వీళ్లసలు టీచర్లా? కీచకులా? 8వ తరగతి విద్యార్థినిపై గ్యాంగ్ రేప్
x
ప్రతికాత్మక చిత్రం

వీళ్లసలు టీచర్లా? కీచకులా? 8వ తరగతి విద్యార్థినిపై గ్యాంగ్ రేప్

కంచె చేనును మేస్తే ఇక దిక్కెవరు? గురువులే కీచకులైతే పిల్లలకు దిక్కెవరు? సభ్యసమాజం తలవంచుకునే ఈ సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో తీవ్ర సంచలనంగా మారింది.


కంచె చేనును మేస్తే ఇక దిక్కెవరు? గురువులే కీచకులైతే పిల్లలకు దిక్కెవరు? తల్లిదండ్రుల తర్వాతిస్థానం గురువులది. విద్యాబుద్ధులు నేర్పించాల్సిన వారే అభం శుభం తెలియని ఆడపిల్లల మీద ఎగబడితే తల్లిదండ్రులు వాళ్ల పిల్లల్ని స్కూళ్లకు పంపగలుగుతారా? చదువు చెప్పించగలుగుతారా? ఒకరా ఇద్దరా? 57 ఏళ్ల వ్యక్తి మొదలు 37 ఏళ్ల వాడి వరకు వరుసగా ఓ విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడిన సంఘటన ఇప్పుడు దేశాన్ని కలవరపరుస్తోంది. ఈ ఘోర దుర్ఘటన ఇప్పుడు తమిళనాడు రాష్ట్రాన్ని కుదిపేస్తోంది.
13 ఏళ్ల బాలికపై ఇంత దారుణమా..
ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల్లో ఉండే తమిళ ప్రాంతం కృష్ణగిరి. సభ్యసమాజం తల దించుకునే ఘటన అక్కడకు దగ్గర్లోని ఓ సర్కారీ పాఠశాలలో జరిగింది. కృష్ణగిరికి సమీపంలో ఓ ప్రభుత్వ పాఠశాల ఉంది. ఆ స్కూలుకు వచ్చే ఓ విద్యార్థినిపై కామాంధులైన ఓ ముగ్గురు అయ్యవార్ల కన్నుపడింది. ఓ పేదింటికి చెందిన ఓ బాలిక ఆ స్కూల్లో 8వ తరగతి చదువుతోంది. ఆ పిల్ల పేదరికాన్నీ, గురువుల పట్ల ఉండే విధేయతను ఆసరా చేసుకున్న ఈ టీచర్లు కీచకఅవతారం ఎత్తారు. ఒకరికి తెలియకుండా మరొకరు ఆ అమ్మాయిపై లైంగిక దాడికి పాల్పడ్డారు. సుమారు మూడు నాలుగు నెలలుగా ఈ కీచరపర్వం నడుస్తుండడంతో వీళ్ల దాడికి భయపడి ఆ బాలిక స్కూలుకు వెళ్లడం మానేసింది. ఇంతలో ఆ బాలిక గర్భం దాల్చింది. నిరుపేద కుటుంబం కావడంతో ఎవరికీ చెప్పుకోలేక పరువు కోసం భయపడి ఆ బాలికను స్కూలు మాన్పించారు. నెలరోజులైనా ఆ పాప స్కూలుకు రాలేదు. తమిళనాడు విద్యాశాఖ రూల్స్ ప్రకారం ఎవరైనా విద్యార్థి స్కూలుకు రాకపోతే ఎందుకు రాలేదో ప్రధానోపాధ్యాయుడు కనుక్కోవాలి. దీంతో ఆ ప్రధానోపాధ్యాయుడు సహచర విద్యార్థినులను ఆరాతీయగా సరైన సమాధానం రాలేదు. ఇక లాభం లేకపోవడంతో ఆయన ఆ బాలిక ఇంటికి వెళ్లారు. అక్కడ ఆ బాలిక తల్లి చెప్పిన విషయం తెలిసి గతుక్కుమన్నారు. "మా అమ్మాయి గర్భం దాల్చిందిి. మీ పంతుళ్లు చేసిన దుర్మార్గమే ఇందుకు కారణం. అబార్షన్‌ చేయించడానికి ఆస్పత్రికి తీసుకెళుతున్నాం" అని ఆమె చెప్పడంతో నివ్వెరపోయారు. పాఠశాలలో పని చేస్తున్న ముగ్గురు ఉపాధ్యాయులు బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడినట్లు తెలిసింది.
ప్రధానోపాధ్యాయుడి సూచన మేరకు బాలిక తల్లిదండ్రులు జిల్లా బాలల భద్రతాధికారులకు ఫిర్యాదు చేశారు. అధికారులు బాలికను ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించి పరీక్షలు చేయించారు. అనంతరం బర్గూర్‌ ఆల్‌ ఉమన్‌ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. బర్గూర్‌ డీఎస్పీ నేతృత్వంలోని మహిళా పోలీసులు ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులైన పారూరైకు చెందిన 57 ఏళ్ల చిన్నసామి, మత్తూర్‌కు చెందిన 45 ఏళ్ల ఆరుముగం, మేలపట్టికి చెందిన 37 ఏళ్ల ప్రకాశ్‌ అదుపులోకి తీసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
ఈ వ్యవహారం బయటకు రావడంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. మొత్తం స్కూళ్లను తనిఖీ చేయాల్సిందిగా విద్యాశాఖను ఆదేశించింది. ప్రస్తుతం ఈ సంఘటన సామాజిక మాధ్యమాల్లో దుమారం రేపుతోంది.
Read More
Next Story