
అస్సాంలోని లోతట్టు ప్రాంతాలు
ఎన్నికల ముందు అస్సాంకు ఉత్తచేతులే చూపించరా?
దీర్ఘకాలిక సమస్యలకు ఎలాంటి ఉపశమనం కల్పించని బడ్జెట్
అస్సాంలో అసెంబ్లీ ఎన్నికలకు కేవలం రెండు నెలలు మాత్రమే మిగిలి ఉంది. ఈ నేపథ్యంలో కేంద్రం ప్రవేశపెట్టబోయే 2026-27 బడ్జెట్ పై ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కానీ వారందరికి రిక్త హస్తాలే మిగిలాయి.
రాష్ట్ర సమస్యలపై ఎలాంటి ప్రస్తావనలు లేవు, ప్రకృతి సమస్యలపై దీర్ఘకాలిక పరిష్కారాల ఊసే కానరాలేదు. రాష్ట్రాన్ని తరుచుగా వేధిస్తున్న వరదలు, నిరుద్యోగం, బలహీనమైన మౌలిక సదుపాయాలను పరిష్కరించడానికి సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోవాల్సింది పోయి, ఈశాన్య-కేంద్రీకృత కథనాల కింద ప్రాంతీయ హామీలను అందించింది.
తూర్పు ఈశాన్య భారతదేశం కోసం "పూర్వోదయ" దార్శనికత కింద తమ ప్రాధాన్యంగా పర్యాటకం, ఆరోగ్య సంరక్షణ, కనెక్టివిటీ రంగాలు ఉన్నాయని కేంద్ర ఆర్థికమంత్రి తన బడ్జెట్ లో పేర్కొన్నారు.
అయితే, అస్సాంలో - వరదలు ఏటా తలనొప్పిగా మారుతున్నాయి. రోడ్లు వేగంగా క్షీణిస్తున్నాయి. నదీ తీరం కోతతో వేలాది మంది సామాన్యులు స్థానభ్రంశం చెందుతున్నారు. వీటికి ఎలాంటి పరిష్కారాలు ఇందులో లేవు.
అస్సాంకు ఏమిచ్చారు.
రాష్ట్రానికి పరిమితమైన వాటిలో తేజ్‌పూర్‌లోని జాతీయ మానసిక ఆరోగ్య సంస్థను ప్రాంతీయంగా అత్యున్నత సంస్థగా అప్‌గ్రేడ్ చేయడం ఒకటి. ఈ చర్య విపత్తులకు గురయ్యే ప్రాంతంలో మానసిక ఆరోగ్యం, గాయపడిన వారి సంరక్షణను బలోపేతం చేస్తుంది. ఇది కొత్తగా నిర్మించడం కాదు. ఉన్నవాటినే అప్ గ్రేడ్ చేస్తున్నారు.
దేవాలయాలు, మఠాలు, తీర్థయాత్ర సౌకర్యాలను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ఐదు ఇతర ఈశాన్య రాష్ట్రాలతో పాటు అస్సాం కూడా కొత్త బౌద్ధ సర్క్యూట్ పథకంలో చేర్చారు. వీటికి అదనంగా, పూర్వోదయ రాష్ట్రాలలో ఐదు పర్యాటక గమ్యస్థానాలను అభివృద్ధి చేయడం, మొత్తం ఈశాన్యంలో 4,000 ఎలక్ట్రిక్ బస్సుల కేటాయింపు గురించి బడ్జెట్ లో హమీ ఇచ్చారు.
అయితే ఈ హమీలపై విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఎనిమిది రాష్ట్రాలు ఉన్న ఈశాన్యంలో అస్సాంకు వాస్తవానికి ఎన్ని బస్సులు కేటాయిస్తారని ప్రశ్నిస్తున్నారు. పర్యాటక కార్యక్రమాలు స్థానికంగా ఉపాధి లభించే వాటిగా మారుతాయా అనే సందేహాలు కూడా లేవనెత్తుతున్నారు.
కేంద్రం దాదాపు రూ. 12 లక్షల కోట్ల మూలధన వ్యయం ఖర్చు చేయనున్నట్లు ప్రకటించింది. ఇది దీర్ఘకాలికంగా కనెక్టివిటీని బలోపేతం చేస్తుంది. ఈశాన్యానికి ప్రవేశ ద్వారంగా అస్సాం పాత్రను బలోపేతం చేస్తుంది.
