అవినీతి ఆరోపణలతో అదనపు జిల్లా మేజిస్ట్రేట్ ఆత్మహత్య
పెట్రోల్ బంకు ఏర్పాటుకు అవసరమైన ఎన్ఓసీ ఇచ్చేందుకు లంచం తీసుకున్నారని ఆరోపించడంతో అడిషనల్ డిస్ట్రిక్ మేజిస్ట్రేట్ ఆత్మహత్య చేసుకున్నారు.
కన్నూర్ అదనపు జిల్లా మేజిస్ట్రేట్ (ADM) నవీన్ బాబు మంగళవారం (అక్టోబర్ 15) పల్లిక్కున్నులోని తన అధికారిక నివాసంలో శవమై కనిపించారు. సోమవారం (అక్టోబర్ 14) ఆయన బదిలీ వీడ్కోలు కార్యక్రమానికి హాజరయిన కన్నూర్ జిల్లా పంచాయతీ అధ్యక్షురాలు, సీపీఎం నాయకురాలు కార్యక్రమంలో అందరి ముందు పెట్రోల్ పంప్‌కు నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ (ఎన్‌వోసీ) ఇచ్చేందుకు ఏడీఎం అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. మొదట్లో ఎన్‌వోసీ ఇవ్వని ADM..బదిలీకి ముందు ఇచ్చారని, దాన్ని కూడా ఎలా పొందాల్సి వచ్చిందో తనకు బాగా తెలుసని మాట్లాడారు. ఆయనకు ధన్యవాదాలు చెప్పడానికి నేను ఇక్కడ వచ్చానని అనడంతో కార్యక్రమానికి వచ్చిన వారు ఆశ్చర్యపోయారు. వీడ్కోలు కార్యక్రమం ముగిసిన తర్వాతి రోజు ADM తన క్వార్టర్‌లో ఉరి వేసుకుని కనిపించాడు.
‘రూ. లక్ష లంచం తీసుకున్నారు’
‘‘ఓబీసీ కోటాలో పెట్రోల్ బంకు పెట్టుకునేందుకు నాకు అవకాశం వచ్చింది. అయితే ఎన్‌ఓసీ కోసం ADMకు దరఖాస్తు చేసుకున్నా. ఆయన సర్టిఫికెట్ ఇచ్చేందుకు రూ.లక్ష లంచం డిమాండ్ చేశారు. ఈ విషయాన్ని జిల్లా పంచాయతీ అధ్యక్షురాలి దృష్టికి తీసుకెళ్లా. ఆమె చెప్పినా వినలేదు. చివరకు లంచం తీసుకుని ఫైల్‌పై సంతకం చేశాడని దివ్యకు చెప్పాను. ఆమె సీఎంవోకు అధికారికంగా ఫిర్యాదు చేయమని సలహా ఇచ్చారు.” అని పెట్రోల్ బంకు మంజూరయిన ప్రశాంత్ మీడియాకు చెప్పారు.
(ఆత్మహత్యలను నివారించవచ్చు. సహాయం కోసం దయచేసి ఆత్మహత్య నివారణ హెల్ప్‌లైన్‌లకు కాల్ చేయండి: నేహా ఆత్మహత్య నివారణ కేంద్రం - 044-24640050; ఆసరా హెల్ప్‌లైన్ - +91-9820466726; కిరణ్, మానసిక ఆరోగ్య పునరావాసం - 590000 0019, దిశ 0471- 2552056, మైత్రి 0484 2540530, మరియు స్నేహ ఆత్మహత్యల నివారణ హెల్ప్‌లైన్ 044-24640050.)