అరెస్ట్‌ నమూనా చిత్రం

విజయవాడలో వెలుగు చూసిన ఘటన


తల్లి ప్రేమను మించింది లోకంలో మరొకటి లేదు. తల్లి తరువాతే ఎవరైనా. అందుకే పెద్దలు తల్లి, తండ్రి, గురువు, దైవం అంటారు. అందరికంటే ముందు స్థానం తల్లిది. ఆ తల్లే తప్పు చేస్తే.. ఎవరికి చెప్పాలి. ఏమిచేయాలి. కన్న వారి జీవితం ఏంకావాలి. తన పిల్లల జీవితం సంతోషంగా, సుఖమయంగా ఉండాలని ఏ తల్లైనా కోరుకుటుంది. అయితే ఓ తల్లి మాత్రం అలా కోరుకోలేదు. డబ్బు వ్యామోహంలో కొడుకును నేరస్తుడైనా పరవాలేదనుకుంది. తల్లి ప్రోత్సాహంతో నేరాలపై నేరాలు చేసి జైలు పాలయ్యాడో యువకుడు. ప్రస్తుతం కటకటాలు లెక్కిస్తున్నాడు. ఆ యువకుని పేరు కోడూరి మణికంఠ. ఎలియాస్‌ కేటీఎం పండు. విజయవాడ ఆనుకుని ఉన్న పెనమలూరు పరిదిలోని సనత్‌నగర్‌లో నివాసం. తల్లి కోడూరి పద్మావతి, ఈమె ఆగడాలు శృతిమించడంతో డిసెంబరు 12న అరెస్ట్‌ చేసి జైలుకు పంపారు. అటు కొడుకు, ఇటు తల్లి ఇద్దరూ ప్రస్తుతం జైల్లో ఉన్నారు.

