ఇక ఆంధ్రాలో అన్నా చెల్లెళ్ల సవాల్!
x
YS Sharmila

ఇక ఆంధ్రాలో అన్నా చెల్లెళ్ల సవాల్!

ఇక అన్నా చెల్లెళ్ల మధ్య రాజకీయ యుద్ధం ఏ స్థాయిలో ఉంటుందో? బిడ్డల పోరులో తల్లి విజయమ్మ ఎటు మొగ్గు చూపుతారో? చంద్రబాబు ఏమి చేస్తారో..


2024.. కొత్త సంవత్సరం వస్తూనే బోలెడన్ని సంచలనాలు తెస్తోంది. కొత్త కలయికలు, సరికొత్త కూటములు, సంచలన నిర్ణయాలు వెంటవెంటనే వస్తున్నాయి. అన్న వైఎస్ జగన్ కు సవాల్ విసరనుంది చెల్లి షర్మిల. చర్చలంటే పెదవి విరిచే కల్వకుంట్ల తారక రామారావు ఏకంగా మున్సిపల్ వర్కర్స్ తో కలిసి సహపంక్తి భోజనం చేశారు. కక్ష సాధిస్తారని ఊహించిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సాధు జంతువులా ఎవరిపైనా కక్ష సాధింపులుండవని తేల్చేశారు. భర్త చాటు భార్యగా మసిలిన నారా భువనేశ్వరి రాజకీయ పర్యటనలు చేపట్టారు. మొదటి రెండ్రోజుల్లోనే ఇన్ని చూస్తే ముందొచ్చే 361 రోజుల్లో మరెన్ని చూడాల్సి వస్తుందో..


షర్మిల జనవరి 4న ఢిల్లీలో కాంగ్రెస్ లో చేరనున్నారు. ఈ ఒక్క నిర్ణయం ఎన్నో పరిణామాలకు దారితీయనుంది.. షర్మిల ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి వస్తుందా లేదా అనేది నిన్నటి వరకు ఉహాగానం. ఇప్పుడది పచ్చి నిజం. మరికొందరికైతే మింగుడు పడని నిజం.. కొందరికి కలిసొచ్చే నిర్ణయం. ఈ ఒక్క నిర్ణయం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను ఒక్క కుదుపు కుదుపుతాయనడంలో సందేహం లేదు. షర్మిల కాంగ్రెస్ పగ్గాలు చేపడితే రాజకీయ పరిణామాలు ఎలా ఉంటాయనేది ఊహించడానికే ఉత్కంఠ కలిగిస్తున్నాయి. ఇక అన్నా చెల్లెళ్ల మధ్య రాజకీయ యుద్ధం ఏ స్థాయిలో ఉంటుందో? బిడ్డల పోరులో తల్లి విజయమ్మ ఎటు మొగ్గు చూపుతారో? అక్కడా ఇక్కడ టికెట్ రాని వాళ్లు ఎంత మంది గోడ దూకడానికి సిద్ధంగా ఉన్నారో త్వరలో తేలిపోతుంది.

ఆ తల్లి ఎంతగా తల్లడిల్లుతుందో!

‘ఏపీ రాజకీయాల్లో షర్మిల ప్రభావం కచ్చితంగా ఉంటుంది. తెలంగాణలో పార్టీని నడిపిన అనుభవాన్ని ఏపీలో సక్సెస్ పుల్ గా ఉపయోగిస్తుంది. అదే స్థాయిలో అన్నా చెల్లెలి పోరులో తల్లి విజయమ్మ నలిగిపోవడం కూడా ఖాయమనే అనిపిస్తుంది’ అన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు ప్రొఫెసర్ నాగేశ్వర్. ఆమె రాకతో అద్భుతాలు జరక్కపోవొచ్చు. షర్మిల కాంగ్రెస్ జెండా పట్టుకుంటే వచ్చే ఎన్నికల్లో ఏపీలో పోటీ ఏ స్థాయిలో ఉంటుందనేది చర్చనీయాంశమే. వైసీపీ, టీడీపీ కూటమి పోటీలో కాంగ్రెస్ చీల్చే ఓట్లు ఎవరికి నష్టం కలిగిస్తాయి, ఎవరికి మేలు చేస్తాయనేది ప్రతి ఒక్కరిలో తలెత్తుతున్న ప్రశ్న. ’కావడానికి వాళ్లిద్దరూ ఒకే తల్లిబిడ్డలే అయినా రాజకీయాల్లో ప్రత్యర్థులు. ఆమె ఏపీ రాజకీయాల్లోకి వస్తే వైసీపీ ఎందుకు భయపడాలి, ఆమె విధానం ఆమెది, జగన్ వైఖరి జగన్ ది’ అన్నారు వైసీపీ అధికార ప్రతినిధి రవిచంద్రారెడ్డి. ఈ మాటలో ఎంత నిజముందో తేలాలంటే ముందు షర్మిల తన రాజకీయ కార్యాచరణను ప్రకటించాల్సి ఉంది. ఏపీలో తన అన్న వైఎస్ జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏమేరకు మాట్లాడతారో తేలాల్సి ఉంది. దానికంటే ముందు ఆమెకు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఏ పదవి ఇస్తుందన్నది ఉత్కంఠ రేపుతున్న విషయం.

