‘ఆ కేసులకు విడిగా ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టులు పెట్టండి’
x

‘ఆ కేసులకు విడిగా ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టులు పెట్టండి’

అత్యాచారం, పోక్సో కేసులను మాత్రమే పరిష్కరించే కోర్టుల ఏర్పాటుకు చర్యతీసుకోవాలని కేంద్ర మంత్రి అన్నపూర్ణా దేవి పశ్చిమ బెంగాల్ సీఎం మమతకు సూచించారు.


పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రధాని మోదీకి రాసిన లేఖపై కేంద్రం శుక్రవారం స్పందించింది. బెంగాల్ రాష్ట్రంలో అత్యాచారం, హత్య వంటి క్రూరమైన నేరాలకు కఠినమైన చట్టాలు, శిక్షలు విధించాలని కోరుతూ మమత లేఖ రాసారు. అయితే ఆమె లేఖను ఆలస్యాన్ని కప్పిపుచ్చే ప్రయత్నంగా కేంద్రం అభివర్ణించింది. బెంగాల్‌లో ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఉన్నా, సరిగా అమలు చేయలేదని కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి శాఖ మంత్రి అన్నపూర్ణా దేవి పేర్కొన్నారు.

భారీగా కేసులు పెండింగ్..

రాష్ట్రంలోని ఫాస్ట్ ట్రాక్ ప్రత్యేక కోర్టులు అత్యాచారం, పోక్సో కేసులతో పాటు పౌర వివాదాలకు సంబంధించిన పలు కేసులను పరిష్కరిస్తున్నాయని మంత్రి అన్నపూర్ణా పేర్కొన్నారు. జూన్ 30, 2024 నాటికి ఫాస్ట్ ట్రాక్ ప్రత్యేక కోర్టుల్లో 81,000 కేసులు పెండింగ్‌లో ఉన్నాయని చెప్పారు. 48,600 రేప్, పోక్సో కేసులు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. డిమాండ్‌కు అనుగుణంగా రాష్ట్రం మరో 11 ఫాస్ట్ ట్రాక్ ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చేయాల్సి ఉందని అన్నపూర్ణా దేవి గుర్తు చేశారు.

పోక్సో కోర్టులు రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా అత్యాచారం, పోక్సో కేసులు రెండింటినీ విచారిస్తాయని , అలా కాకుండా అత్యాచారం, పోక్సో కేసులను మాత్రమే పరిష్కరించే కోర్టుల ఏర్పాటుకు చర్యతీసుకోవాలని కోరారు. ఆగష్టు 9న కోల్ కతా ఆర్ జీ కర్ ఆసుపత్రిలో ట్రైనీ డాక్టర్ అత్యాచారం, హత్య కేసును సిబిఐ దర్యాప్తు చేస్తున్న విషయం తెలిసిందే. బాధితురాలి కుటుంబానికి న్యాయం చేయాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి.

మహిళలపై నేరాలను ఎదుర్కోవడంలో కేంద్ర ప్రభుత్వ నిబద్ధతను పునరుద్ఘాటిస్తూ, భారతీయ న్యాయ సంహిత (BNS) ఇప్పటికే కఠినమైన శిక్షలను నిర్దేశిస్తోందని, అత్యాచారానికి కనీసం 10 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష, జీవిత ఖైదు లేదా మరణశిక్ష కూడా విధించవచ్చని దేవి పేర్కొన్నారు.

Read More
Next Story