Congress | ‘పెద్ద చేపలను కాపాడేందుకు చిన్న చేపలను చంపేస్తారేమో..’
x
Vijay wadettiwar

Congress | ‘పెద్ద చేపలను కాపాడేందుకు చిన్న చేపలను చంపేస్తారేమో..’

మహారాష్ట్ర‌లోని బీడ్‌ గ్రామ సర్పంచ్ సంతోష్ దేశ్‌ముఖ్‌ హత్యోదంతంపై కాంగ్రెస్ లీడర్ విజయ్ వాడెట్టివార్ (Vijay Wadettiwar) కీలక వ్యాఖ్యలు చేశారు.


మహారాష్ట్ర(Maharashtra)లో బీడ్‌ గ్రామ సర్పంచ్ సంతోష్ దేశ్‌ముఖ్‌ (Santosh Deshmukh) హత్యను ప్రతిపక్షాలు మహాయుతి (Mahayuti) కూటమి ప్రభుత్వంపై విమర్శనాస్ట్రాలు ఎక్కుపెట్టాయి. రాష్ట్రంలో శాంతిభద్రతలు గాడితప్పాయంటూ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌(Devendra Fadnavis)ను టార్గెట్ చేస్తూన్నాయి. తాజాగా ఈ హత్యోదంతంపై కాంగ్రెస్ లీడర్ విజయ్ వాడెట్టివార్ స్పందించారు. పెద్ద చేపలను కాపాడేందుకు చిన్న చేపలను ఎన్‌కౌంటర్‌ చేయవచ్చని అన్నారు. గురువారం నాగ్‌పూర్‌లో ఆయన విలేఖరులతో మాట్లాడుతూ.. పోలీసులు వాల్మిక్ కరాద్‌కు అనుకూలంగా నడుచుకున్నారని, పోలీస్ స్టేషన్‌కు పడకలు ఎవరి కోసం తీసుకెళ్లారో చెప్పాలని డిమాండ్ చేశారు.

మాట నిలబెట్టుకుంటారా?

గురువారం జరగనున్న మహారాష్ట్ర మంత్రివర్గ సమావేశం గురించి ప్రశ్నించగా.. ‘‘ఎన్నికల వేళ మహాయుతి కూటమి నేతలు ఇచ్చిన హామీలు ఎప్పుడు నెరవేరుస్తారా? అని రాష్ట్ర ప్రజలు ఎదురు చూస్తున్నారు. ‘లడ్కీ బహిన్’ పథకం కింద ఆర్థిక సాయాన్ని పెంచుతామన్నారు. రైతుల రుణాలను పూర్తిగా మాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. మరి వాటిని నెరవేరుస్తారో, లేదో చూస్తాం,’’ అని విజయ్ అన్నారు.

లడ్కీ బహిన్ యోజనతో ప్రభంజనం..

గత మహాయుతి ప్రభుత్వ హయాంలో ప్రారంభించిన లడ్కీ బహిన్ యోజన (Ladki Bahin Yojana) పథకానికి మంచి ప్రజాదరణ లభించింది. నవంబర్ 2024లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో కూటమి భారీ విజయానికి దోహదపడింది. ‘లడ్కీ బహిన్’ కొనసాగుతుందని, తాము మళ్లీ అధికారంలోకి వస్తే ఈ పథకం ద్వారా అందే రూ. 1500 ఆర్థిక సాయాన్ని రూ.2100కు పెంచుతామని ఎన్నికలకు ముందు మహాయుతి కూటమి నేతలు హామీ ఇచ్చారు.

కిడ్నాప్ ఆపై హత్య..

విండ్‌మిల్ కంపెనీ నుంచి డబ్బు డిమాండ్ చేయడాన్ని వ్యతిరేకించిన సంతోష్ దేశ్‌ముఖ్‌ను డిసెంబర్ 9న కొందరు కిడ్నాప్ చేసి హతమార్చారు. ఈ హత్యకు సంబంధించి ఇప్పటికే పోలీసులు ముగ్గురిని (ప్రతీక్ ఘ్లే, జయరామ్ ఛటే, మహేష్ కేదార్) అరెస్టు చేశారు. మరో ముగ్గురు (సుదర్శన్ ఘూలే, సుధీర్ సాంగ్లే మరియు కృష్ణ అంధలే) పరారీలో ఉన్నారు. ఈ కేసులో సహనిందితుడిగా ఉన్న మహారాష్ట్ర ఎన్‌సీపీ (NCP) మంత్రి ధనంజయ్(Dhananjay) ముండే సన్నిహితుడు వాల్మిక్ కరాద్ మంగళవారం పూణెలో పోలీసుల ఎదుట లొంగిపోయాడు. అదే రోజు బీడ్ జిల్లాలోని కేజ్‌లోని కోర్టుకు తీసుకెళ్లి 14 రోజుల పోలీసు కస్టడీకి తరలించారు. దేశ్‌ముఖ్ హత్యను దర్యాప్తు చేసేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం బుధవారం 10 మంది సభ్యులతో కూడిన ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేసింది.

Read More
Next Story