షర్మిలకున్న అవకాశాలు ఏమిటీ?

వైఎస్‌ షర్మిల కాంగ్రెస్‌ పార్టీలో చేరిక కేవలం లాంఛనమే. ఆమెకు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర పార్టీ పగ్గాలు అప్పగించాలని కాంగ్రెస్‌ పెద్దలు ప్రత్యేకించి రాహుల్ గాంధీ భావిస్తున్నారు. విదేశాల నుంచి హడావిడిగా వచ్చిన షర్మిల భర్త అనిల్‌కుమార్‌తో ఇప్పటికే ఢిల్లీలో కాంగ్రెస్‌ పెద్దలు చర్చించారు. ఫైనల్‌గా జనవరి 4న షర్మిలతో చర్చించి ఏఐసీసీసీ అధికారికంగా ప్రకటిస్తుంది. షర్మిలకు ఏపీ పార్టీ బాధ్యతలు అప్పగించాలన్నది పార్టీ పెద్దల నిర్ణయం. ఏపీ కాంగ్రెస్‌ కమిటీ పగ్గాలు చేపట్టడానికి షర్మిల ఇప్పడే అంగీకరించని పక్షంలో తొలుత పార్టీ స్టార్‌ క్యాంపెయినర్‌గా ఉంటారు.

వజ్రాన్ని వజ్రంతోనే కోయాలనే కాంగ్రెస్ వ్యూహం..

ఏఐసీసీ అధినేత్రి సోనియాను ధిక్కరించి సొంత పార్టీ పెట్టి అధికారాన్ని చేపట్టారు వైఎస్ జగన్. రాష్ట్ర విభజన తర్వాత జరిగిన పరిణామాల్లో కాంగ్రెస్ పెద్దలందరూ జగన్ పార్టీలోనే చేరారు. కాంగ్రెస్ కు ఒకప్పుడు అండగా నిలిచిన బడుగు, బలహీన వర్గాలు జగన్ వైపు మొగ్గాయి. కాంగ్రెస్ అడ్రసు గల్లంతయిన తరుణంలో షర్మిల ఇప్పుడొక వజ్రాయుధంగా దొరికారు. వజ్రాన్ని వజ్రంతోనే కోయాలన్న కాంగ్రెస్ సిద్ధాంతానికి అనుగుణంగా ఆమె తన అన్న జగన్ ను ఎంతవరకు నిలువరిస్తుందో, హస్తం గుర్తుకు పూర్వ వైభవం ఎంతవరకు తెస్తుందో చూడాలి. ‘పార్టీని బలోపేతం చేయడానికి కాంగ్రెస్‌ సీనియర్లను కూడా ఘర్‌వాపసీ నినాదంతో తిరిగి పార్టీలోకి తీసుకరాబోతున్నాం’ అంటున్న ప్రస్తుత ఏపీసీసీ అధ్యక్షుడు రుద్రరాజు మాట విలువెంతో కాలమే తేలుస్తుంది.

వైఎస్ వారసురాలిగా ఏపీలోకి ఎంట్రీ...

