ఆప్ ఎమ్మెల్యేపై బూటు విసిరిన కాంగ్రెస్ కార్యకర్త
x

ఆప్ ఎమ్మెల్యేపై బూటు విసిరిన కాంగ్రెస్ కార్యకర్త

గుజరాత్ రాష్ట్రం జామ్‌నగర్‌లో ఘటన..


Click the Play button to hear this message in audio format

ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) ఎమ్మెల్యేపై కాంగ్రెస్(Congress) పార్టీ కార్యకర్త బూటు విసిరిన ఘటన గుజరాత్(Gujarat) రాష్ట్రంలో జరిగింది. డిసెంబర్ 5న జామ్‌నగర్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఎమ్మెల్యే గోపాల్ ఇటాలియా ప్రసంగిస్తుండగా.. వేదిక ముందు వరుసలో కూర్చున్న కాంగ్రెస్ కార్యకర్త ఛత్రపాల్‌సిన్హ్ జడేజా ఇటాలియాపై బూటు విసిరాడు. అయితే అది ఇటాలియాను తాకలేదు. వెంటనే అప్రమత్తమయిన ఆప్ కార్యకర్తలు జడేజాను చితకబాది పోలీసులకు అప్పగించారు. అయితే తనపై దాడికి పాల్పడ్డ జడేజాను పోలీసులే వేదిక వద్దకు తెచ్చారని ఇటాలియా ఆరోపించారు.

‘పోలీసులే చేయించారు..’

‘‘దాడికి కొద్దిసేపటి ముందు పోలీసుల అసాధారణ కదలికలను గమనించా. నేను మాట్లాడటం ప్రారంభించినప్పుడు వేదిక దగ్గర ఎవరూ లేరు. 15-20 నిమిషాల తర్వాత అకస్మాత్తుగా వేదిక దగ్గర పెద్ద సంఖ్యలో పోలీసు అధికారులు కనిపించారు. ఆ సమయంలో జనసమూహంలో నుంచి ఒక వ్యక్తి అకస్మాత్తుగా లేచి నిలబడి నాపై బూటు విసిరాడు. అతను దాన్ని విసిరిన వెంటనే పోలీసులు అతన్ని పట్టుకోడానికి పరుగెత్తారు. దాని అర్థం పోలీసులే అతన్ని లోపలికి తీసుకువచ్చారని స్పష్టంగా తెలుస్తుంది.” అని పేర్కొన్నారు గోపాల్ ఇటాలియా .

అనంతరం ఇటాలియా మీడియాతో మాట్లాడుతూ..తాను ఫిర్యాదు చేయాలనుకోవడం లేదని, రాజకీయ నాయకులు దూకుడు కంటే పాలనపై దృష్టి పెట్టాలని కోరారు.

"ఇక్కడ బీజేపీ(BJP) అధికారంలో ఉంది. వారి ఆధీనంలో పోలీసులు, పాలనా వ్యవస్థ ఉన్నాయి. మీరు ఆమ్ ఆద్మీ పార్టీని ఆపాలనుకుంటే.. వెళ్లి ప్రజల కోసం పని చేయండి. మాపై దాడి చేయడం లేదా చెప్పులు విసరడం వల్ల ప్రజలకు ఏ ప్రయోజనం ఉండదు. మేము అలాంటి వాటికి భయపడం" అని పేర్కొన్నారు ఇటాలియా.

ఈ ఘటన రాజకీయ ప్రత్యర్థుల్లో భయాందోళనలను ప్రతిబింబిస్తుందని ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. గుజరాత్‌లో AAPకి పెరిగిపోతున్న ప్రజాదరణను చూసి బీజేపీ, కాంగ్రెస్ ఓర్వలేకపోతున్నాయని ఆరోపించారు.

కాగా ఈ ఘటనను గుజరాత్ కాంగ్రెస్ అధ్యక్షుడు అమిత్ చావ్డా ఖండించారు. ఈ ఘటనతో పార్టీకి ఎటువంటి సంబంధం లేదని చెప్పారు.

Read More
Next Story