కర్ణాటక సీఎం సిద్ధరామయ్యకు అధిష్ఠానం అండ..
కర్ణాటక సీఎం సిద్ధరామయ్యకు కాంగ్రెస్ అధిష్ఠానం బాసటగా నిలిచింది. ఆయనకు ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే మద్దతు ప్రకటించారు.
కర్ణాటక సీఎం సిద్ధరామయ్యకు కాంగ్రెస్ అధిష్ఠానం బాసటగా నిలిచింది. ఆయనకు ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే మద్దతు ప్రకటించారు. మైసూరు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (ముడా) స్థలాల కేటాయింపు కేసులో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న సిద్ధరామయ్య.. వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని ప్రతిపక్షాలు పట్టుబడుతున్నాయి. అయితే తాను ఏ తప్పు చేయలేదని, ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీనామా చేసే ప్రసక్తే లేదని సిద్ధరామయ్య తేల్చి చెప్పారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ చీఫ్ ఖర్గే సీఎం పక్షాన నిలిచారు. కర్ణాటకలోని ప్రతిపక్షాలకు ఆయన కొన్ని ప్రశ్నలు సంధించారు. ‘‘ సిద్ధరామయ్యపై ఇంకా ఛార్జిషీట్ వేయలేదు. దోషిగా తేల్చలేదు. చట్టం తన పని తాను చేసుకుపోతుంది. పరిస్థితులను బట్టి అధిష్టానం నిర్ణయం తీసుకుంటుంది. గోద్రా ఘటన జరిగినప్పుడు (నరేంద్ర) మోదీ జీ (అప్పటి గుజరాత్ సీఎంగా) రాజీనామా చేశారా? ఆ సమయంలో ఆయనపై అనేక కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. మిస్టర్ షా (కేంద్ర హోం మంత్రి అమిత్ షా)పై కూడా. పారిశ్రామికవేత్తలు కోట్ల రూపాయలను మింగారు. వారికి రూ. 16 లక్షల కోట్లు మాఫీ చేశారు. ఇప్పుడు ఒక చిన్న మొత్తం గురించి రచ్చ చేస్తున్నారు. వ్యక్తిని టార్గెట్ చేసి కాంగ్రెస్ పార్టీని దెబ్బతీయడమే లక్ష్యంగా పెట్టుకున్నారు.’’ అని విలేఖరులతో అన్నారు.
సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటాం..
ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన తర్వాత కూడా ముఖ్యమంత్రిని కొనసాగిస్తుందా? అని అడిగిన ప్రశ్నకు.. సిద్ధరామయ్య పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఆయనకు మేం మద్దతు ఇస్తాం. జరుగుతున్న పరిణామాలను పార్టీ గమనిస్తుంది. అవసరమైన సమయంలో నిర్ణయం తీసుకుంటాం.’’ అని ఖర్చే బదులిచ్చారు. సిద్ధరామయ్యపై విచారణ జరపాలని లోకాయుక్త పోలీసులకు బుధవారం ప్రత్యేక కోర్టు ఆదేశించింది. ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదు చేసే ప్రయత్నాల్లో ఉన్నారు.
గవర్నర్ ఉత్తర్వులను సమర్థించిన కోర్టు..
భార్య బీఎం పార్వతికి 14 స్థలాల కేటాయింపులో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలపై సిద్ధరామయ్యపై విచారణ జరిపేందుకు గవర్నర్ థావర్‌చంద్ గెహ్లాట్ గతంలో అనుమతి ఇచ్చారు. గవర్నర్ ఏకపక్షంగా వ్యవహరించారని ఆయనను తప్పుబడుతూ సిద్ధరామయ్య హైకోర్టు ఆశ్రయించారు. విచారించిన ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి సంతోష్ గజానన్ భట్ గవర్నర్ ఉత్తర్వులు సబబేనని తీర్పు చెప్పారు.