RSS ‘ఎలుకలు’ కాదు ‘హిందూ సింహాలు’
x

RSS ‘ఎలుకలు’ కాదు ‘హిందూ సింహాలు’

జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్‌ సోరెన్‌ భారతీయ జనతా పార్టీ అనుబంధ సంస్థ ఆర్‌ఎస్‌ఎస్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.


జార్ఖండ్ రాష్ట్రం సాహిబ్‌గంజ్‌లోని భోగ్నాడిహ్‌లో నిర్వహించిన ర్యాలీలో జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్‌ సోరెన్‌ భారతీయ జనతా పార్టీ అనుబంధ సంస్థ ఆర్‌ఎస్‌ఎస్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆర్‌ఎస్‌ఎస్‌ (రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్‌)ను ఎలుకలతో పోల్చడాన్ని బీజేపీ తప్పబట్టింది. ఓట్ల కోసం రాష్ట్రంలో మత సామరస్యాన్ని దెబ్బతీసేందుకు BJP, RSS కుట్రలు చేస్తున్నాయని సోరెన్ ఆరోపించడంపై కాషాయ పార్టీ కౌంటర్ ఇచ్చింది. ఆర్‌ఎస్‌ఎస్‌ ‘ఎలుకలు’ కాదని ‘హిందూ సింహాలు’ అని పేర్కొంది. రాజకీయ ప్రయోజనాల కోసం బంగ్లాదేశ్ చొరబాటుదారులను హేమంత్‌ సోరెన్‌ ప్రోత్సహిస్తున్నారని బీజేపీ ఆరోపించింది.

"హేమంత్ సోరెన్ ఆర్‌ఎస్‌ఎస్‌ను ఎలుకలతో పోల్చారు. సనాతన ధర్మ వైభవాన్ని పునరుద్ధరించడానికి కృషి చేస్తున్న 'హిందూ సింహాలకు' అవమానకరం. సోరోస్ మాదిరిగానే సోరెన్ పనిచేస్తున్నాడు. రాజకీయ ప్రయోజనాల కోసం అతను (సోరెన్) బంగ్లాదేశ్ చొరబాటుదారులను ప్రోత్సహిస్తున్నాడు.” అని జార్ఖండ్ అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు అమర్ కుమార్ బౌరీ పేర్కొన్నారు.

హంగేరియన్‌లో జన్మించిన US బిలియనీర్ సోరోస్.. భారత ప్రజాస్వామ్య వ్యవస్థను లక్ష్యంగా చేసుకున్నారని, ఆయన ఎంపిక చేసిన వ్యక్తులే ప్రభుత్వాన్ని నడపాలని చూస్తున్నారని బీజేపీ ఆరోపిస్తోంది. జార్ఖండ్‌లో జనాభా పరమైన మార్పులు జరగలేదని సోరెన్ చేసిన వ్యాఖ్యలను హేళన చేస్తూ.. సీఎం తన గురించి, ఆయన కుటుంబం, వారి సంక్షేమం గురించి మాత్రమే ఆందోళన చెందుతున్నారని బౌరీ పేర్కొన్నారు.

హిందూ ముస్లిం వర్గాల మధ్య బిజెపి విబేధాలు సృష్టిస్తోందని, జార్ఖండ్‌లో బీజేపీ ఎన్నికల కో-ఇంఛార్జిగా ఉన్న అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ జార్ఖండ్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.

‘‘ఆర్‌ఎస్‌ఎస్ నాయకులు ఎలుకల్లాగా వచ్చి రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం కలహాలు, ఉద్రిక్తతలు సృష్టించాలని చూస్తున్నారు. వారు మీ గ్రామాల్లోకి వస్తే వాటిని తరిమికొట్టండి." అని సోరెన్ అన్నారు. తన సొంత రాష్ట్రంలో గిరిజనులపై జరుగుతున్న అఘాయిత్యాలకు అస్సాం సిఎం హస్తం ఉందని ఆరోపించారు.


Read More
Next Story