స్వదేశానికి రష్యన్ మహిళ ?
x

స్వదేశానికి రష్యన్ మహిళ ?

పిల్లలను కూడా ఆమె వెంట పంపేందుకు సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్న పోలీసులు..


Click the Play button to hear this message in audio format

కర్ణాటక(Karnataka) రాష్ట్రం గోకర్ణలోని ఓ గుహలో తలదాచుకున్న రష్యన్ (Russia) జాతీయురాలు నీనా కుటినా (40), ఆమె ఇద్దరు కూతుర్లు ప్రేమ (6), అమా (4)ను వారి దేశానికి పంపించేయాలని పోలీసులు నిర్ణయించుకున్నారు. అందులో భాగంగా శనివారం ఆమెను బెంగళూరులోని ఫారినర్స్ రీజినల్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ (FRRO)కి తీసుకెళ్లారు. ఆమె పాస్‌పోర్ట్, వీసాను పరిశీలించిన అధికారులు.. చెన్నైలోని రష్యన్ కాన్సులేట్‌తో సంప్రదించి అధికారికంగా రష్యాను పంపాలని చూస్తున్నారు.

పిల్లలను తండ్రి, ఇజ్రాయెల్ జాతీయుడు అయిన డ్రోర్ గోల్డ్‌స్టెయిన్ వద్దకు పంపడానికి నీనా నిరాకరించింది. భారతదేశ చట్టం ప్రకారం నీనా రష్యా జాతీయురాలు కావడంతో ఆమెను మాత్రమే రష్యాకు పంపే వీలుంటుంది. ఆమె వెంట పిల్లలను కూడా పంపేందుకు చట్టపర నిబంధనలను పరిశీలిస్తున్నారు.

ప్రస్తుతం నీనా తుమకూరులోని దిబ్బూర్ సమీపంలోని విదేశీయుల నిర్బంధ కేంద్రం (FDC)లో ఉంది. రష్యన్ రాయబార కార్యాలయం నుంచి సమాచారం వచ్చిన తర్వాత నీనా, ఆమె ఇద్దరి కూతుర్లను స్వదేశానికి తిరిగి పంపిచేస్తామని ఉత్తర కన్నడ అదనపు పోలీసు సూపరింటెండెంట్ జి. కృష్ణమూర్తి చెప్పారు.

నీనాను ఎక్కడ గుర్తించారు?

గతేడాది కురిసిన వర్షాలకు గోకర్ణలోని రామతీర్థ కొండ కొంత భాగం కూలిపోయింది. అప్రమత్తమయిన పోలీసులు.. ఈ సంవత్సరం కూడా భారీ వర్షాలు కురిస్తే ఏఏ ప్రదేశాల్లో కొండచెరియలు విరిగిపడతాయో పరిశీలించేందుకు గోకర్ణ పోలీసులు వెళ్లారు. వారికి నీనా కనిపించారు. గోవా నుంచి గోకర్ణకు చేరుకున్న నీనా.. దాదాపు వారం రోజులుగా గుహలోనే ఉన్నట్లు సమాచారం. గుహ పరిసరాల్లో ప్రమాదకరంగా ఉండడంతో గుహను వెంటనే ఖాళీ చేయమని ఆమెకు చెప్పారు.

అడవిలో ఒంటరి జీవితం..

నీనా వ్యాపార వీసాపై దేశంలోకి ప్రవేశించి గోవా మీదుగా గోకర్ణకు చేరుకుంది. ఆమె జూలై 11న రామతీర్థ కొండపై ఉన్న గుహలో తన ఇద్దరు కూతుర్లతో కలిసి నివసిస్తుంది. అయితే స్థానికులు మాత్రం ఆ గుహ డేంజర్ జోన్‌లో ఉందని చెబుతున్నారు. వర్షాకాలంలో కొండచరియలు విరిగిపడతాయని, విషపూరిత కీటకాలు, పాములు సంచరిస్తూ ఉంటాయని పేర్కొన్నారు. ప్రమాదం పొంచి ఉన్నా.. నీనా గుహను ఎంచుకోడానికి కారణం కూడా ఉన్నట్లు తెలుస్తోంది. హోటళ్లలో బస చేయాలంటే ID ప్రూఫ్ చూపాలి. అది రష్యాది కావడంతో గది ఇచ్చే అవకాశం తక్కువ.

మీడియాలో వస్తున్న నీనా గురించి వస్తున్న కథనాలను చూసి జూలై 17న గోల్డ్‌స్టెయిన్ తుమకూరులోని నిర్బంధ కేంద్రానికి వచ్చాడు. అయితే అక్కడి సిబ్బంది అతన్ని నీనా, పిల్లలను కలవడానికి అనుమతించలేదు. కిటికీలోంచి పిల్లలను చూయించి, వెళ్ళిపోవాలని కోరారు. "పిల్లలు తల్లితో ఉండాలి. కానీ వారు సురక్షిత వాతావరణంలో పెరగాలి. ఆరేళ్ల వయసు వరకు కూడా స్కూల్‌కు వెళ్లలేదు. వాళ్లను రష్యాకు తిరిగి పంపితే.. నేను వారిని మళ్లీ ఎప్పటికీ కలవలేకపోవచ్చు," అని చెప్పి గోల్డ్‌స్టెయిన్ వెళ్లిపోయారు.

Read More
Next Story