బీహార్‌లో ఓటరు జాబితా సవరణ ఎందుకు?
x

బీహార్‌లో ఓటరు జాబితా సవరణ ఎందుకు?

ఎలక్షన్ కమిషన్‌ను ప్రశ్నించిన సుప్రీంకోర్టు..


Click the Play button to hear this message in audio format

బీహార్‌(Bihar)లో ఈ ఏడాది చివర్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఎలక్షన్ కమిషన్ ఓ ప్రకటన విడుదల చేసింది. ఎన్నికలకు ముందు ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (S.I.R) చేయాల్సి ఉందని పేర్కొంది. ఈసీ నిర్ణయంపై భగ్గుమన్న విపక్షాలు.. కమిషన్ నిర్ణయానికి వ్యతిరేకంగా బుధవారం (జూలై 9) ప్రధాన విపక్ష పార్టీలు కాంగ్రెస్, ఆర్జేడీ రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చాయి. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పాట్నా చేరుకుని నిరసన ప్రదర్శనలో పాల్గొన్నారు. ఆయన వెంట ఆర్జేడీ నాయకుడు తేజస్వి యాదవ్, సీపీఐ(ఎంఎల్) లిబరేషన్ ప్రధాన కార్యదర్శి దీపాంకర్ భట్టాచార్య, సీపీఐ ప్రధాన కార్యదర్శి డీ రాజా, ఇతర ప్రతిపక్ష పార్టీల సీనియర్ నాయకులు ఉన్నారు. 2024 మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ "రిగ్గింగ్"కు పాల్పడిందని, కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం దాన్ని బీహార్‌(Bihar)లో పునరావృతం చేయాలని చూస్తోందని లోక్‌సభా ప్రతిపక్ష నేత రాహుల్ ఆరోపించారు. మహాఘట్‌బంధన్ ఇచ్చిన బంద్ పిలుపుమేరకు ప్రతిపక్ష పార్టీల కార్యకర్తలు రైళ్లు, వాహనాల రాకపోకలను అడ్డుకున్నారు. పాట్నాలోని మహాత్మా గాంధీ సేతు మార్గంలో టైర్లను తగలబెట్టి నిరసన వ్యక్తం చేశారు.

పిటీషన్లను విచారించిన సుప్రీం కోర్టు..

ఈసీ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ అత్యున్నత న్యాయస్థానం(Supreme Court)లో దాఖలయిన పిటీషన్లపై న్యాయమూర్తులు సుధాంషు ధులియా, జోయ్‌మల్య బాగ్చిలతో కూడిన ధర్మాసనం విచారించింది. ‘‘ఎన్నికలకు ముందు ఓటరు జాబితా సవరణ ఎందుకు చేయాలనుకుంటున్నారు?’’ అని ఈసీని ప్రశ్నించింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 326 ప్రకారం..ఎన్నికలకు ముందు ఓటరు పౌరసత్వాన్ని పరిశీలించాల్సిన అవసరం ఉందని ఈసీ కోర్టుకు తెలిపింది. ‘‘ఆ పని ముందుగా చేయాల్సింది. చాలా ఆలస్యం చేశారు’’ అని కోర్టు ఈసీని మందలించింది.

కోర్టును ఆశ్రయించిందెవరు?

ఈసీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ.. సుప్రీంకోర్టులో 10‌కి పైగా పిటీషన్లు దాఖలయ్యాయి. ఆర్జేడీ ఎంపీ మనోజ్ ఝా, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా, కాంగ్రెస్ కేసీ వేణుగోపాల్, ఎన్సీపీ (ఎస్పీ) నేత సుప్రియా సూలే, సీపీఐ నేత డీ రాజా, సమాజ్ వాదీ పార్టీ హరీందర్ సింగ్ మాలిక్, శివసేన (యూబీటీ) నేత అరవింద్ సావంత్, జేఎంఎం సర్ఫ్రాజ్ అహ్మద్, సీపీఐ (ఎంఎల్) నేత దీపాంకర్ భట్టాచార్య కోర్టును ఆశ్రయించిన వారిలో ఉన్నారు. వీరితో పాటు 'అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్' అనే ఎన్జీవో కూడా పిటీషన్ వేసింది.

Read More
Next Story