. అయితే నిరసనకారులు శాంతించకపోవడాన్ని ఆయన తప్పుబడుతున్నారు. ‘ముఖ్యమంత్రి మాఝీ లడ్కీ బహిన్ యోజన' కింద అర్హులైన మహిళలకు ప్రతినెల రూ. 1,500 అందుతుంది. ఈ పథకాన్ని ప్రతిపక్షాలు జీర్ణించుకోలేకపోతున్నాయి. ప్రభుత్వాన్ని అప్రతిష్ఠ పాలు చేసేందుకు జనాన్ని రెచ్చగొడుతున్నారు.’ అని పేర్కొన్నారు.
విధుల నుంచి సస్పెన్షన్..
ఈ ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేసిన పాఠశాల యాజమాన్యం.. మరోసారి ఇలాంటి పరిస్థితి పునరావృతం కాకుండా అన్ని చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చింది. ప్రిన్సిపాల్‌తో పాటు, క్లాస్ టీచర్, మహిళా అటెండర్‌ను సస్పెండ్ చేసింది. స్వీపర్ ను విధుల నుంచి తొలగించారు.
‘సిట్’కు ఆదేశం..
ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం సిట్ విచారణకు ఆదేశించింది. మహిళా ఐపీఎస్ అధికారిణి ఆర్తిసింగ్ నేతృత్వంలో విచారణ జరుగుతుందని ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ తెలిపారు.