4వ నిందితురాలు పద్మావతి
విజయవాడ పటమటలో 2020 మే 30న జరిగిన గ్యాంగ్‌వార్‌ ఆంధ్ర రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ప్రధాన నిందితుడు కోడూరి మణికంఠ అలియాస్‌ కేటీఎం పండు తల్లి పద్మావతిని పటమట పోలీసులు డిసెంబరు 12న అరెస్టు చేశారు. తోట సందీప్‌ అనుచరులపై 2020 మే 30న జరిగిన హత్యాయత్నం కేసులో 341, 307, 451 రెడ్‌ విత్‌ 34 అండ్‌ 120(బి) సెక్షన్ల కింద పోలీసులు అప్పట్లో కేసు నమోదు చేశారు. ఈ కేసులో మొదటి నిందితుడు కేటీఎం పండు, రెండవ నిందితుడు ప్రశాంత్, మూడోవాడు రవితేజ, నాలుగవ నిందితురాలు పద్మావతి ఉన్నారు. ఆమె మినహా మిగిలిన ముగ్గురు రిమాండ్‌లో ఉన్నారు. వారిపై పీటీ వారెంట్‌ దాఖలు చేయగా పద్మావతి అరెస్టు పెండింగ్‌లో ఉంది. ఇటీవల పద్మావతి ఆగడాలు ఎక్కువ కావడంతో పటమట పోలీసులు అరెస్టు చేసి నాలుగో అదనపు మెట్రోపాలిటన్‌ చీఫ్‌ మెజిస్ట్రేట్‌ ముందు హాజరు పరచగా జడ్జి 14 రోజుల రిమాండ్‌ విధించారు.
గ్యాంగ్‌ వార్‌ ఎందుకు జరిగింది..
2020 మే 29న రాత్రి 9 గంటలకు తోట సందీప్‌ అనే యువకుడు సనత్‌ నగర్‌లోని పద్మావతి ఇంటికొచ్చాడు. నీ కొడుకు పండును అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించాడు. ఆ రోజు తెల్లవారు ఝామున ఇంటికొచ్చిన పండుతో తల్లి పద్మావతి ఇలా అన్నది.. సందీప్‌ను చంపితేనే ఇంటికి రా.. అప్పటి వరకు ఇంటికి రాకు.. అని రెచ్చగొట్టి గొడవకు పంపింది. దీంతో పండు ఇద్దరు అనుచరులను వెంటపెట్టుకుని 2020 మే 30న ఉదయం 8 గంటలకు పటమట డొంక రోడ్డులోని సందీప్‌ ఐరన్‌ షాపు వద్దకు మరణాయుధాలతో వెళ్లాడు. షాపులో పని చేస్తున్న ముగ్గురి సిబ్బందిపై కత్తులతో దాడి చేశారు. ఈ లోపు స్థానికులు చేరుకోగా అక్కడ నుంచి పరారయ్యారు.
గ్యాంగ్‌ వార్‌.. కత్తులతో దాడి..
2020 మే 30 సాయంత్రం పటమట తోటవారి వీధిలో ఓ భూవివాదానికి సంబంధించి కేటీఎం పండు, సందీప్‌ చెరొక 30 మందిని గ్యాంగ్‌లుగా ఏర్పడి మారణాయుధాలతో జనావాసాల మధ్య దాడి చేసుకున్నారు. ఈ ఘటనలో సందీప్‌ ప్రాణాలు కోల్పోయాడు. ఈ కేసు అప్పట్లో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమైంది. ఈ కేసులో 57 మందిని పోలీసులు అరెస్టు చేసి వారిపై రౌడీషీట్లు, సస్పెక్ట్‌ షీట్లు తెరిచి, నగర బహిష్కరణ చేశారు.
ఈ గ్యాంగ్‌ వార్‌పై బాధితులు రాజేష్‌ ఘటన జరిగిన వారం తర్వాత పటమట పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా కేసు నమోదైంది. అప్పటికే ఒక గ్యాంగ్‌లోని పండు, ప్రశాంత్, రవితేజలను పోలీసులు అరెస్టు చేసి కోర్టుకు పంపడంతో కోర్టు వారికి రిమాండ్‌ విధించింది. పోలీసులు వారిపై పీటీ వారెంట్‌ దాఖలు చేశారు. పద్మావతి అరెస్టు మాత్రం పెండింగ్‌లో ఉంది. కానీ గ్యాంగ్‌వార్‌కు పద్మావతి కారణమని విచారణలో నిర్ధారించుకున్న పోలీసులు నిందితులతోపాటు ఆమెపై కూడా రౌడీషీట్‌ ఓపెన్‌ చేశారు. పెనమలూరు పోలీస్‌ స్టేషన్‌లో ఇప్పటికీ ఆమెపై రౌడీషీట్‌ ఉంది.
కోర్టు వద్ద చీర చింపుకున్న పద్మావతి
పటమట పోలీసులు పద్మావతిని మంగళవారం అరెస్టు చేసి కోర్టుకు తరలించారు. కోర్టు వద్ద తన వస్త్రాలను తానే చింపుకొని పోలీసులు తనను కొట్టారని న్యాయమూర్తికి పద్మావతి చెప్పడంతో ఆయన వైద్య పరీక్షలకు ఆదేశించారు. దీంతో పద్మావతికి వైద్య పరీక్షలు నిర్వహించగా ఆమెను ఎవ్వరూ కొట్టలేదని వైద్యపరీక్షల్లో తేలింది.
తల్లి అండతో కాల్‌మనీలోకి పండు..
పండు నివాసం ఉండేది పెనమలూరు పరిధిలోని సనత్‌నగర్‌. తన కార్యకలాపాలు విజయవాడ పటమట కేంద్రంగా నడిపేవాడు. నిత్యం కాల్‌ మనీ, భూదందాలు, సెటిల్‌మెంట్‌లు చేసేవాడు. కాల్‌మనీ చేయాలని కొడుకును తల్లి ప్రోత్సహించేది. పటమట హైస్కూల్‌ రోడ్డు, రైతు బజారు, చిన్న వంతెన సెంటరులో కాల్‌మనీ తిప్పడం, రూ. 50 వేలు తీసుకుంటే అసలు చెల్లించే వరకు వారానికి రూ. 2 వేలు వడ్డీ, రూ. లక్షకు అయితే రూ. 4 వేలు లెక్కన వసూల్‌ చేసేవాడు. రైతుబజారు వద్ద కాల్‌మనీ డబ్బును పద్మావతి స్వయంగా వచ్చి వసూలు చేసేది. ఎవరైనా నగదు చెల్లించలేకపోతే పండుతో బెదిరింపులకు గురిచేసేది. పండు ఆగడాలు శృతి మించడంతో ఈ ఏడాది ఆగస్టులో కాల్‌మనీ కేసులో పడమట పోలీసులు అరెస్ట్‌ చేసి కోర్టుకు పంపగా కోర్టు రిమాండ్‌ విధించింది. దీంతో తల్లీ, కొడుకులు కటకటాలు లెక్కిస్తున్నారు.


Next Story