అయినప్పటికీ, రాష్ట్రంలోని చాలా మందికి, తక్షణ సమస్యలు ఎందుకు పరిష్కరించడంలేదనే ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు. దీర్ఘకాలికంగా ఏం చేస్తున్నారనేది వారికి నమ్మకం కలగడం లేదు.
ప్రస్తుత బడ్జెట్‌లో వరదలు, విపత్తు నిర్వహణ కోసం కొత్తగా కేటాయింపులు లేకపోవడం గమనార్హం, అస్సాంకీ గతంలో హామీ ఇచ్చిన దాదాపు రూ.27,000 కోట్ల సాయం కోసం ఎదురుచూస్తోంది.
పన్ను వికేంద్రీకరణపై సీఎం నజర్
గత సంవత్సరం బడ్జెట్‌తో పోలిస్తే ఈ సంవత్సరం మరింత మొండిచేయి ఎదురైంది. సహజంగానే ఇది రాష్ట్రంలోని రాజకీయా పార్టీల విమర్శలకు టార్గెట్ గా మారింది. 2025–26 కేంద్ర బడ్జెట్ నామ్రప్‌లో రూ. 10,600 కోట్లకు పైగా పెట్టుబడితో కొత్త 12.7 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా, అమ్మోనియా ప్లాంట్‌ను కేటాయిస్తున్నట్లు ప్రకటించింది.
ఈ ప్రకటనతో రాష్ట్రంలో ఉద్యోగాలు, పారిశ్రామిక వృద్ధి జరుగుతుందని ఆశలు రేకెత్తించింది. ఈ సంవత్సరం బడ్జెట్లో అలాంటి పారిశ్రామిక ప్రోత్సాహం లేవు. అయితే అస్సాం ముఖ్యమంత్రి హిమాంత బిశ్వ శర్మ మాట్లాడుతూ.. 16 వ ఆర్థిక సంఘం సిఫార్సుల ప్రకారం తమకు ఎక్కువ నిధులు వస్తాయని ఆశించారు.
దీని ప్రకారం అస్సాంకు వచ్చే నిధులు రూ. 1.4 లక్షల కోట్లుగా ఉండబోతున్నాయి. "16వ ఆర్థిక సంఘం సిఫార్సులను అధికారికంగా ఆమోదించడం వల్ల పన్ను వికేంద్రీకరణలో అస్సాం వాటా 3.128 శాతం నుంచి 3.258 శాతానికి పెరుగుతుందని, అభివృద్ధికి ఎక్కువ ఆర్థిక బలం అందిస్తుందని భావిస్తున్నారు. ఈ బడ్జెట్ ద్వారా మన రాష్ట్రానికి బదిలీ అయ్యే మొత్తం గణనీయంగా పెరుగుతుంది" అని శర్మ అన్నారు.
ప్రతిపక్షం ఏమంటుంది..
కాంగ్రెస్ నాయకుడు, మాజీ రాజ్యసభ ఎంపీ రిపున్ బోరా మాట్లాడుతూ.. బడ్జెట్‌లో "అస్సాంకు ఏమీ లేదు" అని నిర్మొహమాటంగా అన్నారు. ముఖ్యంగా వరద, విపత్తు నిర్వహణకు నిధులు లేకపోవడాన్ని హైలైట్ చేశారు.
"అస్సాం ఇంకా వరద, విపత్తు నిర్వహణ కోసం కేంద్రం నుంచి రూ. 27,000 కోట్లు అందుకోలేదు, దాని గురించి ఎటువంటి ప్రస్తావన లేదు" అని బోరా విమర్శించారు. ఈశాన్య ప్రాంత అభివృద్ధి మంత్రిత్వ శాఖ (DoNER) కింద నిధుల విడుదలలో జాప్యం జరిగిందని ఆయన ఆరోపించారు.
బడ్జెట్ "కార్పొరేట్ అనుకూలంగా ఉంది" అని అభివర్ణించారు. ఇది MSMEలు, గ్రామీణ మౌలిక సదుపాయాలు, పేదరిక నిర్మూలన, గ్రామీణ పాఠశాలలు, ఆరోగ్య సంరక్షణను నిర్లక్ష్యం చేసిందని ఆరోపించారు. నిరంతర ఆర్థిక, పర్యావరణ సవాళ్ల మధ్య ఎన్నికలలోకి అడుగుపెడుతున్న రాష్ట్రానికి, కేంద్ర బడ్జెట్ 2026–27 ఎటువంటి ఉపశమనం కలిగించలేదు.
Next Story

