స్థానిక సంస్థల ఎన్నికల్లో ఒంటరిపోరే: స్పష్టం చేసిన యూబీటీ
x
Uddhav Thackeray

స్థానిక సంస్థల ఎన్నికల్లో ఒంటరిపోరే: స్పష్టం చేసిన యూబీటీ

"భారత కూటమి, మహా వికాస్ అఘాడీతో పొత్తు లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల వరకు మాత్రమే".- శివసేన (యూబీటీ) లీడర్ సంజయ్ రౌత్.


రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇతర పార్టీలతో పొత్తుపై క్లారిటీ ఇచ్చారు రాజ్యసభ ఎంపీ, శివసేన (UBT) నాయకుడు సంజయ్ రౌత్(Sanjay Raut) ఒంటరిగానే పోటీ చేయనున్నట్లు ఆయన ప్రకటించారు. పార్టీ అధ్యక్షుడు ఉద్ధవ్ థాకరే(Uddhav Thackeray) కూడా ఈ నిర్ణయమే తీసుకున్నారని చెప్పారు. భారత కూటమి(INDIA Alliance) , మహా వికాస్ అఘాడీ(MVA)తో పొత్తు లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల వరకు మాత్రమేనని స్పష్టం చేశారు. పైగా లోక్‌సభ ఎన్నికల తర్వాత ఇండియా బ్లాక్ ఒక్క సమావేశం కూడా ఏర్పాటు చేయకపోవడాన్ని తప్పుబట్టారు.

"ఇండియా బ్లాక్‌కు కన్వీనర్‌ను కూడా నియమించలేకపోయాం. ఇది మంచిది కాదు. పొత్తులో అతిపెద్ద పార్టీగా కాంగ్రెస్ బాధ్యత తీసుకుని సమావేశం ఏర్పాటు చేయాలి," అని రౌత్ డిమాండ్ చేశారు.

అందుకే నిర్ణయం..

"పొత్తుల్లో పార్టీ కార్యకర్తలకు అవకాశాలు దక్కవు. ఇది వారిని నిరాశకు గురిచేసే అవకాశం ఉంది. మేము ముంబై, థానే, నాగ్‌పూర్, ఇతర మున్సిపల్ కార్పొరేషన్లు, జిల్లా పరిషత్తులు, పంచాయతీ ఎన్నికల్లో ఒంటరిగానే వెళ్లాలని నిర్ణయించుకున్నాం," అని పేర్కొన్నారు.

ఆ రెండు అమలు చేయాలి..

రైతు రుణమాఫీ గురించి ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ చేసిన వ్యాఖ్యలపై రౌత్ స్పందిస్తూ.. "రైతు రుణమాఫీ, లడ్కీ బహిన్ లబ్ధిదారులకు రూ. 2,100 ఇస్తామని బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోలో కనపర్చారు. ఈ రెండు వాగ్దానాలను ముందుగా అమలు చేయాలి. ఆయన ఆర్థిక మంత్రి కాబట్టి తక్షణమే అమల్లో పెట్టాలి," అని అన్నారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Modi) తన మొదటి పోడ్‌కాస్ట్‌లో తాను మానవుడిగా తప్పులు చేయవచ్చని చేసిన వ్యాఖ్యలపై రౌత్ .. "ఆయన దేవుడు. నేను మోదీని మానవుడిగా చూడను. ఆయన విష్ణువు 13వ అవతారము. దేవుడు తనను మానవుడిగా చెప్పుకుంటే ఎలా?" అని వ్యంగ్యంగా మాట్లాడారు.

Read More
Next Story