షర్మిలను తిరిగి కాంగ్రెస్‌లోకి తీసుకొనిరావడం, ఆమె పార్టీ వైఎస్‌ఆర్‌టీపీని కాంగ్రెస్‌లో విలీనానికి ఒప్పించడం వెనుక కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు, ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ మంత్రాంగం ఉంది. దివంగత ఏపీ మాజీ సీఎం వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి కుటుంబానికి డీకే సన్నిహితుడు. ఆ చొరవతోనే కాంగ్రెస్‌ పెద్దలను ఒప్పించి, ఏపీలో షర్మిలకు పార్టీ పగ్గాలు అప్పగించడానికి ఆయన రంగం సిద్ధం చేశారు. వైఎస్సార్‌కు ఉన్న పేరును ఉపయోగించుకొని ఆయన రాజకీయ వారసురాలిగా షర్మిల ద్వారా అక్కడ కాంగ్రెస్‌ను బలోపేతం చేసుకుందామన్న డీకే శివకుమార్‌ వ్యూహానికి పార్టీ పెద్దలు అంగీకరించారు. షర్మిల సోదరుడు, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ జాతీయ రాజకీయాల్లో బీజేపీతో సఖ్యతగా ఉంటున్నారు. ఏపీలో వైసీపీ, టీడీపీ మధ్యనే పోటీ ఉన్నది. కాంగ్రెస్‌, బీజేపీ రెండు జాతీయ పార్టీలకు అక్కడ చోటు లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో ఏపీలో షర్మిల ద్వారా వైసీపీని బలహీనపరిచి కాంగ్రెస్‌ను బలోపేతం చేయడం మరో వ్యూహం. కాగా సీఎం జగన్‌కు రాజకీయ ప్రత్యర్థి అయిన చంద్రబాబుతో కూడా కాంగ్రెస్‌ లోపాయికారి సంబంధాలు పెట్టుకునే ప్రయత్నం చేస్తున్నదా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. షర్మిలను ఇప్పటికిప్పుడు ఏపీ రాజకీయాల్లోకి తీసుకొనిరావడం వల్ల అక్కడ ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలడం వల్ల సీఎం జగన్‌కే మేలు చేస్తుందన్నది ఒక వాదన కాగా, వైసీపీకి పడే ఓట్లను చీల్చే అవకాశం ఉందనేది మరో వాదన.

కడప నుంచి బరిలోకి దింపుతారా!

సార్వత్రిక ఎన్నికలతోపాటు ఏపీ అసెంబ్లీకి కూడా ఎన్నికలు జరుగనున్నాయి. ప్రస్తుతం అక్కడ కాంగ్రెస్‌ పార్టీ అధికారం చేజిక్కించుకోగలిగే స్థితిలో లేదు. కనీసం 2029 ఎన్నికలే టార్గెట్‌గా షర్మిలను ఇప్పటి నుంచే రంగంలోకి దింపాలన్నది కాంగ్రెస్ యోచన. “కాంగ్రెస్ పార్టీ ఇప్పటికిప్పుడు సంచనాలేమీ సృష్టించలేదు. అయితే మా టార్గెట్ 2029 ఎన్నికలు. అప్పటికి మేమే ప్రత్యామ్నాయం” అన్నారు మాజీ మంత్రి, ఐఎఎస్ అధికారి జేడీ శీలం.షర్మిలను 2029 ఎన్నికల్లో సీఎం అభ్యర్థిగా ఇప్పటి నుంచే ప్రొజెక్టు చేయాలని కాంగ్రెస్‌ పెద్దల వ్యూహం. నిజానికిది కాంగ్రెస్ పార్టీ తీరుకు విరుద్ధమే అయినా ఏపీలో మరో గత్యంతరం లేదు గనుక షర్మిలకే పార్టీ పగ్గాలు అప్పగిస్తారు. లోక్‌సభ ఎన్నికల్లో కడప నుంచి షర్మిలను ఎంపీగా పోటీ చేయించడం ద్వారా ఏపీలో పార్టీకి ఊపు తీసుకరావచ్చు. ఒకవేళ ఆమె కడప నుంచి పోటీకి అంగీకరించని పక్షంలో కర్ణాటక నుంచి రాజ్యసభకు పంపించేలా కాంగ్రెస్‌ పెద్దలు ప్లాన్‌-బీ కూడా సిద్ధం చేసినట్టు కాంగ్రెస్ పార్టీ సీనియర్లు చెబుతున్నారు.

Read More
Next Story