రతన్ అంబులెన్స్ ఎస్కార్ట్‌గా శంతను నాయుడు..
“మీ నిష్క్రమణతో మన స్నేహంలో శూన్యం మిగిలింది. ఆ లోటును అధిగమించడానికి ఈ జీవితాంతం ప్రయత్నిస్తాను. గుడ్‌బై మై డియర్ లైట్‌హౌస్’’ - శంతను నాయుడు
రతన్ టాటా పార్థివ దేహం ఇంటి నుంచి దక్షిణ ముంబైలోని నేషనల్ సెంటర్ ఫర్ పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ (NCPA)కు బయల్దేరింది. భౌతిక కాయాన్ని తీసుకెళ్తున్న అంబులెన్స్‌కు ముందు 30 ఏళ్ల యువకుడు మోటార్‌సైకిల్ నడుపుతూ కనిపించాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో ఇప్పుడు వైరలవుతుంది. ఆ అబ్బాయి పేరు శంతను నాయుడు. టాటా గ్రూప్స్‌లో యంగెస్ట్ మేనేజర్. చిన్న వయసులో టాటా ఇండస్ట్రీస్‌లో ఉద్యోగం సంపాదించాడు. శంతను సామాజిక బాధ్యతకు మెచ్చి రతన్ టాటానే పిలిచి ఉద్యోగం ఇవ్వడం విశేషం. రతన్ టాటాకు శంతను నాయుడు అత్యంత సన్నిహితుడని చెబుతుంటారు.
ఎవరీ శంతను నాయుడు..
శంతను నాయుడు 1993లో పూణేలో జన్మించారు. 2014లో సావిత్రిబాయి ఫూలే పూణే విశ్వవిద్యాలయం నుంచి బ్యాచిలర్ ఆఫ్ మెకానికల్ ఇంజనీరింగ్‌తో పట్టభద్రుడయ్యారు. ఆ తర్వాత కార్నెల్ జాన్సన్ గ్రాడ్యుయేట్ స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్ నుంచి బిజినెస్ అడ్మినిస్ట్రేషన్‌లో మాస్టర్స్ డిగ్రీ అభ్యసించారు.
రతన్ టాటాను ఎలా కలిశాడు?
శంతను నాయుడు రతన్ టాటా లాగే జంతు ప్రేమికుడు. కుక్కలను ఇష్టపడేవాడు. రాత్రిపూట కార్లు, లారీల నుంచి తప్పించుకోబోయి వాటి చక్రాల కింద పడి అవి చనిపోవడం చూసి చలించిపోయాడు. వాటి రక్షణకు ఏదైనా చేయాలని ఆలోచించాడు. తన స్నేహితులతో కలిసి రిఫ్లెక్టర్‌తో కూడిన డాగ్ కాలర్‌ను రూపొందించాడు. శంతను వినూత్న ఆలోచన వార్తాపత్రికల ద్వారా రతన్ టాటా దృష్టిని ఆకర్షించింది. కొద్ది రోజులకు శంతనుకు తన కంపెనీలో ఉద్యోగం ఆఫర్ చేశారు టాటా. 2014లో టాటా గ్రూప్‌తో కలిసి పనిచేయడం ప్రారంభించినప్పుడు శంతనుకు రతన్ టాటాతో పరిచయం ఏర్పడింది.
శంతను టాటా ట్రస్ట్‌ల కోసం 2017లో బిజినెస్ స్ట్రాటజీ ఇంటర్న్‌గా కూడా పనిచేశాడు. ఆ తర్వాత 2018లో జనరల్ మేనేజర్‌గా పదోన్నతి పొందాడు. 2021లో శంతను ‘‘గుడ్‌ఫెలోస్’’ ప్రాజెక్ట్‌ను ప్రారంభించి మరోసారి వార్తల్లో నిలిచారు. ఒంటరి వృద్ధులకు అండగా నిలిచారు. ఒకవైపు టాటా గ్రూపులో తన బాధ్యతను నిర్వర్తిస్తూనే మరోవైపు సామాజిక బాధ్యతను భుజాన వేసుకున్నారు.
‘‘The hole that this friendship has now left with me, I will spend the rest of my life trying to fill. Grief is the price to pay for love. Goodbye, my dear lighthouse ’’
“మీ నిష్క్రమణతో మన స్నేహంలో శూన్యం మిగిలింది. ఆ లోటును అధిగమించడానికి ఈ జీవితాంతం ప్రయత్నిస్తాను. ఈ ప్రేమ దూరమవడంతో కలుగుతోన్న దుఃఖం పూడ్చలేనిది. గుడ్‌బై మై డియర్ లైట్‌హౌస్’’ అంటూ తన ఆవేదన పంచుకున్నారు శంతను.
టాటా గ్రూప్స్ అధినేత రతన్ టాటా (86) బుధవారం రాత్రి కన్నుమూశారు. ఇటీవల వృద్ధాప్య సంబంధిత వ్యాధులతో ఆయన ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చేరారు.