
బీహార్ ఓటర్లకు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్ ఎన్నికల హామీలు..
అధికారంలోకి వస్తే వరద రహిత మిథిలాంచల్ ప్రాజెక్టుకు రూ.26వేల కోట్లు మంజూరు చేస్తాం-కేంద్ర హోం శాఖ మంత్రి; రాష్ట్రాభివృద్ధి ఎన్డీఏతోనే సాధ్యం; రక్షణ శాఖ మంత్రి
బీజేపీ(BJP) ఇద్దరు అగ్రనేతలు - కేంద్ర హోంమంత్రి అమిత్ షా(Amit Shah), రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్(Rajnath Singh) మంగళవారం (నవంబర్ 4) బీహార్ రాష్ట్రంలో పర్యటించారు. దర్భంగాలో జరిగిన ఎన్నికల ర్యాలీలో షా ప్రసంగించారు. వరద రహిత మిథిలాంచల్ ప్రాజెక్టుకు రూ.26వేల కోట్లు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. వైశాలిలో జరిగిన ఎన్నికల ప్రచార సభలోనూ షా ప్రసంగించారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ మాత్రమే రాష్ట్రాన్ని అభివృద్ధి చేయగలదని చెప్పారు.
‘కమలానికే ఓటేయ్యండి..’
"లాలూ-రబ్రీ.. తమ 15 ఏళ్ల పాలనలో బీహార్‌ను నాశనం చేశారు. ఆ ఆటవిక పాలన తిరిగి రాకుండా ఉండాలంటే 'కమలం' గుర్తుకే ఓటెయ్యండి" అని అమిత్ షా దర్భంగాలో ఓటర్లను కోరారు.
వరద నియంత్రణకు హామీ..
ప్రధాని మోదీ నాయకత్వంలోని ఎన్డీఏతో మాత్రమే బీహార్ సర్వతోముఖాభివృద్ధి సాధ్యమన్న షా.. "బీహార్‌లో NDA అధికారంలోకి వస్తే.. మిథిలాంచల్‌కు సాగునీరు అందుతుంది. అలాగే వరదలను నివారణకు రూ. 26వేలు కోట్లు ఖర్చు చేస్తుంది" అని పేర్కొన్నారు.
వైద్య సౌకర్యం..
బీహార్‌లో తమ కూటమి అధికారంలోకి తెస్తే.. మిథిలా, కోసి, తిర్హట్ వాసులు చికిత్స కోసం పాట్నా లేదా ఢిల్లీకి వెళ్లాల్సిన అవసరం ఉండదన్నారు. ఎయిమ్స్ దర్భంగాలోనే నాణ్యమైన వైద్యం అందుతుందన్నారు. ఎయిమ్స్-దర్భంగా ప్రాజెక్ట్‌కు ఏడాది క్రితం ప్రధాని మోదీ శంకుస్థాపన చేసిన విషయం తెలిసిందే.
జీవికా దీదీస్‌కు రూ.10వేల భృతిని ఉపసంహరించుకోవాలని ఆర్జేడీ ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేయడాన్ని షా ఖండించారు. స్వయం సహాయక సంఘాలకు బదిలీ చేసిన నిధులను "లాలూ మూడు తరాలు లాక్కోలేరు" అని అన్నారు.
‘ఆ రెండు పార్టీలకు ఓటెయొద్దు’..
ప్రధాని, ఆయన తల్లి ‘‘చాతి మైయా"ను ఆర్జేడీ-కాంగ్రెస్ అవమానించిందని షా పునరుద్ఘాటిస్తూ.. రాబోయే ఎన్నికల్లో ఆ రెండు తుడిచిపెట్టుకుపోతాయన్నారు. ఇటీవల ఛత్ పూజలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. అయితే కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ మోదీ పాల్గొన్న ఆ కార్యక్రమాన్ని "డ్రామా"గా అభివర్ణించారు. హిందువుల విశ్వాసాన్ని అపహాస్యం చేసిన కాంగ్రెస్ పార్టీని ఓడించాలని షా పిలుపునిచ్చారు.
‘డబ్బు ఎక్కడి నుంచి తెస్తారో అలోచించండి’
వైశాలి జిల్లాలో జరిగిన ఎన్నికల ర్యాలీలో రాజ్‌నాథ్ సింగ్ ప్రసంగించారు. ఎన్డీఏ మిత్రపక్షమైన ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌పై ఎలాంటి అవినీతి కేసు లేదన్నారు. ఎన్డీఏ మాత్రమే రాష్ట్రాన్ని అభివృద్ధి చేయగలదని నొక్కి చెప్పారు. అధికారంలోకి వస్తే ప్రతి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని మహాఘటబంధన్ నాయకులు అబద్ధాలు చెబుతున్నారని, జీతాలకు డబ్బు ఎక్కడి నుంచి వస్తుందో మీరు అడగాలని ఓటర్లను కోరారు.
గతంలో భారత ఆర్థిక వ్యవస్థ 11వ స్థానంలో ఉండేది. కానీ మోదీ అధికారంలోకి వచ్చాక 5వ స్థానంలో ఉందని, త్వరలో మూడో స్థానానికి చేరుకుంటుందని రాజ్‌నాథ్ తెలిపారు.

